Wedding Planning Tips: వెడ్డింగ్ ప్లానింగ్ టిప్స్.. ఇలా చేస్తే కూల్
25 November 2022, 13:30 IST
- Wedding Planning Tips: వెడ్డింగ్ ప్లానర్స్‌ను అరేంజ్ చేసుకోవాలంటే పెళ్లికి ముందే వాచిపోతుంది. అందుకే మీరే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ప్లానింగ్ ఉంటే వివాహ వేడుకలో టెన్షన్ ఉండదు
కంగ్రాట్స్.. పెళ్లి కుదిరింది. ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తికాబోతోంది. అయితే వివాహ వేడుక గురించి టెన్షన్ పడుతున్నారా? నో వర్రీస్.. కాస్త ఓపిగ్గా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే మీ వివాహం ఒక మధురమైన మెమొరీగా మిగిలిపోతుంది. వెడ్డింగ్ ప్లానింగ్‌లో ఇప్పుడు కొన్ని టిప్స్ మీకోసం..
1. మనసు మాట వినకండి
అదేంటి మనసు మాట వినద్దనే సలహా ఏంటండి బాబూ అనుకోకండి. అవును మనసు మాటను పక్కన పెట్టి జేబు మాటనే వినండి. వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అంతిమంగా భారం పడేది మీజేబు పైనే. మీ బడ్జెట్‌ను బట్టే ప్లాన్ చేసుకోండి. కాబోయే భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో మనసు మాట వినండి. ఇక్కడ మాత్రం అస్సలు కాదు.
2. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం మీదే అవ్వాలి..
నలుగురూ ఏమనుకుంటారో అనో, ఇతరులను ఇంప్రెస్ చేద్దామనో నిర్ణయాలు తీసుకుంటే వాటి ఫలితాలకు మీరే బాధ్యులవుతారు. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న డిజైన్ ఇదే అని, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే అని వాటిపై మొగ్గు చూపారో.. మీ ప్లాన్ దెబ్బతింటుంది. మీకు ఏది కంఫర్ట్ అయితే అదే చేసేయండి. సొసైటీ గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. మీరు చేసినా అంటారు. చేయకపోయినా అంటారు. పెద్దలు చెప్పే వాటిలో లాజిక్, రీజనింగ్ లేకపోతే వారిని ప్రశ్నించండి.
3. పేపర్ జాబితా మీద పెట్టండి..
వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మీ మెదడులో నిక్షిప్తం చేసుకుంటే సరిపోద్దని అనుకోకండి. ప్రతి విషయం పేపర్‌పై ఎస్టిమేషన్స్ రూపంలో రాయాలి. వెడ్డింగ్ కార్డ్స్ చేరాల్సిన అతిథుల దగ్గరి నుంచి మెటిరియల్ సప్లై చేసే వారి వరకు అందరి వివరాలను వేర్వేరు పేజీల్లో రాసుకోండి. అలాగే వివాహ వేడుకలకు అవసరమైన సేవలు అందించే వారి వివరాలు కూడా నమోదు చేయండి. అంటే దుస్తులకు మగ్గం వర్క్ చేసే బొటిక్స్, బ్యూటిషియన్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ సేవలు, ట్రాన్స్‌పోర్ట్ సేవలు ఇలా చాలా ఉంటాయి. వాటి వివరాలు, వారు సమయానికి అందుబాటులో లేకపోతే ఆల్టర్నేట్‌గా కొన్ని కాంటాక్టులు ఉంచుకోవాలి.
4. బడ్జెట్ పద్దులు రాస్తూ ఉండండి..
పెళ్లంటే తెలియకుండానే ఖర్చయిపోతుంది. ముందుగా మీరు వేసుకున్న బడ్జెట్ అంచనాల్లోనే మీ వాస్తవ ఖర్చులు ఉంటున్నాయా లేక ఇంకా ఏమైనా అప్పులు చేయాల్సి వస్తుందా అన్న అంచనా కోసం ఎప్పటికప్పుడు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్కను రాసిపెట్టాలి. అడ్వాన్స్ పేమెంట్లు, పేమెంట్లు అన్నీ రాసిపెట్టుకుంటే.. తరువాత కూడా ఎలాంటి తలనొప్పి ఉండదు.
5. ఆన్‌లైన్‌పైనే ఆధారపడకండి
ఆన్‌లైన్ మనకు చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది. కానీ ఒక్కోసారి ఆయా వస్తువులు మనకు నచ్చినట్టు రాకపోవచ్చు. దుస్తుల డిజైన్, రంగులు, సైజులు ఇలాంటివి చివరి నిమిషంలో సమస్య అయి కూర్చుంటాయి. అలాగే కొన్ని వస్తువుల నాణ్యత కూడా మనం దగ్గరుండి పరిశీలిస్తే తప్ప అర్థం కావు. అందువల్ల వాట్సాప్, ఈకామర్స్‌పై ఆధారపడకుండా కొన్నింటిని మీరు దగ్గరుండి చూస్తేనే అర్థం అవుతుంది.
6. సేవలు అందించే వారిని కలవండి
వీలైతే మీ వివాహానికి సేవలు అందించే వారిని వ్యక్తిగతంగా కలవండి. ఒక్కోసారి వారి ప్రవర్తను మీకు చికాకు తెప్పిస్తుంది. అసలే మీరు అలిసి పోయి ఉంటారు. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్, వంటి వారిని ముందుగా పరిచయం చేసుకోవడం వల్ల వారి ప్రవర్తనను మీరు అంచనా వేయవచ్చు. వారు సమయానికి సేవలు అందించగలరా? వారిలో తగిన ఓపిక ఉందా వంటి అంశాలు కూడా పరిశీలించవచ్చు.
7. అతిథులను ఆకట్టుకునేలా చిరునామా
చాలా మంది ఇప్పుడు గూగుల్ మ్యాప్ లేనిదే బయటకు అడుగుపెట్టడం లేదు. ఎందుకంటే ఆలోచించేంత టైమ్ కూడా ఉండడం లేదు. పైగా అంత సమయం వృథా చేయడం ఎందుకు అనే ఫీలింగ్. అందువల్ల మీరు ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డుతో పాటు వీలైతే డిజిటల్‌గా వాట్సాప్ ద్వారా పెళ్లి మండపం చిరునామా కోసం గూగుల్ మ్యాప్ షేర్ చేయండి. అలాగే అక్కడి చేరుకోవడానికి బస్సు, రోడ్డు, రైలు మార్గాలను కూడా వివరించండి. మీరు పర్సనల్‌గా వెళ్లి కార్డ్ ఇచ్చే సమయం దొరకనప్పుడు కనీసం వీడియో కాల్ ద్వారా అయినా మాట్లాడండి. టెక్నాలజీ వాడుకోవడంలో తప్పేం లేదు.
8. మీ భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకోండి..
కొన్నిసార్లు వివాహ వేడుకల్లో వధూవరుల కుటుంబాల మధ్య చిన్నచిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. చాలా చిన్న విషయాల్లో కూడా పట్టింపులు ఉంటాయి. సర్దుకుపోయే అవకాశం ఉన్నా అహానికి వెళ్లి అభాసుపాలవుతారు. అందువల్ల మీ భాగస్వామితో అన్ని విషయాలు సానుకూలంగా చర్చించుకోండి. వారి ఇష్టాఇష్టాలు తెలుసుకోండి. ప్రేమంటే ఇతరుల ఇష్టాలను గౌరవించడమే కదా.
9. ఫుడ్ నాణ్యంగా ఉండేలా చూసుకోండి
మీ వివాహం మీ ఇష్టం. మీరు ఎలా అయినా ఎంజాయ్ చేసుకోండి. కానీ అతిథులు ఆనందంగా ఉండాలంటే మాత్రం మంచి నాణ్యమైన, రుచికరమైన భోజనం అరేంజ్ చేయడం మీ ధర్మం. మెనూలో ఎన్ని అయిటమ్స్ ఉన్నాయన్నది కాదు.. తిన్న నాలుగు మెతుకులు రుచికరంగా ఉన్నాయా? నాణ్యంగా ఉందా? అన్నదే ముఖ్యం. మెనూ ఐటమ్స్ మీ కుటుంబంలోని అందరితో చర్చించుకుని డిసైడ్ చేసుకోవడం మంచిది. వధూవరుల కుటుంబాలు కూడా ఈ చర్చలో పాల్గొంటే ఇంకా మంచిది.
10. కళ్యాణ మండపాల ఎంపికలో జాగ్రత్త
ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రహదారులకు ఆనుకుని ఉండే కళ్యాణ మండపాల్లో వధూవరులకు సంబంధం లేని వారు ఎందరో భోజనాలకు ఎగబడతారు. దీని వల్ల అసలు అతిథులకే భోజనాలు సరిపోవు. భోజనమే కదా తింటే ఏముందిలే అనుకుంటే మంచిదే. మరి అందరికీ సరిపోవాలంటే మీ అతిథుల సంఖ్య కంటే ఎక్కువ మందికే ఆహారం సిద్ధం చేసుకోవాలి. లేదంటే ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న కళ్యాణ మండపాలు ఎంచుకోవడం మంచిది.
11. డిజైన్ల కోసం, టూర్ల కోసం టైమ్ కేటాయించండి
చాలా డిజైన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. పెళ్లి బట్టలు, ఫోటో ఆల్బమ్స్, జువెల్లరీ డిజైన్స్, మగ్గం వర్క్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి పందిరి, డెకొరేషన్ డిజైన్స్.. ఇలా చాలా డిజైన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం తగిన సమయం షెడ్యూలు చేసుకోండి. అలాగే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కోసం కూడా సమయం అవసరం. అందువల్ల మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే లీవ్స్ ప్లాన్ చేసుకోండి.
టాపిక్