Green Fish Fry: గ్రీన్ ఫిష్ ఫ్రై, పచ్చి చింతకాయతో చేసే చేపల వేపుడు, ఇది తింటే జీవితంలో మర్చిపోలేరు
10 October 2024, 11:30 IST
- Green Fish Fry: చేపల వేపుడు అంటే ఎంతో మందికి ఇష్టం. ఓసారి కొత్తగా గ్రీన్ ఫిష్ ఫ్రై చేయండి. పచ్చి చింతకాయతో చేసే వేపుడు రుచి అదిరిపోతుంది.
గ్రీన్ ఫిష్ వేపుడు
Green Fish Fry: చేపలు, చింతకాయలు... రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. నాన్ వెజ్ ప్రియులకు చేపల వేపుడు పేరు చెబితేనే నోరూరి పోతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి కొత్తగా పచ్చి చింతకాయలతో గ్రీన్ ఫిష్ ఫ్రై చేసి చూడండి. మీకు నచ్చిన చేపను వేపుడుగా చేసేందుకు ఎంచుకోండి. పచ్చి చింతకాయలను కూడా ఏరి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ రెండింటితో ఎంత సులువుగా గ్రీన్ ఫిష్ ఫ్రై చేయాలో తెలుసుకోండి. వీటికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. చాలా సులువుగా చేసేయొచ్చు. గ్రీన్ ఫిష్ ఫ్రై రెసిపీని ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి. సాధారణ ఫిష్ ఫ్రై తో పోలిస్తే గ్రీన్ ఫిష్ ఫ్రై ఆరోగ్యానికి కూడా ఎక్కువ పోషకాలను అందిస్తుంది.
పచ్చి చింతకాయతో చేపల వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - ఐదు
పచ్చి చింతకాయలు - నాలుగు
నూనె - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - ఒకటి
జీలకర్ర - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
కారం - ఒక స్పూను
పచ్చి చింతకాయతో చేపల వేపుడు రెసిపీ
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పచ్చి చింతకాయలను తీసుకొని కడిగి పైన చెక్కును తీసేయాలి.
3. రోట్లో పచ్చి చింతకాయలను, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. అందులోనే ఉప్పును కూడా చేసి దంచుకోవాలి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
5. ఆ మిశ్రమంలోనే కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలకు పచ్చి చింతకాయ మిశ్రమాన్ని బాగా పట్టించాలి.
7. పది నిమిషాలు పాటు ఫ్రిజ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దానిమీద నూనె వేయాలి.
9. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ చింతకాయ చేపల వేపుడు రెడీ అయినట్టే.
10. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ.
11. పుల్లపుల్లగా కారం కారంగా చేపల వేపుడు అదిరిపోతుంది.
ఒక్కసారి పచ్చి చింతకాయతో చేపల వేపుడు చేసుకొని చూడండి. దీని రుచికి మీరు దాసోహం అయిపోతారు. చేపలు, చింతకాయలు రెండూ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మలేరియా రాకుండా అడ్డుకోవడంలో చింతకాయ అమోఘంగా పనిచేస్తుంది. చర్మకాంతిని కూడా పెంచుతుంది. కాలేయానికి చింతకాయ చేసే మేలు ఎంతో. చేపల్లో ఉండే పోషకాలు కూడా మనకు అవసరమైనవే. చేపల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది మనల్ని ఒత్తిడి, ఆందోళన బారిన పడకుండా కాపాడతాయి.