Adventures activities in India: సాహసం మీ ఇంటి పేరా.. ఈ టూర్ తప్పక వెళ్లాల్సిందే
25 January 2023, 15:07 IST
- Adventures activities in India: ఇండియాలో ఉన్న అడ్వెంచరస్ లొకేషన్స్, అక్కడ ఉన్న యాక్టివిటీస్ ఇక్కడ తెలుసుకోండి.
ఇండియాలో సాహసోపేత యాక్టివిటీస్ ఉన్న ప్రదేశాలు
ఇండియాలో చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేసేందుకు చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వత శిఖరాలు, మనోహరమైన నదులు, అందమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. సాహసేపేత యాత్రలు చేయాలనుకునే ట్రావెలర్స్‌కు చాలా ఆప్షన్లు ఉన్నాయి. తూర్పున పీఠభూములు, పశ్చిమ కనుమలు, ఉత్తరాన ఎత్తయిన ప్రాంతాలు, దక్షిణాన తీర ప్రాంతాలు.. ఇలా సాహసోపేత కార్యక్రమాల ప్రియులకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరన్ ట్రావెల్స్ ఎండీ ఎ.కృష్ణమోహన్ సంబంధిత సాహసోపేత యాత్రల వివరాలను పంచుకున్నారు.
1. Scuba diving and snorkeling: స్కూబా డైవింగ్, స్నోకలెంగ్
నీటి అడుగున ఈదడం లేదా అన్వేషించడాన్ని స్కూబా డైవింగ్ అంటారు. అపారమైన నీటి అడుగున ఉన్న అద్భుతమైన జల జీవితాన్ని ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. ఇండియాలో టాప్ స్కూబా-డైవింగ్ లొకేషన్స్ గోవా, అండమాన్ ఐలాండ్స్‌లో ఉన్నాయి. అక్కడ పగడపు దిబ్బలు, అసాధారణ జల జీవులను చూడొచ్చు. ఇదొక యాక్టివిటీ మాత్రమే కాదు. మరో ప్రపంచంలో మునగడం. ఇక స్నోకలెంగ్ ఇండియాలో మరొక అడ్వెంచరస్ యాక్టివిటీ. ఇది పూర్తిస్థాయి స్నోకల్ మాస్క్ ధరించి జల వాతావరణాన్ని అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది.
2. Skiing: స్కీయింగ్
గుల్మార్గ్ సహా జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో స్కీయింగ్‌కు అవకాశం ఉంది. సాహసోపేత యాక్టివిటీ ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. గుల్మార్గ్‌లో 4 వేల మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అపర్వత్ శిఖరాన ఈ స్కీ స్లోప్ ఉంది. ఆల్పైన్, చూటె, కార్నైస్, గ్లేసియర్ ప్రాంతాల్లో విస్తారంగా ఈ స్కీ స్లోప్ ఉంది. మీకు స్కీయింగ్ నచ్చితే ఉత్తేజకరమైన అనుభవంగా మిగిలిపోతుంది.
3. Hot air balloon: హాట్ ఎయిర్ బెలూన్
జైపూర్ ఎడారి ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై సాహసయాత్ర మీకు ఉత్తేజాన్నిస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్‌లోకి ఎక్కాక మీరు గాల్లోకి అలా లేచిపోయే అనుభూతి పొందుతారు. పైనుంచి పింక్ సిటీ చూడొచ్చు. జైపూర్ ప్రకాశవంతమైన రంగులను చూడగలుగుతారు. పైనుంచి చారిత్రక ప్రదేశాలు, రాచభవనాలను చూడగలుగుతారు.
వారణాసిలో కూడా మీరు హాట్ ఎయిర్ బెలూన్ యాత్ర అనుభూతి పొందవచ్చు. అయితే ఇక్కడ పండగల సమయాల్లోనే ఇలాంటి సదుపాయం ఉంటుంది. ఈ యాత్రకు 45 నిమిషాల సమయం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం నగరాన్ని వీక్షించవచ్చు. స్థానిక పర్యాటక యంత్రాంగం ఈ యాత్రను పర్యవేక్షిస్తుంది.
స్కైవాక్ ట్రావెల్స్ ఫౌండర్ సిద్ధార్థ్ జైన్ సాహస యాత్రల గురించి వివరిస్తూ స్కై డైవింగ్ రెకమెండ్ చేశారు. ‘గాలిలో తేలియాడే అనుభవాన్ని మీరు ఒకసారి ఊహించండి. మైసూరులో ఇలాంటి స్కై డైవింగ్ అనుభవం చవిచూడొచ్చు. ఇందుకు సంబంధించి తగిన భద్రత సూచనలు పాటించాల్సి ఉంటుంది. స్కైడైవింగ్‌లో అనుభవాన్ని బట్టి వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి..’ అని వివరించారు.
జంపిన్ హైట్స్ డైరెక్టర్ నీహారిక నిగమ్ సాహసోపేతమైన టూర్ గురించి వివరించారు. ‘గోవాలో నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. బీచుల్లో ఉల్లాసంగా గడపొచ్చు. ఇది మంచి పార్టీ డెస్టినేషన్. నార్త్ గోవాలో మయేమ్ లేక్ వద్ద బంగీ జంపింగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది. అలాగే పారా సెయిలింగ్, అండర్ వాటర్ సీ వాకింగ్ ఆప్షన్లు ఉన్నాయి..’ అని వివరించారు.
రిషికేష్‌లో కూడా బంగీజంపింగ్ ఆప్షన్ ఉంది. అలాగే గంగా నదిలో రివర్ ర్యాఫ్టింగ్ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. నదిలో అక్కడక్కడ బోటు ఆపి తాడు సాయంతో నీళ్లలో ఈదేందుకు అవకాశం లభిస్తుంది.
లద్దాఖ్‌లో పారా గ్లైడింగ్ ఆప్షన్ ఉంది. సుశిక్షితులైన గైడ్ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్ చేయొచ్చు. ఆకాశంలో తేలియాడొచ్చు.