ఎనోకీ మష్రూమ్ వంటకాల గురించి భారతీయులు చాలా వెతుకుతున్నారట, ఏముంది ఇందులో?!
28 February 2022, 15:26 IST
- ఎనోకీ పుట్టగొడుగులు మిగతా పుట్టగొడుగులకు భిన్నంగా ఉంటాయి. చూడటానికి ఇవి పొడవుగా, సన్నగా, తెల్లని రంగులో ఉంటాయి. వీటిని ప్రత్యేక విధానంలో సాగుచేస్తారు. అయితే వీటితో తయారు చేసే వంటకాల కోసం భారతీయులు తెగ వెతికేస్తున్నారట.
ఎనోకీ మష్రూమ్
ఎనోకీ పుట్టగొడుగులు మిగతా పుట్టగొడుగులకు భిన్నంగా ఉంటాయి. చూడటానికి ఇవి పొడవుగా, సన్నగా, తెల్లని రంగులో ఉంటాయి. వీటిని ప్రత్యేక విధానంలో సాగుచేస్తారు. అయితే వీటితో తయారు చేసే వంటకాల కోసం భారతీయులు తెగ వెతికేస్తున్నారట. గూగుల్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం గతేడాదిలో అత్యధికంగా ఎనోకి మష్రూమ్స్ గురించే శోధించారని తెలిసింది. మరి ఇంతకీ ఏముంది ఈ మష్రూమ్ లలో వీటిని ఎలా వండుకోవచ్చో ఒక రెసిపీ అందిస్తున్నాం, మీరూ ప్రయత్నించి చూడండి.
స్టిర్ ఫ్రై ఎనోకీ మష్రూమ్. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సులభంగా తయారుచేసుకునే వంటకం ఇది.
కావాల్సిన పదార్థాలు:
200 గ్రాముల ఎనోకి పుట్టగొడుగులు
1 టేబుల్ స్పూన్ నూనె
1 టేబుల్ స్పూన్ టెరియాకి సాస్
1 టేబుల్ స్పూన్ సోయా సాస్
1 టీ స్పూన్ నల్ల నువ్వులు
1 టేబుల్ స్పూన్ ఉల్లికాడ ముక్కలు
తయారీ విధానం:
పుట్టగొడుగులకు మురికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగా వాటిని శుభ్రంగా కడగండి. ఆపై తడిపోయేంత వరకు కొద్దిగా ఆరబెట్టండి. ఇప్పుడు పుట్టగొడుగుల కింది భాగాన ఒక అంగుళం కత్తిరించండి. అనంతరం కొన్నికొన్ని తీసుకొని కట్టలుగా కట్టండి.
ఒక ప్యాన్ లో నూనెను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయండి. నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత పుట్టగొడుగులను వేయండి. అంటుకోకుండా ఉండేందుకు తరచూగా తిప్పుతూ ఉండాలి. ఇదే సమయంలో పైనుంచి కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, స్టవ్ తక్కువ ఫ్లేమ్ లోకి పెట్టుకొని టెరియాకి సాస్, సోయా సాస్‌లను వేసి బాగా కలిపి ఒక 30 సెకన్ల పాటు వేడిచేయండి. అంతే, దీనిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నువ్వులు, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. దీనిని అన్నం లేదా చపాతీతో తినవచ్చు. టేస్ట్ కొద్దిగా పుల్లపుల్లగా, తియ్యతియ్యగా అన్ని రుచులు కలిసిన ఒక కొత్త రుచి అనిపిస్తుంది. సంప్రదాయ వంటకాలకు కొంచెం మార్పు కోరుకునే వారు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు.