Foods To Reduce Sweat । చెమట వాసన రాకుండా ఉండాలంటే, వేసవిలో ఇవి తినండి!
05 May 2023, 15:17 IST
- Foods To Reduce Sweat: వేసవి అనగానే మనకు తినడానికి మామిడిపండ్లు, పుచ్చకాయలు, అవకాయలు వంటివి చాలా రకాల రుచికరమైన ఆహార పదార్థాలు గుర్తుకు వస్తాయి. కానీ చెమట, శరీర వాసన తగ్గించాలంటే ఏది పడితే అది తినకూడదు. ఏవి తినాలో న్యూట్రిషనిస్టులు సూచించారు.
Foods To Reduce Sweat
Foods To Reduce Sweat: సీజన్ మారినపుడు వాతావరణం మారుతుంది, ఇబ్బందులు మారతాయి. ఇప్పుడున్నది వేసవికాలం, మిగతా సీజన్ల కంటే వేసవిలో కొన్ని సమస్యలు అదనంగా ఉంటాయి. ఈ సీజన్ లో ఒకవైపు మండె ఎండలు, తీవ్రమైన వేడి, ఉక్కపోతలు చాలా అసౌకర్యానికి గురిచేస్తాయి. వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు కలిగిస్తాయి. ఇది మాత్రమే కాకుండా వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది దుస్తులను తడిగా చేయడంతో పాటు, అసహ్యకరమైన శరీర దుర్వాసనకు కూడా దారి తీస్తుంది.
ఈ చెమటను, శరీర దుర్వాసనను అరికట్టేందుకు సెంట్లు, డియోడరెంట్లు వంటివి ఎన్ని ఉపయోగించినా వాటి ప్రభావం కొంత సమయం మాత్రమే. అయితే కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా అధిక చెమటకు, శరీర దుర్వాసన సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చునని మీకు తెలుసా? ఈ ఎండాకాలంలో సరైన ఆహారాలను తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండవచ్చు, తాజాగా ఉండవచ్చునని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. చెమటను, శరీర దుర్వాసనను సహజంగా తగ్గించేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో సూచించారు, అవేమిటో మీరూ తెలుసుకోండి మరి.
Water-rich Fruits- నీరు ఎక్కువగా ఉండే పండ్లు
ఆపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, పైనాపిల్స్ , నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు తీసుకుంటే చెమట తక్కువగా పడుతుంది. అంతేకాకుండా నారింజ, నిమ్మకాయలు, పైనాపిల్స్ వంటి సిట్రస్ పండ్ల సహజమైన సువాసనలను శరీరం శోషించుకుంటుంది. దీంతో చర్మం తాజాగా ఉంటుంది, దుర్వాసన రాదు.
Seasonal Vegetables- సీజనల్ కూరగాయలు
భోజనంలో దోసకాయలు, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంకాయ వంటి కూరగాయలను చేర్చుకోవాలి. వీటిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చెమటను నియంత్రించడంలో సహాయపడతాయి.
Magnesium-rich Foods- మెగ్నీషియం కలిగిన ఆహారాలు
శరీరంలో మెగ్నీషియం లోపం కారణంగా చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే పాలకూర సోయా, అరటిపండ్లు, బాదం వంటి ఆహారాలు తీసుకోవాలి. మెగ్నీషియం జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Fiber- rich Foods- ఫైబర్ కలిగిన ఆహారాలు
ఓట్స్ , తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెరుగైన జీర్ణక్రియ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది తద్వారా చెమటను తగ్గిస్తుంది.
Calcium-rich Foods- కాల్షియం కలిగిన ఆహారాలు
కాల్షియం శరీరంలో వేడిని తగ్గించి, చెమటను అదుపులో ఉంచే ఒక మినరల్. కాబట్టి కాల్షియం లభించే గుడ్లు, మీగడలేని పాలు, పెరుగు ఇతర డెయిరీ ఉత్పత్తులను తీసుకోవచ్చు. అయితే అందులో కొవ్వుశాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
Olive Oil- ఆలివ్ నూనె
వంటలకు ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియలు పెరుగుతాయి. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని నివారిస్తుంది, చెమటను నియంత్రిస్తుంది.
Drink Plenty of Water- పుష్కలంగా నీరు తాగాలి
నీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చెమట సాంద్రతను తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి పుష్కలంగా నీరు తాగాలి. నీటితో పాటు మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, చక్కెర లేని పండ్ల రసాలు తీసుకోవాలి. అదే సమయంలో కోర్బోనేటెడ్ పానీయాలు, అల్కాహాల్ కలిగిన పానీయాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. మామూలు టీలకు బదులు హెర్బల్ టీలు తాగవచ్చు.