తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation: ఎవరినీ తక్కువ అంచనా వేయకండి, భవిష్యత్తులో వారి అవసరమే మీకు రావచ్చు, ఒకసారి ఈ కథ చదవండి

Wednesday Motivation: ఎవరినీ తక్కువ అంచనా వేయకండి, భవిష్యత్తులో వారి అవసరమే మీకు రావచ్చు, ఒకసారి ఈ కథ చదవండి

Haritha Chappa HT Telugu

14 August 2024, 5:00 IST

google News
    • Wednesday Motivation: పరిస్థితి బాగున్నప్పుడు ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం, వారిని చులకన చేయడం మంచిది కాదు. భవిష్యత్తులో భారీ అవసరమే మీకు పడవచ్చు. కాబట్టి ఉన్నంతలో ప్రతి ఒక్కరితో సరదాగా, సంతోషంగా సాగుతూ వెళ్లిపోవడమే ఉత్తమం.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Unsplash)

మోటివేషనల్ స్టోరీ

Wednesday Motivation: అతి పెద్ద ఎడారి. అందులో ఎన్నో రకాల కాక్టస్ చెట్లు పెరుగుతున్నాయి. ఈ నాగజెముడు, బ్రహ్మజెముడు మొక్కల మధ్య ఒక అందమైన గులాబీ చెట్టు పుట్టింది. అది ఎదుగుతూ పెద్దదయింది. దాని ఎదుగుదలను చూసి మిగతా కాక్టస్ మొక్కలు ఆనందించేవి. ఎప్పుడైతే రోజా మొక్క పెరిగి గులాబీ పువ్వులను పూయడం మొదలెట్టిందో దానిలో గర్వం పెరిగిపోయింది.

తన చుట్టూ ముళ్ళున్న మొక్కలను చూసి ఆ రోజా మొక్క అసహ్యించుకునేది. తాను ఇంత అందంగా, ఎంతో చక్కని పువ్వులను అందిస్తున్నానని మురిసిపోయేది. ఇలాంటి అందవిహీనమైన మొక్కల మధ్య ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నానంటూ మాట్లాడేది. ఆ మాటలను విన్న కాక్టస్ మొక్కలు ఏమీ అనేవి కాదు. చిన్నగా నవ్వి ఊరుకునేది. మిగతా మొక్కలు ‘అలా అనద్దు’ అని గులాబీ మొక్కకు నచ్చజెప్పేవి. అయినా కూడా గులాబీ మొక్క ఏమాత్రం పట్టించుకునేది కాదు. పొగరుగా మాట్లాడేది. తన అందం ముందు ఈ ముళ్ళ మొక్కలు ఎందుకూ పనికి రావని, వాటి పక్కన ఉండడం తనకే నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చేది.

అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఎర్రటి ఎండలు మొదలైపోయాయి. ఎడారిలో పుట్టిన మొక్కలన్నీ అలా చనిపోతూ వచ్చాయి. గులాబీ మొక్క వంతు కూడా వచ్చింది. గులాబీ మొక్క చుట్టు బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కలు ఉండడంతోనే అది ఎంతో కొంత బతికి బట్టకలుగుతోంది. అయినా సరే పువ్వులు పూయలేక, దాహంతో విలవిలలాడిపోతుంది. తన పక్కన ఉన్న కాక్టస్ చెట్టు మాత్రం ఎలాంటి బెదురు లేకుండా హాయిగా జీవించడం గులాబీ మొక్క గమనించింది.

ఈ లోపు ఒక అందమైన పక్షి ఎగురుకుంటూ వచ్చింది. దాన్ని చూసి గులాబీ మొక్క అది తనపైనే వాలుతుందని అనుకుంది. కానీ అది కాక్టస్ మొక్క మీద వాలి ఆ మొక్క ఆకును ముక్కుతో పొడిచి... అందులో ఉన్న నీటిని తాగడం చూసింది. అది చూసి సిగ్గుతో తలదించుకుంది. అప్పుడుగానీ ఈ కాక్టస్ మొక్కల గొప్పతనం రోజా మొక్కకు అర్థం కాలేదు. వెంటనే తనను క్షమించమని అడిగింది. అలాగే తనకు కాస్త నీళ్లు ఇవ్వమని కోరింది.

కాక్టస్ మొక్కలు గులాబీ మొక్కకు కూడా కాస్త నీటిని ఇచ్చి బతికించాయి. అవి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ వేసవి కాలాన్ని దాటేసాయి. చివరికి అవి స్నేహితులుగా మారాయి. ఈ కథలో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరినీ కూడా వారి లుక్స్‌ను బట్టి జడ్జ్ చేయకూడదు. రోజా మొక్క కూడా తన అందాన్ని చూసి మురిసిపోయింది. కాక్టస్ మొక్క అందవిహీనంగా ఉందని నీచంగా మాట్లాడింది. కానీ చివరికి ఆ కాక్టస్ మొక్క వల్లే తన ప్రాణాన్ని నిలుపుకుంది.

మీ జీవితంలో ఎదురయ్యే వారిని ఎవరినీ చులకనగా చూడకండి. ఎప్పుడో ఒకసారి వారు మళ్ళీ మీ జీవితంలో తారసపడవచ్చు. వారి అవసరమే మీకు పడవచ్చు. జీవితం గుండ్రని చక్రంలాంటిది. ఆ చక్రంలోనే మనం తిరుగుతూ ఉండాలి. ఆ క్రమంలో ఎవరి అవసరం ఎప్పుడు పడుతుందో అంచనా వేయడం కష్టం. కాబట్టి మీకు మంచిగా జరుగుతున్నప్పుడు ఎదుటివారిని చులకనగా చేసి, తక్కువగా అంచనా వేసి మాట్లాడవద్దు. ఎప్పుడో ఒకసారి మీ తలరాత బాగోకపోతే వారే మీకు సాయం చేయాల్సి వస్తుంది.

తదుపరి వ్యాసం