తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Varalakshmi Vratham 2022 : వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలో తెలుసా?

Varalakshmi Vratham 2022 : వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలో తెలుసా?

04 August 2022, 21:39 IST

google News
    • Varalakshmi Vratham 2022 : హిందువులు శ్రావణమాసాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో శుక్రవారాలు మరింత ప్రత్యేకం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ మాసంలోని రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ సంవత్సరం రెండో శుక్రవారం ఆగస్టు 5వ తారీఖున వచ్చింది.
వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం

Varalakshmi Vratham 2022 : శ్రావణమాసంలోని ఏ శుక్రవారాన్ని అయినా.. అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఏ శుక్రవారమైనా వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. కానీ చాలా మంది మహిళలు 2వ శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసంలో పూర్ణిమ (పౌర్ణమి రోజు) ముందు వచ్చే రెండవ శుక్రవారం ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం పాటిస్తారు. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని చేయమని శివుడు పార్వతీ దేవికి సూచించినట్లు భక్తులు భావిస్తారు.

అసలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు?

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మీ దేవి విష్ణు మూర్తి భార్య. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీని కొలుస్తారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. తమ కోరికలు నేరవేర్చుకునేందుకు.. ముఖ్యంగా వివాహమైన మహిళలు ఈ వత్రాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతం చేస్తే.. అష్టలక్ష్మీ పూజలకు సమానం అని భక్తులు భావిస్తారు. సాధారణంగా మంచి సంపద, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తులు లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు.

మంచి భర్త, కుమారులు కలగాలని మహిళలు, యువతులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, నిత్య సుమంగళిగా తాము వర్థిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. సకలాభీష్టాలు నెరవేరాలని అమ్మవారికి మొక్కుతారు.

సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మీ దేవి పూజ జగదానందకరమైనది. అంతేకాకుండా మిగిలిన లక్ష్మీ పూజలకంటే.. వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రం చెప్తుంది. విష్ణువు జన్మనక్షత్రం, శ్రీహరికి ఇష్టమైన శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు భావిస్తారు. అందుకే మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై.. ఉదయాన్నే అమ్మావారికి నైవేధ్యాలు చేసి.. వ్రతాన్ని ఆచరిస్తారు.

తదుపరి వ్యాసం