Phobia | ఈ ఫోబియాల గురించి మీకు తెలుసా? మీకూ ఏదైనా ఉందేమో చూసుకోండి!
28 February 2022, 16:20 IST
- Phobia.. మనుషులకు ఎన్నో రకాల ఫోబియాలు ఉంటాయి. అంటే భయాలు. కొందరికి బొద్దింకలను చూస్తే భయం. మరికొందరికి బల్లులను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇంకొందరు ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడతారు. ఈ భయాలను ఇంగ్లిష్‌లో ఫోబియాలు అంటారు.
ప్రతి మనిషినీ ఏదో ఒక రకమైన ఫోబియా వెంటాడుతూనే ఉంటుంది
నిజానికి Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. ఈ ఫోబియాల గురించి మనకు చాలా రోజులుగా తెలుసు. రకరకాల ఫోబియాల గురించీ మనం వింటూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకూ చాలా తక్కువ మందికి తెలిసిన ఫోబియాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇవి మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ వింత ఫోబియాల్లో కొన్ని మనలోనూ కొంతమందికి ఉండొచ్చు. మరి ఆ వింత ఫోబియాలు ఏంటి? ఏ ఫోబియాను ఏమని పిలుస్తారు? ఇప్పుడు చూద్దాం.
క్రోనోఫోబియా
ఈ క్రోనోఫోబియా అంటే టైమ్ చాలా వేగంగా వెళ్లిపోతుందన్న భయం. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాం.. టైమ్ మాత్రం చాలా వేగంగా గడిచిపోతోంది అని భయపడేవాళ్లు కొంత మంది ఉంటారు. దీనినే క్రోనోఫోబియా అంటారు. డిప్రెషన్‌తో బాధపడేవాళ్లలో ఇది కనిపిస్తుంది. ఇది జన్యుపరంగా కూడా ఒకరి నుంచి తర్వాతి తరాలకు పాకుతుంది.
ఎరిథ్రోఫోబియా
పది మందిలో సిగ్గు పడతామన్న భయాన్నే ఎరిథ్రోఫోబియా అంటారు. కొంతమంది నలుగురిలో సులువుగా కలవలేరు. మాట్లాడలేరు. పది మందిలోకి వెళ్లాలంటే మనసులో ఓ రకమైన ఆదుర్దా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో అడ్రినలిన్ ఉత్పత్తి పెరిగి అది కాస్తా మొహం ఎరుపు రంగులో మారేలా చేస్తుంది. బుగ్గలు ఎరుపు రంగులోకి మారాయంటే సిగ్గుపడుతున్నట్లు మనం చెబుతుంటాం కదా. ఇలా అందరిలో సిగ్గుపడాలంటే భయపడటాన్నే ఎరిథ్రోఫోబియాగా పిలుస్తారు.
చిక్లెఫోబియా
బబుల్ గమ్‌ను చూసి భయపడేవాళ్లకు చిక్లెఫోబియా ఉందని చెబుతారు. ఎవరైనా బబుల్ గమ్ తింటున్న వాళ్లను చూస్తే వీళ్లు భయపడతారు. వాళ్లు ఎదురుగా వస్తే చిరాకుపడతారు. ఎవరైనా నమిలి ఉమ్మేసిన చూయింగ్ గమ్‌పై పొరపాటున కాలేస్తే.. వీళ్లు ఎగిరి గంతేస్తారు. ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రేకు ఈ చిక్లెఫోబియా ఉంది.
వెనుస్ట్రాఫోబియా
అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అయితే ఇది కాస్త భిన్నం. కేవలం అందమైన అమ్మాయిలను చూస్తేనే భయపడేవాళ్లు కొందరు ఉంటారు. వాళ్లు ఎదురుగా వస్తే చాలు శ్వాస తీసుకోవడం ఇబ్బందులు, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తమకు సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా అందంగా ఉన్నారనుకుంటే చాలు ఈ ఫోబియా ఉన్నవాళ్లు వారి దగ్గరికి కూడా వెళ్లరు.
గామోఫోబియా
పెళ్లి చేసుకోవాలన్నా, ఓ రిలేషన్‌షిప్‌లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. ఇలాంటి వాళ్లు ఎవరితో అయినా ప్రేమలో పడినా.. వాళ్లు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తే చాలు వారిపై ద్వేషం పెంచుకుంటారు. దూరమవుతారు.
జీనోఫోబియా
కొత్తవాళ్లు, ఏలియన్లు, బయటి వ్యక్తులంటే కలిగే భయాన్నే జీనోఫోబియా అంటారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఏలియన్లంటే భయపడేవారు. కొత్త వాళ్లను ఎవరిని చూసినా భయపడుతుంటే వారికి ఈ జీనోఫోబియా ఉన్నట్లే.
సోమ్నిఫోబియా
నిద్రపోవాలంటే కలిగే భయాన్నే సోమ్నిఫోబియా అంటారు. ఇది సాధారణంగా పెద్ద వాళ్ల కంటే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కలలు వస్తాయన్న భయంతో కొంతమంది పిల్లలు పడుకోవడానికి భయపడుతుంటారు. రాత్రిపూట భయంతో సడెన్‌గా నిద్రలేస్తూ శ్వాస కోసం ఇబ్బంది పడుతంటారు కొంతమంది. దీంతో వీళ్లు నిద్రపోవడానికే భయపడుతుంటారు.
సైడెరోఫోబియా
ఆకాశంలో నక్షత్రాలను చూస్తే కలిగే భయాన్నే సైడెరోఫోబియా అంటారు. వీళ్లు రాత్రిపూట ఆకాశంలోకి చూడలేరు. ఇంట్లో కూడా కిటికీలు మూసుకొని పడుకుంటారు. ఒకవేళ వీళ్లు నక్షత్రాలను చూశారంటే స్పృహ కోల్పోతుంటారు. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. చెమట పడుతుంది.
వెస్టిఫోబియా
దుస్తులను చూసి భయపడటాన్ని వెస్టిఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్న వాళ్లు అసలు బట్టలు వేసుకోకూడదని అనుకుంటారు. కొంతమంది కొన్ని దుస్తులు వేసుకుంటే ఎలర్జీతో బాధపడతారు. అలాంటి వాళ్లు మెల్లగా ఈ వెస్టిఫోబియా వైపు వెళ్తారు.
ఫ్రోనెమోఫోబియా
కొంతమంది ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి భయపడుతుంటారు. అలా చేస్తే వీళ్లు ఆందోళనకు గురవుతారు. వణుకు పడుతుంది. ఇలాంటి వాళ్లకు ఫ్రోనెఫోబియా ఉందని అంటారు. పాత జ్ఞాపకాలను చూసి భయపడేవారు సాధారణంగా ఈ ఫోబియాతో బాధపడుతుంటారు.
ప్లూటోఫోబియా
ఈ కాలంలో డబ్బెవరికి చేదు చెప్పండి. కానీ అత్యంత అరుదుగా కొంతమంది ఉంటారు. వీళ్లు డబ్బును చూసినా, డబ్బున్న వాళ్లను చూసినా భయపడుతుంటారు. ఇలాంటి వాళ్లు ప్లూటోఫోబియాతో బాధ పడుతున్నట్లు చెబుతారు. ఇలాంటి వ్యక్తులు తమ కెరీర్‌లో కావాలని పైకి ఎదగకుండా, ఎక్కువ డబ్బు సంపాదించకుండా చూసుకుంటారు. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా.