Tuesday Motivation: మీకు వాయిదా వేసే రోగం ఉందా? వెంటనే ఈ చిట్కాలతో వదిలించుకోండి, లేకుంటే ఎంతో నష్టపోతారు
10 September 2024, 5:00 IST
- Tuesday Motivation: వాయిదా వేయడం అంటే సమయాన్ని వృధా చేయడమే. ఒక పనిని వాయిదా వేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకున్నట్టు. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోండి.
మోటివేషనల్ స్టోరీ
Tuesday Motivation: విద్యార్థుల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు అందరికీ వాయిదా వేసే వ్యాధి ఉంటుంది. చాలా తక్కువ మందికే ఈ ప్రొక్రాస్టినేషన్ అనే అలవాటు ఉండదు. 100 మందిలో 90 మంది తమకు తెలియకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటే ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి, ఎల్లుండికి వాయిదా వేయడం. దీనివల్ల మనకు తెలియకుండానే సమయాన్ని వృధా చేయడం, దీనివల్ల మీకు తెలియకుండానే మీరు ఎంతో నష్టపోతారు. ముఖ్యంగా నష్టపోయేది సమయాన్ని. కాలం ఒక్కసారి వృధా అయితే దాన్ని తిరిగి తీసుకురావడం పూర్తిగా అసాధ్యం. వాయిదా వేసే పద్ధతిని మార్చుకోవాలంటే మిమ్మల్ని మీరు అందుకు సిద్ధం చేసుకోవాలి.
ఒక్కసారి మీరు వాయిదా వేసే పనిని తలుచుకోండి. నిజానికి అది చేయడం కష్టం కాదు, కానీ బద్ధకం కారణంగా దాన్ని వాయిదా వేస్తుంటాము. దానికి ఒక రెండు నిమిషాల సమయం కేటాయిస్తే చాలు ఆ పని పూర్తవుతుంది. ఆ విషయం తెలిసినా కూడా చేయకపోవడం ప్రోక్రాస్టినేషన్.
మీ పని రెండు నిమిషాలే లేదా అంతకంటే తక్కువ సమయం తీసుకుంటే వెంటనే దాన్ని చేసేయండి. ఒకరి ఈమెయిల్ ప్రత్యుత్తరం ఇవ్వడం లేదా ఒకరి మెసేజ్ కు రిప్లై ఇవ్వడం ఇలాంటివి వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న పనులు వెంటనే పరిష్కరించడం వల్ల ఒత్తిడి పెరగకుండా ఉంటుంది.
మీరు ప్రతిరోజూ వ్యాయామం ప్రారంభించాలి అనుకుంటే దాన్ని రేపటికి, ఎల్లుండికి వాయిదా వేయకుండా రెండు నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ రెండు నిమిషాలు పాటు స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయండి. ఆ రెండు నిమిషాలు స్ట్రెచింగ్ చేయడం వల్ల మీరు వ్యాయామాన్ని ఈరోజు ప్రారంభించినట్టే. మరుసటి రోజు రెండు నిమిషాలను ఐదు నిమిషాలకు పెంచండి. ఇలా వాయిదా వేసే అలవాటును తగ్గించుకుంటూ రండి.
వాయిదా వేయడాన్ని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన సమయ నిర్వహణ అవసరం. కాలానికి తగ్గట్టు, మీ సమయానికి తగ్గట్టు ఎప్పటి పనులు అప్పుడు చేసి మీలో కలిగే మార్పును, ప్రశాంతతను గమనించండి. పని పూర్తవగానే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అదే పని చేయకుండా వాయిదా వేస్తే తల మీద బరువు మోస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మంచి రిలాక్సేషన్ కావాలంటే ఎప్పటి పనులు అప్పుడు చేసేయాలి.
పరధ్యానంగా ఉండడం కూడా వాయిదా వేసే అలవాటును పెంచుతుంది. పరధ్యానం ఉత్పాదకతను తగ్గిస్తుంది. అందుకే మిమ్మల్ని పరధ్యానంగా ఉంచే అలవాట్లకు దూరంగా ఉండండి. సోషల్ మీడియాలకు, ఫోన్లకు దూరంగా ఉంటే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఎప్పటి పనులు అప్పుడు చేయాలనిపిస్తుంది.
మీకు పని ఎక్కువగా అనిపిస్తే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. వాయుదే వేసే కన్నా పనిలో కొంత భాగాన్ని ఈ రోజే చేయడం మంచిది. అలాగే మీరు చేసిన పనిని ప్రోగ్రెస్ చార్ట్ మీద నమోదు చేసుకోండి. మీ పురోగతిని ట్రాక్ చేసుకోండి. ఇది మీకు ప్రేరణగా అనిపిస్తుంది.
చేయాల్సిన పనిని చిన్న చిన్న భాగాలుగా విడదీసుకోవడమే కాదు, సమయాన్ని కూడా సెట్ చేసుకోండి. రెండు నిమిషాల్లో లేదా ఐదు నిమిషాల్లో ఈ పని చేయాలని అనుకోండి. కచ్చితంగా మీరు ఆ పని చేసి తీరుతారు. మెల్లగా మీలో ఉన్న వాయిదా వేసే జబ్బును మీరే బయటకు పంపించుకోవాలి. మీతో మీరు సానుకూలంగా ఉండాలి. దీన్ని చేయగలను అని చెప్పుకోవాలి. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకోవాలి. అప్పుడు వాయిదా వేసే పద్ధతి మీ నుంచి దూరం అవుతుంది.