AirConditioner Energy: ఏసీ వేసినా విద్యుత్ బిల్లు పెరగకూడదంటే ఇలా చేయండి.. ఖచ్చితంగా ఆదా డబ్బు అవుతుంది…
14 October 2024, 11:17 IST
- AirConditioner Energy: ఉన్నత ఆదాయ వర్గాల నుంచి మధ్య తరగతి వరకు ఏసీలకు అలవాటు పడిన శరీరాలు వాటిని విడిచి ఉండటం ఓ పట్టాన సాధ్యం కాదు. ఏసీలలో ఉండటం అలవాటైతే బయట వాతావరణాన్ని తట్టుకోవడం కూడా శరీరానికి సాధ్యం కాదు. ఏసీల వాడకంతో పెరిగే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి.
ఏసీ ఔట్ డోర్ యూనిట్లను నీడలో ఉంచితే విద్యుత్ బిల్లుల్లో 18శాతం ఆదా చేయొచ్చు
AirConditioner Energy: మన ఇంట్లో సీలింగ్ ఫాన్ తిరగడానికి గంటకు 40 పైసలు ఖర్చయితే, ఎయిర్ కండిషనర్ గంట పని చేయడానికి ఆరు నుండి ఏడు రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు వసూలు చేస్తున్న ఫిక్సిడ్ ఛార్జీలతో కలిపితే అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మరీ అవసరం అయితే తప్ప ఏ.సీ. వాడక పోవడం మంచిది. ఏసీ లేకపోతే బ్రతకలేం అనే స్థితికి శరీరం వస్తే దానికి మనం బానిసలం అయిపోయినట్లే లెక్క. అన్ని రకాల వాతావరణాలకు సిద్ధపడేలా శరీరానికి అలవాటు చేసుకోవడం ఉత్తమం.
చాలా మంది ఏసీ ఆన్ చేయగానే అతి తక్కువ టెంపరేచర్ 16- 17 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా హై కూల్ మోడ్‌లో పెట్టడం వల్ల ఏసీ మీద ఎక్కువ భారం పడుతుంది. ఇలా చేసినా గది వెంటనే చల్లబడదు. మంచి కండిషన్‌లో ఉన్న ఎయిర్ కండిషనర్ గదిని చల్లబరచడానికి సుమారు15-20 నిమిషాల సమయం పడుతుంది. గది విస్తీర్ణం, ఏసీ సామర్ధ్యాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
గది చల్లబడ్డాక ఏసీ ఆటోమేటిక్‌గా కొంతసేపు ఆఫ్ అయ్యేలా టైమర్ ఫిక్స్ చేయడం మంచిది. ఆటోమేటిక్‌గా టెంపరేచర్ కట్ ఆఫ్ అయ్యే ఏసిలని కొనుగోలు చేయడం మేలు.
ఏసిలని 22 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 71.5డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద ఫిక్స్ చేస్తే ఒక్కో అదనపు డిగ్రీ పెంచుకుంటే వెళితే కనీసం 3 నుండి 5 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీలకు పెంచితే సగటున 15శాతం విద్యుత్ ఆదా చేయవచ్చు. కొన్ని సార్లు 28డిగ్రీలలో కూడా ఏసీలు సమర్థంగా పనిచేస్తాయి.
ఏసిని 25డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫిక్స్ చేసి గదిలో ఫాన్ కూడా వేస్తే గది మొత్తం చల్లబడి మొత్తంమీద విద్యుత్ వినియోగం తగ్గి పోతుంది. ఏసిని 16-18 డిగ్రీల మధ్య వాడే బదులు ఈ 25లో ఉంచినా శరీరానికి అందే సౌఖ్యంలో ఎలాంటి తేడా ఏమీ ఉండదు.
ఏసి చల్లగాలి బయటికి పోకుండా తలుపులు, కిటికీలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. కిటికీ అద్దాలకు వేడి గ్రహించే ఏర్పాటు చేయడం మంచిది. లోపలి వైపు కర్టెన్లు వాడితే బయటి వేడి లోపలికి రాదు. లోపలి చల్లదనం బయటికి పోదు.
ఔట్‌డోర్ యూనిట్‌లకు నీడ అవసరం…
గదిలోపలి ఉష్ణోగ్రతకి, గది వెలుపలి ఉష్ణోగ్రతకి వ్యత్యాసం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి ఇంటి బయట చెట్లు, మొక్కల నీడ ఎయిర్ కండిషనర్లపై పడేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఎండలో ఉన్న ఏసి ఔట్‌డోర్ యూనిట్ కంటే, నీడలో ఉన్న ఎయిర్ కండీషనర్ 10 శాతం తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. గది బయట ఏసిని నీడలో ఉండేలా చేయాలి. అదే సమయంలో దానికి గాలి అందేలా చూడాలి. ఇంటిపైన నీడనిచ్చే ప్రదేశాల్లో ఏసీ ఔట్‌డోర్ యూనిట్లను ఏర్పాటు చేస్తే కంప్రెసర్ మీద భారం తగ్గుతుంది.
ఏసీ ఇన్‌డోర్ యూనిట్‌లలో ఫిల్టర్లను నెలకొకసారి శుభ్రపరచుకోవాలి. దుమ్ము ధూళి పేరుకుపోయినపుడు ఏసిలో గాలి సరఫరాను అడ్డుకుని త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. శుభ్రపరచిన ఫిల్టర్ వల్ల గది త్వరగా చల్లబడుతుంది. తద్వారా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
ఏసికి దగ్గరలో లైట్లు, టీవీలు, ఇతర వేడిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ వస్తువులు ఉంచకూడదు. వాటి నుండి వచ్చే వేడి వల్ల ఏసిపై ఎక్కువ భారం పడుతుంది.
ఏసి పాతదైతే మరమ్మతులు అవసరమయిన స్థితిలో ఉంటే ఏసి సామర్థ్యం తగ్గి ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తుంది.
వాటర్ హీటర్లతో ఈ జాగ్రత్తలు..
వాటర్ హీటర్ టెంపరేచర్ 60 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు బదులు 50° సెంటీగ్రేడ్‌కు సెట్ చేస్తే 18 శాతం పైగా విద్యుత్ ఆదా అవుతుంది. ఇళ్లలో ఎక్కువ మంది ఉంటే సోలార్ వాటర్ హీటర్ వాడటం అత్యుత్తమం. హాట్ వాటర్ పైపులను 'ఇన్సులేట్' చేయాలి. ప్లాస్టిక్ పైపులను ఇన్సులేట్ చేయకూడదు.