Alcohol | మద్యం సేవించేటపుడు ఇవి తింటున్నారా?
02 March 2022, 16:33 IST
- ఆల్కహాల్ సేవించేటపుడు మంచింగ్ కోసం కొంతమంది ఏది పడితే అది, ఎలా పడితే అలా తినేస్తుంటారు. చాలాకొద్ది మంది మాత్రమే సరైన ఆహార పదార్థాలను తీసుకుంటారు. కానీ అల్కాహాల్‌తో మంచింగ్‌గా కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దు.
మద్యం తాగేటప్పుడు వీటి జోలికి వెళ్లొద్దు
మద్యం (ఆల్కహాల్) సేవించేటపుడు మంచింగ్ కోసం ఏదో ఒకటి తినడం చాలా మందికి అలవాటు. కొంతమంది మందుబాబులు మద్యం మత్తులో ఏది పడితే అది, ఎలా పడితే అలా తినేస్తుంటారు. చాలాకొద్ది మంది మాత్రమే సరైన ఆహార పదార్థాలను తీసుకుంటారు. మీకు తెలుసా? కొన్నిసార్లు మీరు తీసుకునే మంచింగ్ కారణంగానే వికారం, హ్యాంగోవర్ లాంటి సమస్యలు తలెత్తుతాయని? అల్కాహాల్‌తో మంచింగ్‌గా కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా వైన్ తాగేవాళ్లు ఇలాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఆ ఆహారం విషతుల్యంగా మారి మీకు ప్రాణసంకటంగా పరిణమించవచ్చు.
మరి మద్యం సేవించేటపుడు, ఆ తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఏవి తీసుకోవచ్చు ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం.
మద్యంతో పాటుగా ఈ ఆహార పదార్థాలను స్వీకరించరాదు
బీన్స్:
వైన్ తాగేటపుడు లేదా తాగిన తర్వాత బీన్స్ లాంటి కాయధాన్యాలను తినకూడదు. వీటిల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే వైన్ లో టానిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి రెండూ రియాక్ట్ అయ్యి శరీరంలోకి వైన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.
చాక్లెట్:
కొంతమంది అమ్మాయిలు వైన్ సేవిస్తూ చాక్లెట్‌ని మంచింగ్‌గా తీసుకుంటారు. కానీ ఇది అస్సలు సరైన కాంబినేషన్ కాదు. ఈ రెండింటికీ సారూప్యతలు ఉన్న కారణంగా రుచి మారిపోతుందు. చాక్లెట్ కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది, అది ఎసిడిటీకి దారతీయవచ్చు. కాబట్టి చాక్లెట్ వైన్ తీసుకోవచ్చు కానీ వైన్ తీసుకునేటపుడు చాక్లెట్‌కి దూరంగా ఉంటే మంచిది.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు:
మద్యం సేవిస్తూ అధిక మొత్తంలో సోడియం ఉండే ఆహార పదార్థాలు, బాగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థకు హానికరం. ఉప్పు ఎక్కువ ఉంటే దాహం ఎక్కువ వేస్తుంది దీంతో ఇంకా ఎక్కువగా తాగేస్తారు. అధిక మూత్ర విసర్జనకు కారణమవుతుంది. క్రమంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫ్రైచేసిన వాటికి బదులుగా తందూరి, గ్రిల్డ్, బేక్ చేసినవి తీసుకుంటే పర్వాలేదు.
బ్రెడ్:
మద్యంతో బ్రెడ్, పిజ్జా, బర్గర్ల లాంటివి అస్సలు తినకూడదు. వీటిల్లో ఈస్ట్ ఉంటుంది కాబట్టి మీ కడుపులో జీర్ణవ్యవస్థకు అదనపు భారం కలిగించినట్లవుతుంది. ఉబ్బసం, ఛాతిలో మంట లాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి ఆహారాలు శరీరంలో నీటిని కూడా పీల్చుకొని డీహైడ్రేషన్ కు కారణమవుతాయి.
కాఫీ:
ఆల్కహాల్ తీసుకునేటపుడు లేదా దాని తర్వాత కూడా కాఫీలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి. కాఫీ, కొన్ని చాక్లెట్లలో ఉండే కెఫీన్, కోకో లాంటి సమ్మేళనాలు ఆమ్ల గుణాలను కలిగి ఉంటాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలను మరింర తీవ్రతరం చేస్తాయి.
స్వీట్లు, డెయిరీ ప్రొడక్ట్స్:
మద్యం సేవించిన తర్వాత తర్వాత పాల పదార్థాలు, స్వీట్లు తీసుకోకూడదు. పాల పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. స్వీట్లు తింటే మత్తు రెట్టింపై ఫుడ్ పాయిజల్ లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆల్కహాల్ తీసుకునేటపుడు నట్స్, పాప్ కార్న్, బేక్ చేసిన చిప్స్ , గ్రిల్ చేసిన పదార్థాలు తీసుకోవచ్చు. కానీ అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆపిల్స్, బెర్రీ ఫ్రూట్స్ , సలాడ్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు.
చివరగా చెప్పేదేంటంటే..
మద్యం సేవించినపుడు అందులో ఉండే అల్కాహాల్ రక్తంలోకి చేరుతుంది. ఈ రక్తం శరీరంలోని వివిధ అవయవాలకు సరఫరా జరిగినపుడు వాటి పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. ఆల్కాహాల్ శాతం ఒక మోతాదు దాటిన తర్వాత మొదట మాటలో తేడా వస్తుంది, నడక తడబడుతుంది. ఆ తర్వాత మెదడుకు పాకుతుంది, దీంతో మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. అందుకే.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.
టాపిక్