Hair Care | పెరుగుతో హెయిర్ మాస్క్‌లు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు
13 April 2022, 14:27 IST
- యుగయుగాలుగా పెరుగును సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలకు పెరుగు చెక్ పెడుతుంది. పొడి స్కాల్ప్ అయినా లేదా చుండ్రు అయినా పెరుగుతో సమస్య ఇట్టే తీరిపోతుంది అంటే మీరు నమ్ముతారా? పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు జుట్టును ఆరోగ్యంగా చేస్తాయి. పెరుగుతో కొన్ని ప్రయోజనాలతో పాటు.. కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు సంరక్షణ కోసం
Healthy Hair | నిగనిగలాడే, మెరిసే జుట్టు కోసం పెరుగును ఉపయోగించడం ఉత్తమం. పెరుగుకు కొన్ని పదార్థాలు జోడించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ మాస్క్‌లు ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటిని తయారీ చేసుకునే విధానం.. మాస్క్‌ల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు..
* జుట్టుకు సహజ రూపాన్ని ఇస్తుంది.
* జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
* స్కాల్ప్ (లాక్టిక్ యాసిడ్)కు పోషణనిస్తుంది. అంతే కాకుండా తేమను అందిస్తుంది.
* జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
* స్కాల్ప్ నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
* చుండ్రును తగ్గిస్తుంది.
* స్కాల్ప్ pH ని బ్యాలెన్స్ చేస్తుంది.
1. మెంతులు, పెరుగు
జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది. కొన్ని మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, 2 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలపి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం సున్నితమైన షాంపూతో కడగాలి.
2. కొబ్బరి నూనె, పెరుగు
కొబ్బరి నూనె, పెరుగు హెయిర్ మాస్క్ జుట్టుకు అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ఇవ్వడంలో కృషి చేస్తుంది. కొబ్బరినూనెలో 1 భాగాన్ని తీసుకుని వేడెక్కించాలి. దానిలో కొంత తేనె కలపాలి. అది చల్లారిన తర్వాత.. తలకు సరిపడా తాజా పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్కాల్ప్, హెయిర్ రూట్స్, చివర్లకు అప్లై చేసి ఉంచాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి.. వెంటనే కడిగేయాలి.
3. ఆలివ్ నూనె, పెరుగు
వెంట్రుకలు బలపడాలంటే పెరుగును ఆలివ్ ఆయిల్, తులసి ఆకుల పొడితో కలిపి మాస్క్ వేసుకోవాలి. ఇది 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత కడిగేయాలి.
4. నిమ్మరసం, పెరుగు
పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మాస్క వేయాలి. ఈ మాస్క్ క్షణాల్లో తలలో దురదను మాయం చేస్తుంది.
5. బేసన్, పెరుగు
అరకప్పు పెరుగులో 1 టేబుల్‌స్పూన్ బేసన్ (శనగపిండి)ని కలిపి.. తలకు మాస్క్‌లా పట్టించాలి. ఇది చుండ్రు దరిచేరకుండా ఉపశమనం ఇస్తుంది.
6. నల్ల మిరియాల పొడి, పెరుగు
జుట్టు ఎక్కువగా రాలుతుందని బాధపడేవారు ఈ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. పెరుగు, నల్ల మిరియాలు పొడిని కలిపి.. తలకు పట్టించి.. మసాజ్ చేయండి. 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్..
పెరుగు అందరికీ పడకపోవచ్చు. ముఖ్యంగా లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది పడదు. కాబట్టి వారికి పెరుగు అలెర్జీ ఇస్తుంది. కాబట్టి ఈ మాస్కులను ప్రయత్నించే ముందు.. తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. పాత పెరుగు కంటే తాజా పెరుగు మంచిది. మరో సమస్య ఏంటంటే.. ఈ మాస్కులు ఉపయోగించిన తర్వాత.. స్కాల్ప్‌ను సరిగ్గా కడుక్కోకపోతే జిడ్డుగా మారుతుంది. కొన్నిసార్లు అది ఇబ్బందికరంగా ఉంటుంది.
టాపిక్