Bottle Gourd Dosa | ఇన్‌స్టంట్‌గా చేసుకోగలిగే సోరకాయ దోశ..ఇది రుచికరం, ఆరోగ్యకరం
15 August 2022, 8:39 IST
- త్వరగా అల్పాహారం రెడీ చేయాలనుకుంటే కేలం 15 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ గా సోరకాయ దోశను సిద్ధం చేసుకోవచ్చు. ఇది చాలా రుచికరం, ఆరోగ్యకరం కూడా. ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ చూడండి.
Dosa
మీకు ఉదయం వేళ సమయం తక్కువగా ఉంటే, త్వరగా చేసుకునే అల్పాహారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మీరు దోశ తినాలనుకున్నా కూడా ఇన్‌స్టంట్ గానే చేసుకునే దోశ వెరైటీలు ఉన్నాయి. సుదీర్ఘమైన సమయం తీసుకునే సాంప్రదాయ రకమైన దోశలకంటే కూడా ఇన్‌స్టంట్ దోశలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులోనూ కొన్ని తాజా కూరగాయలు కలుపుకొని చేసుకుంటే రుచితో పాటు పోషకాలూ ఎక్కువగా లభిస్తాయి. ఇలా తీసుకోవటం ఎంతో ఆరోగ్యకరం కూడా.
మీరు తక్కువ సమయంలో ఇన్‌స్టంట్ గా చేసుకునే దోశ వెరైటీల్లో సోరకాయ దోశ కూడా ఒకటి. అవును సోరకాయతో కూడా దోశలు తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవటం చాలా తేలిక, మీరు కేవలం 15 నిమిషాల్లో ఈ దోశలను సిద్ధం చేసుకోవచ్చు.
మరి సోరకాయ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేమిటి? తయారీ విధానం ఎలా? దీనికి సంబంధించిన రెసిపీని కింద అందించాం. మీరు ఇప్పటికిప్పుడే ఒకసారి ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్థాలు
- 1/2 కప్పు బియ్యం పిండి
- 1/2 కప్పు రవ్వ
- 1/2 కప్పు సోరకాయ ముక్కలు
- 2 పచ్చిమిర్చి
- 1 స్పూన్ ఉప్పు
- కొద్దిగా నూనె
తయారీ విధానం
1. ముందుగా ఒక సోరకాయను తీసుకొని దాని చర్మాన్ని ఒలిచి ముక్కలుగా కట్ చేసుకోండి.
2. అనంతరం ఈ ముక్కలను మిక్సర్ బ్లెండర్‌లో వేసి కొన్ని నీళ్లను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేయండి.
3. ఒక గిన్నెలో బియ్యంపిండి, రవ్వ, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి కొన్ని నీళ్లుపోసి కలపండి. ఈ మిశ్రమానికి సోరకాయ పేస్టును కూడా జత చేయండి.
4. ఇవన్నీ మెత్తని బ్యాటర్ అయ్యేలాగా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
5. పిండి దోశలు చేయటానికి సిద్ధంగా మారిందని నిర్ధారించుకున్నాక.. ఒక పాన్ స్టవ్ మీద పెటే ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి.
6. ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకొని దోశలను వేసుకోండి.
7. దోశలు క్రిస్పీగా, ముదురు గోధుమ రంగులోకి మారేంతవరకు కాల్చండి
అంతే వేడివేడి సోరకాయ రవ్వదోశ రెడీ అయినట్లే, మీకు నచ్చిన చట్నీతో కలిపి సర్వ్ చేసుకోండి. ఈ దోశల రుచిని ఆస్వాదించండి.