తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Constipation | మలబద్ధకం సమస్య ఇబ్బందిపెడితే, ఈ మార్పులు చేసుకోండి!

Constipation | మలబద్ధకం సమస్య ఇబ్బందిపెడితే, ఈ మార్పులు చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

21 March 2022, 7:08 IST

google News
    • తినే ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి-ఆందోళనలు తదితర కారణాలు మలబద్ధకానికి దారితీస్తున్నాయి. మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి.
Constipation Tips
Constipation Tips (Stock Photo)

Constipation Tips

ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చాలా మందికి ఒక సాధారణమైన సమస్యగా మారింది. ఆహారం జీర్ణమైన తర్వాత బయటకు వెళ్లాల్సిన వ్యర్థాలు లేదా మలం చాలా పేగులో నెమ్మదిగా కదులుతున్నప్పుడు, ఈ మలం పురీషనాళం సరిగ్గా బయటకు పంపనపుడు ఏర్పడే పరిస్థితిని సాధారణంగా మలబద్ధకం అంటాము. ఇది గట్టిగా మరియు పొడిగా మారవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, వాత దోషానికి సంబంధించిన అసమతుల్యత కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. అలాగే జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు.

తినే ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి-ఆందోళనలు తదితర కారణాలు మలబద్ధకానికి దారితీస్తున్నాయి. ఈ సమస్య మీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యతో ప్రేగు కదలికలు అసాధారణంగా ఉంటాయి, ఆందోళనగా ఉంటుంది, శరీరానికి అవసరమయ్యే విటమిన్లు అందవు, అలాగే ఇతర చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఇది ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగితే హేమోరాయిడ్స్, పైల్స్ వంటి బాధాకరమైన పరిస్థితులకు కారణం కావచ్చు. కాబట్టి మలబద్ధకం సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి.

ఆయుర్వేద నిపుణుల సలహాల ప్రకారం ఇష్టం లేకుండా ఏది తినకూడదు, ఏదిపడితే అది తినకూడదు. చల్లని పదార్థాలు, స్పసీ ఫుడ్, ఫ్రై పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్‌లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు పీచు పదార్థాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. తగినంత నీరు త్రాగాలి.

అలాగే రాత్రి భోజనం ఆలస్యంగా చేయకూడదు, త్వరగా తిని త్వరగా పడుకోవాలి. సరిగ్గా నిద్రపోయి ఉదయం లేవాలి.. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య ఏర్పడదు.

దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలు

  • రెస్ట్ రూంలో ఏ పనిచేయడం కోసం వచ్చామో దృష్టి దానిపైనే ఉండాలి. ఈ సమయంలో ఫోన్ తదితర గాడ్జెట్స్ వాడకాన్ని, వార్తాపత్రికలు చదవడాన్ని మానేయాలి.
  • ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఉపయోగించాలి. ఒకవేళ వెస్ట్రన్ ఉపయోగిస్తుంటే ముందర ఒక చిన్న టేబుల్ ఉంచి, దానిపై కాళ్లు పెట్టి టాయిలెట్ సింక్ పై కూర్చోవాలి.
  •  ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం, నిద్రపోవడం అలవాటు చేసుకోండి.
  •  తగినంత నీరు త్రాగాలి. మీ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయడానికి మీ శరీరానికి నీరు అవసరం.
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి
  • రోజులో తీవ్రంగా ఆలోచించడం, ప్రతీకారం లేదా ఆక్రోశంతో లోలోపల రగిలిపోవడం, చెడు భావోద్వేగాలు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి. వీటిని నియంత్రించుకోవాలి.
  • మలసానా, హలాసన, ముక్తాసన, అర్ధ-మత్యేంద్రాసన లాంటి కొన్ని యోగాసనాలు వేయాలి.

మలబద్ధకం కోసం అనేక మెడిసిన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి కొంతమందికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. ప్రతిసారి ఇలా మందులు వాడితే కూడా ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి పైన చెప్పినట్లుగా చిట్కాలు పాటించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సహజంగానే మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. అయినా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మేలు.

తదుపరి వ్యాసం