Coconut Oil Benefits : కొబ్బరి నూనెతో అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం
08 September 2023, 11:15 IST
- Coconut Oil Benefits : కొబ్బరి నూనెతో జుట్టుకే కాదు.. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొంతమంది వంటలో కూడా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు.
కొబ్బరి నూనె
అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? స్త్రీలే కాదు పురుషులు కూడా అందంగా కనిపించాలని అద్దం ముందు నిల్చుంటారు. అందంగా కనిపించడానికి మంచి చర్మ, శరీర సంరక్షణ కావాలి. దీనికోసం కొన్ని విషయాలు పాటించాలి. ప్రాచీన కాలం నుంచి వాడుతున్న కొబ్బరినూనె(Coconut Oil)లో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి.
కొబ్బరినూనెను సరిగ్గా వాడితే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం, జుట్టుకు కొబ్బరి నూనె(Coconut Oil For Hairs) అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను ఇలా అప్లై చేయడం వల్ల చర్మానికి, జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
స్నానానికి ముందు కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. సాధారణంగా మన చర్మంలో కొన్ని రకాల క్రిములు, బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. అందుకే తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె రాసుకుని కొద్దిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే క్రిములు తొలగిపోతాయి.
కొబ్బరినూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొందరికి జిగట జుట్టు సమస్య ఉంటుంది. కొబ్బరి నూనెను అప్లై చేసి జుట్టుకు కొద్దిగా మసాజ్ చేయండి. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. జుట్టు కూడా నల్లగా మారుతుంది.
కొంతమందికి పొడి చర్మం(Dry Skin) ఉంటుంది. అలాంటి వారికి కొబ్బరినూనె మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోజూ తలస్నానం చేసే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట కాస్త కొబ్బరినూనెను శరీరానికి రాసుకుని నిద్రకు ఉపక్రమిస్తే మంచి ఫలితం ఉంటుంది.
తలస్నానం చేసే ముందు చర్మానికి, జుట్టుకు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది చర్మం, జుట్టును మృదువుగా చేస్తుంది.
వంటలో కొబ్బరి నూనె
మార్కెట్లో జుట్టుకు పెట్టుకునే కొబ్బరి నూనె దొరుకుతుంది. అదికాకుండా వంటలో ఉపయోగించే కొబ్బరి నూనె దొరుకుతుంది. వంటకాల్లో కొబ్బరి నూనె వేసుకోవడం వలన.. కొవ్వు కరిగి శరీర బరువు తగ్గుతుంది(Weight Loss). అంతేకాదు.. ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. కొబ్బరి నూనె రక్తంలోని చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున, శుద్ధి చేసిన ఇతర నూనెలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మీ ఆహారంలో కొబ్బరి నూనె జోడిస్తే.. అది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.