ఫోన్‌లకు బుల్లెట్ ప్రూఫ్ కవచం.. మీ ఫోన్‌తో పాటు మీ ప్రాణాలు భద్రం!
28 February 2022, 16:40 IST
- ఐఫోన్ మోడెల్స్ అయిన iPhone 13 Pro, iPhone 13 Pro Max ల యొక్క బుల్లెట్‌ప్రూఫ్ వెర్షన్‌లను కేవియర్ గ్లోబల్ అనే సంస్థ ఆవిష్కరించింది. BR-2 క్లాస్ 2 బుల్లెట్ రెసిస్టెంట్ కవచంతో తయారైన ఈ ఐఫోన్‌లను స్టెల్త్ 2.0 అనే పేరుతో పిలుస్తున్నారు.
Stealth 2.0- The Bullet Proof iPhone
లగ్జరీ మొబైల్ బ్రాండ్ ఐఫోన్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కవచంతో కూడా లభిస్తుంది. దీంతో మీ ఐఫోన్ ఎలాంటి డ్యామెజీలనైనా తట్టుకోవడమే కాకుండా అది మీ ప్రాణాలను కూడా కాపాడుతుంది. లగ్జరీ బ్రాండ్ వస్తువులను మన అభిరుచులకు తగ్గట్లుగా, మనకు కావాల్సిన రీతిలో కస్టమైజ్ చేసే కేవియర్ గ్లోబల్ అనే సంస్థ ఐఫోన్ మోడల్స్ అయిన iPhone 13 Pro, iPhone 13 Pro Max లలో బుల్లెట్‌ప్రూఫ్ వెర్షన్‌లను ఆవిష్కరించింది. BR-2 క్లాస్ 2 బుల్లెట్ రెసిస్టెంట్ కవచంతో తయారైన ఈ ఐఫోన్‌లను స్టెల్త్ 2.0 అనే పేరుతో పిలుస్తున్నారు.
కేవియర్ గ్లోబల్ సాధారణంగా వివిధ బ్రాండెడ్ ఫోన్లను బంగారు పూతలతో, ఖరీదైన వజ్రాలు, ఇతర ఆభరణాలను అమర్చుతూ కస్టమ్ మోడల్‌లను విడుదల చేయడంలో ప్రసిద్ధిచెందింది. ఈ సారి బుల్లెట్ ప్రూఫ్ కవచంతో స్టెల్త్ 2.0 స్మార్ట్‌ఫోన్లను తయారు చేసింది ఈ కంపెనీ.
రక్షణ విభాగాల్లో పనిచేసే వారి కోసం..
గూఢచారి సంస్థల్లో పనిచేసే వారికి, వారి పౌరుల శాంతి భద్రతలు కాపాడేవారి కోసం అలాగే భద్రతాపరంగా హైరిస్క్ కలిగిన వారికోసం ఈ బుల్లెట్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు ఎంతో మంచి ఛాయిస్ అవుతాయని కేవియర్ గ్లోబల్ తెలిపింది. వీటిని గుండెవైపు ఉండే షర్ట్ జేబులో పెట్టుకోవడం ద్వారా ఎవరైనా ఆకస్మిక దాడి చేసి తుపాకీతో షూట్ చేసినప్పటికీ బుల్లెట్ ను శరీంలోకి దిగకుండా ఈ స్టెల్త్ 2.0 స్మార్ట్‌ఫోన్ కవచం అడ్డుకుంటుందని పేర్కొంది. అంతేకాదు ఈ ఫోన్‌కు అమర్చిన BR-2 క్లాస్ 2 కవచం ఏదో సాధారణ బుల్లెట్ ప్రూఫ్ కాదు, దీనిని సాయుధ వాహనాలు, యుద్ధ హెలికాప్టర్‌లకు కవచాలు తయారుచేయడంలో ప్రసిద్ధిగాచించిన NPO TCIT వారు తయారుచేసినట్లు కేవియర్ గ్లోబల్ వెల్లడించింది.
Watch this video:
కేవియర్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం బుల్లెట్ రెసిస్టెంట్ వెర్షన్‌లో కేవలం 99 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ధరలు మన భారత కరెన్సీ ప్రకారం రూ. 4.85 లక్షల (USD 6,370) నుంచి ప్రారంభమవుతున్నాయి. iPhone 13 Pro Max ధర దాదాపు రూ. 6.08 లక్షలు (USD 7,980)తో లభిస్తుంది. ఈ ఫోన్లలో స్టోరేజ్ సామర్థ్యం గరిష్టంగా 1 TB వరకు ఉంటుందని సంస్థ పేర్కొంది.
మరి మీకెవరికైనా ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫోన్ కావాలనుకుంటే కేవియర్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.
ఇక మామూలుగా అయితే భారతదేశంలో, iPhone 13 Pro ప్రారంభ ధర రూ. 1,19,900 కాగా, iPhone 13 Pro Max ధర రూ. 1,29,900గా ఉంది.
టాపిక్