Breastfeeding benefits। తల్లిపాలు ఇస్తే శిశువుకే కాదు, తల్లికీ ఈ ప్రయోజనాలు ఉంటాయి!
03 August 2024, 22:09 IST
- Breastfeeding Week: శిశువుకు తల్లి తన స్తన్యం పంచడం ద్వారా ఆ శిశువుకు మాత్రమే కాకుండా, తల్లికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, ఇప్పుడు తెలుసుకుందాం.
Breastfeeding Week
Breastfeeding Week: అప్పుడే పుట్టిన శిశువులకు పాలు తప్ప వేరే ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు. ఆరు నెలల వరకు పాలు మాత్రమే తాగించాల్సి ఉంటుంది. అయితే వారికి డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వడమే శ్రేయస్కరం అనేది జగమెరిగిన వాస్తవం. అయితే చాలా మంది తల్లులు అనేక కారణాల వలన, లేదా కొన్ని అపోహల వలన బిడ్డకు తమ చనుబాలు కాకుండా ఫార్ములా పాలు పంచుతున్నారు. కానీ, బిడ్డకు సరైన పోషణ అందాలంటే, బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిపాలు మాత్రమే అందించడం శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శిశువుకు తల్లి తన స్తన్యం పంచడం ద్వారా ఆ శిశువుకు మాత్రమే కాకుండా, తల్లికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, ఇప్పుడు తెలుసుకుందాం.
బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు కలిగే ప్రయోజనాలు
- తల్లి పాలు శిశువులకు సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. చనుబాలలో విటమిన్లు, మాంసకృత్తులు, కొవ్వుల సరైన మిశ్రమం ఉంటుంది. బిడ్డ పెరగడానికి అవసరమైన ప్రతీ పోషకం తల్లిపాల ద్వారా లభిస్తుంది.
- తల్లిపాలు బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు.
- శిశువు అనారోగ్యాల బారినపడకుండా వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలు తల్లి పాలలో ఉంటాయి.
- తల్లిపాలు మీ శిశువుకు ఆస్తమా లేదా అలెర్జీలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- మొదటి 6 నెలలు ఎలాంటి ఫార్ములా లేకుండా, ప్రత్యేకంగా తల్లిపాలు తాగే పిల్లలకు, చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, అతిసారం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- తల్లిపాలు తాగే శిశువులు తరచుగా ఆసుపత్రిలో చేరడం, వైద్యుని వద్దకు వెళ్లడం కూడా ఉండవు.
- కొన్ని అధ్యయనాల్లో ప్రకారం, బాల్యంలో తల్లిపాలు ఎక్కువగా తాగిన పిల్లలు అధిక IQ స్కోర్‌లను కలిగి ఉంటారు.
- స్తన్యం పంచడాం ద్వారా తల్లికి- బిడ్డకు మధ్య అనుబంధం బలపడుతుంది.
- తల్లిపాలు తాగే శిశువులు ఆరోగ్యకరమైన బరువుతో పెరుగుతారు.
- SIDS (ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్) నివారణలో తల్లిపాలు కూడా పాత్ర పోషిస్తాయి.
- భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం.
తల్లి పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు
- చనుబాలు బిడ్డకు పంచడం ద్వారా ఆ తల్లి శరీరంలో అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి, కాబట్టి ఇది గర్భధారణ బరువును వేగంగా తగ్గించడంలోనూ, ప్రసవం తర్వాత అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది.
- శిశువుకు చనుబాలు ఇచ్చేటపుడు తల్లుల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది వారి గర్భాశయంను గర్భధారణకు ముందు ఉన్న పరిమాణానికి తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది
- ప్రసవం తర్వాత గర్భాశయ రక్తస్రావం తగ్గిస్తుంది.
- తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- తల్లులలో మీ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఫార్ములాను కొనుగోలు చేసి కొలవవలసిన అవసరం లేదు కాబట్టి, చనుమొనలను క్రిమిరహితం చేయడం లేదా పాల సీసాలు వేడి చేయడం అవసరం ఉండదు. డబ్బు కూడా ఆదా అవుతుంది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు.