Pesara Garelu : పెసరు పప్పు గారెలు.. రుచిగా ఉంటాయి
05 March 2023, 6:30 IST
- Pesara Garelu Recipe : గారెలు తయారు చేసుకోవాలంటే.. ఎక్కువగా మినప పప్పు, బొబ్బెర పప్పును వాడుతుంటాం. అయితే పెసరు పప్పుతోనూ గారెలు తయారు చేసుకోవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..
పెసరు పప్పు గారెలు
గారెలు తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. తింటుంటే.. ఆ టేస్టే వేరు. తింటుంటే.. ఇంకా తినాలనిపిస్తుంది. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కాస్త వెరైటీగా గారెలు తయారుచేసుకోండి. గారెలు అనగానే.. మినప పప్పు, బొబ్బెర పప్పు గుర్తుకు వస్తుంది. కానీ పప్పు కూరలు, చారు చేసేందుకు ఉపయోగించుకునే.. పెసరు పప్పుతో గారెలను తయారు చేయండి. రుచిగా కూడా ఉంటాయి. ఈజీగానే తయారుచేసుకోవచ్చు. కావాల్సినవి ఏంటో, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
పెసర పప్పు-అర కిలో, ఉల్లిపాయలు-2 తరిగినవి, కరివేపాకు తరిగినవి, అల్లం ముక్కలు తరిగినవి-2 టేబుల్ స్పూన్స్, పచ్చి మిరపకాయలు-10, కొత్తిమీర, జీలకర్ర-2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, నూనె-డీప్ ఫ్రైకు సరిపడా.
తయారీ విధానం
మెుదట పెసర పప్పును శుభ్రంగా కడిగి.. తగినన్ని నీళ్లు పోసుకుని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక జార్ లో నానబెట్టిన పెసరు పప్పును మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దు. ఆ తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పెసరు పప్పులో వేసి కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి వేడి అయ్యేంత వరకూ వెయిట్ చేయాలి. పెసరు పప్పు మిశ్రమాన్ని గారెలుగా చేసి.. నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని. పల్లీ చట్నీతో కలిపి తింటే.. రుచి బాగుందని చెబుతారు. పెసరు పప్పు గారెలు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు. కొత్తగా ఉంటుంది. ఇతర పప్పులతో చేసిన గారెల కంటే.. పెసర పప్పుతో చేసిన గారెలు త్వరగా జీర్ణమవుతాయి.