Spiced Coffee | చల్లచల్లని అల్లం కాఫీ.. మాపుల్ జింజర్ ఐస్‌డ్ కాపచినో!
28 March 2022, 7:43 IST
- అల్లం ఛాయ్ అందరికీ తెలిసిందే.. కాపచినో ఫ్లేవర్ కూడా రుచిచూసే ఉంటారు. మనం ‘టీ’ని ఎన్నో రకాలుగా చేసుకుంటాం. కానీ కాఫీని కొంచెం స్పైసీగా ఎప్పుడైనా ట్రై చేశారా? దాదాపు ఎవరూ చేసి ఉండరు. కాబట్టి మీకోసమే ఈ సరికొత్త కాఫీ రెసిపీ, ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఆస్వాదించండి.
Maple Ginger Iced Cappuccino
లాక్‌డౌన్ తర్వాత జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది తమకు తాముగా ఏదైనా తయారుచేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇంట్లోనే ఉంటూ తమకు నచ్చిన వంట సిద్ధం చేసుకోవడం, కొత్త రెసిపీలను కనిపెట్టడం ఇలా చాలా జరిగాయి. అలా వచ్చిన ఒక కొత్త కాఫీ రెసిపీనే.. 'మాపుల్ జింజర్ ఐస్‌డ్ కాపచినో'
కాపుచినో మనందరికీ తెలిసిన కాఫీ ఫ్లేవరే, అయితే దానికి మాపుల్ జింజర్ ట్విస్ట్ ఇస్తే టేస్ట్ ఇంకాస్త డిఫెరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలంలో వేడి పానీయాలకు బదులు, చల్లటి పానీయాలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఇందులో అల్లం ఉండటం మూలానా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
మరి ఈ మాపుల్ జింజర్ ఐస్‌డ్ కాపుచినోకి ఏమేం కావాలి? ఎలా తయారో చేసుకోవాలో ఇక్కడే అందజేస్తున్నాం. వీలైతే ఈరోజు మీరూ ప్రయత్నించి చూడండి.
మాపుల్ జింజర్ ఐస్‌డ్ కాపచినోకి కావలసినవి
45ml కాఫీ ఎస్ప్రెస్సో (మోకా పాట్ కాఫీని కూడా ప్రయత్నించవచ్చు)
20ml మాపుల్ సిరప్
దాల్చిన చెక్క 1 చిన్న ముక్క
తాజా అల్లం ఒక కొమ్ము
200 ml పాలు
6-8 ఐస్ క్యూబ్స్
తయారీ విధానం
ఒక గిన్నెలో పాలు తీసుకొని అందులో మాపుల్ సిరప్, తురిమిన తాజా అల్లం, దాల్చిన చెక్కలను వేయండి. ఆపై స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలను చల్లబరచండి. ఆ తర్వాత పాలలో వేసిన దాల్చిన చెక్క, అల్లం ముక్కలను వడకట్టండి.
ఇప్పుడు ఈ పాలను నురుగు వచ్చేలా చేయడానికి ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్‌తో విప్ చేయండి. అనంతరం ఒక గ్లాసులో 6-8 ఐస్ క్యూబ్స్ తీసుకుని అందులో ఎస్ప్రెస్సో వేయండి. ఆ తర్వాత విప్ చేసిన పాలను గ్లాసులో పోయండి.
పైన అలంకరణ కోసం కొద్దిగా మాపుల్ సిరప్, దాల్చిన చెక్క పొడి వేయండి. అంతే, మాపుల్ జింజర్ ఐస్‌డ్ కాపచినో సిద్ధం అయింది. ఇప్పుడు ఒక్కోసిప్ ఆస్వాదించండి!!
టాపిక్