తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strong Career | పటిష్టమైన కెరీర్ కోసం 5 సూత్రాలు

Strong career | పటిష్టమైన కెరీర్ కోసం 5 సూత్రాలు

23 February 2022, 9:02 IST

  • Strong Career foundation principles | మనిషి జీవితం ఆటుపోట్లకు గురవుతూనే ఉంటుంది. శారీరక అవస్తలు, మానసిక వ్యథలు నిరుపేదల నుంచి ధనవంతుల వరకు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. కోట్లు ఉన్నా కొన్ని వ్యథలకు ఉపశమనం దొరకదు. కానీ కొన్ని స్కిల్స్‌తో మనిషి మానసికంగా బలవంతుడిగా ఉండొచ్చు.
మిమ్మల్ని బలవంతుడిగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది
మిమ్మల్ని బలవంతుడిగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది (unsplash)

మిమ్మల్ని బలవంతుడిగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది

కొత్త అనుభవాల కోసం తపించండి

చాలా మందిలో సర్వ సాధారణంగా గమనించే అంశమే ఇది. కలలు కంటారు. కానీ సాకారం చేసుకునేందుకు ముందుకు సాగరు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లేందుకు అస్సలు సిద్ధపడరు. ఏమైనా జరిగితే ఎలా? ఒకవేళ ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఎలా? ఈ ఉద్యోగం వదిలి మరో చోట చేరితే అక్కడ జాబ్ సెక్యూరిటీ లేకపోతే ఎలా? ఇలా అనేక అనుమానాలు, అపోహలతో గందరగోళానికి గురై ఉన్న చోట నుంచి ముందుకు సాగరు. నిరంతరం కొత్త అనుభవాలు మనిషి ఎదుగుదలకు కారణమవుతాయి. అందువల్ల కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, కొత్త సవాళ్లు స్వీకరించి పరిష్కరించగలిగితేనే మీరు మరింత దృఢంగా మారుతారు.

నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోండి

చాలాసార్లు మన ఉద్యోగ, వ్యాపార జీవితం రొటీన్‌గా సాగుతుంది. మన పనేంటో అంతవరకే మనం సర్కిల్ గీసుకుని అందులో బతికేస్తుంటాం. ఆ ఒత్తిడిలోనే బతుకుతూ మన రాత ఇంతేలే అనుకుంటాం. కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జీవితంపై విశాల దృక్పథం ఏర్పడుతుంది. బతకడానికి ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయన్న నమ్మకం కలుగుతుంది. పుస్తకాలు చదవడం, మూవీస్, వెబ్ సిరీస్ చూడడం, పత్రికల్లో మనకు సంబంధించిన అంశాలే కాకుండా ఇతర అంశాలు చదవడం వల్ల మనకు సమాజంపై అవగాహన పెరుగుతుంది. యోగా, ధ్యానం, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లతో సరికొత్తగా జీవించడం సాధ్యమవుతుంది.

అరుదైన, విలువైన స్కిల్స్ నేర్చుకోండి

ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా మీరు ఇతరులతో సమానంగా రాణించడం సులువే. కానీ కొన్ని అరుదైన, అత్యంత విలువైన స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఇతరుల కంటే భిన్నంగా మీరు గుర్తింపునకు నోచుకుంటారు. సహజ సిద్ధంగా రాణిస్తారు. మీరు చేసే జాబ్‌కు ఇప్పుడు ఆ స్కిల్ అవసరం లేకపోవచ్చు. కానీ మీరు ఉన్నత స్థానంలోకి వెళ్లాక ఆ స్కిల్ అవసరం కావొచ్చు. పలానా వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయడం కష్టం అన్న తీరులో మీరు గుర్తింపునకు నోచుకోవాలి. అప్పుడు మీ స్థానం పదిలంగా ఉండడమే కాదు. పై స్థానాలకు వెళ్లేందుకు మీకు మీరే రహదారి వేసుకున్నట్టవుతారు.

ఇతరుల ఎదుగుదలకు సహకరించండి

ప్రేమిద్దాం డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారంటాడు ఓ తెలుగు సినిమాలో హీరో. ప్రేమించడం అంటే సాటి మనిషికి ఏ రూపంలో సాయం చేసినా అది ప్రేమే. అందువల్ల మన చుట్టూ ఉన్న మనుషుల ఎదుగుదలకు సాయం చేస్తే మన జీవనయానం కూడా సాఫీగా ఉంటుంది. ఏదో ఒక రోజు మీ కష్టాలు పంచుకునేందుకు మీ చుట్టూ ఉన్న వారు సాయపడతారు. మిమ్మల్ని ఒక మెట్టు పైకెక్కించేందుకు తప్పకుండా చేయి అందిస్తారు.

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి

జీవితంలో కష్టాలు లేని వాళ్లు, రాని వాళ్లు ఉంటారా? ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారు అనేక కష్టాలను ఎదుర్కొన్నవారే. డిప్రెషన్‌లో ఉండి బయటకు వచ్చిన వారు కొందరైతే, అకారణంగా జైళ్లలో ఉండి బయటకు వచ్చిన వారు కొందరు. జీవితం ఇక ముగిసిందనుకున్న వారు మళ్లీ ఫీనిక్స్ పక్షిలా రెక్కలు విప్పుకొని అత్యున్నత శిఖరాలకు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. అందువల్ల కొన్నిసార్లు ఉద్యోగం, వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి, మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా పయనించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వ్యథలో కూరుకుపోవడం కంటే మన ముందున్న చిక్కుముడులను ఒక్కటొక్కటిగా విప్పుకుంటూ ముందుకు సాగాలి. మన జీవితానికి ఒక విలువను మనమే ఇవ్వాలి.

టాపిక్

తదుపరి వ్యాసం