Washing Mashine: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే త్వరగా పాడైపోతుంది జాగ్రత్త
08 November 2024, 7:30 IST
Washing Mashine: వాషింగ్ మెషిన్ ఉపయోగించడం చాలా సులభం, కానీ ఇప్పటికీ కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి.
వాషింగ్ మెషీన్
వాషింగ్ మెషీన్ కనిపెట్టాక దుస్తులు ఉతకడం సులువైపోయింది. ఒకప్పుడు గృహిణులు రోజంతా ఇంట్లో బట్టలు రుద్దడం, ఉతకడంలోనే గడిపేవారు. వాషింగ్ మెషీన్ రాకతో, మురికి దుస్తులు కూడా తళతళ మెరిసిపోతాయి. వాషింగ్ మెషీన్ వాడడం ఎంత సులువంటే దుస్తులను లోపల వేసి స్విచ్ నొక్కితే చాలు, పరిశుభ్రంగా బట్టలు బయటికి వచ్చేస్తాయి.
వాషింగ్ మెషీన్ వల్ల దుస్తులు ఉతకడం అనేది కొన్ని నిమిషాల పనిగా అయిపోయింది. అందుకే వాషింగ్ మెషీన్ నేడు లగ్జరీ వస్తువుగా కాకుండా ప్రతి ఇంట్లో కనిపించే పాపులర్ ఐటమ్‌గా మారింది. వాషింగ్ మెషిన్ ఉపయోగించడం కష్టమైన పని కానప్పటికీ అది వాడేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ ఖరీదైన వాషింగ్ మెషీన్ చాలా త్వరగా పాడైపోతుంది. వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు చేయకూడని తప్పులేంటో తెలుసుకోండి.
ఒకేసారి ఎక్కువ బట్టలు
వారంలో ఒకేరోజు బట్టలు ఉతికే పని పెట్టుకుంటారు చాలా మంది. అందుకే ఎక్కువ దుస్తులను వాషింగ్ మెషీన్ లో నింపుతుంటారు. ఈ చిన్న అలవాటు వాషింగ్ మెషీన్ ను పాడు చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. నిజానికి ప్రతి వాషింగ్ మెషీన్ కు ఒక కెపాసిటీ ఉంటుంది. ఎల్లప్పుడూ దాని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకునే, దుస్తులను మెషీన్ లో వేయాలి. ఒకేసారి ఎక్కువ బట్టలు పెట్టడం వల్ల మెషిన్ పై ఎక్కువ భారం పడుతుంది, దీని వల్ల దాని మోటార్ పాడవుతుంది. మీరు చాలా దుస్తులు ఉతకాల్సి వస్తే, వాటిని ఒకేసారి మెషీన్లో కుక్కేయకుండా రెండు లేదా మూడు సార్లు వేసుకోండి. ఇది మెషీన్ పై ఎక్కువ భారాన్ని పడనివ్వదు, కాబట్టి మెషీన్ పాడవ్వదు.
సరైన ప్రదేశంలో పెట్టకపోతే
వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికేటప్పుడు, మెషిన్ ని ఎల్లప్పుడూ సమాన ఉపరితలంపై ఉంచండి. చాలాసార్లు ప్రజలు దానిని అసమతుల్య ఉపరితలంపై అంటే వాలుగా ఉండే ఉపరితలంపై ఉంచడం వల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అలా ఎగుడు దిగుడుగా యంత్రాన్ని పెట్టి వాడితే మెషీన్ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాగే మెషీన్ ఆకారం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మెషిన్ లో బట్టలు ఉతికిన తర్వాత ఆ తడి బట్టలను ఎక్కువ సేపు మెషీన్ లో ఉంచే అలవాటు కొందరికి ఉంటుంది,ఇది కూడా వాషింగ్ మెషీన్ ను డ్యామేజ్ చేస్తుంది.
వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతుక్కునేటప్పుడు ఒకేసారి ఎక్కువ డిటర్జెంట్లు వాడకూడదు. వాస్తవానికి, చాలా వాషింగ్ మెషీన్లు కొంతవరకే నీటి, శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ డిటర్జెంట్ కలిపినప్పుడు, దానిలో విడుదలయ్యే నీటి ద్వారా మొత్తం డిటర్జెంట్ శుభ్రం చేయబడదు, ఇది తరువాత యంత్రంలోనే గడ్డకడుతుంది. దీనివల్ల క్రమంగా వాషింగ్ మెషీన్ మోటారు జామ్ అవుతుంది. దానిని పరిష్కరించడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
కొందరు దుస్తుల్లో ఏవైనా వస్తువులు ఉన్నాయేమో చెక్ చేయకుండా వాషింగ్ మెషీన్లు వేస్తూ ఉంటారు. అలా ప్యాంట్లలో నాణాలు, పిన్‌లు, టూత్ పిక్ వంటి వస్తువులు ఉండిపోతాయి. అవి వాషింగ్ మెషిన్ అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. కాబట్టి వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసే ముందు జేబులు చెక్ చేసి వేయాలి.