Bathukamma songs: శుద్ధ పాడ్యమి నాడు ఉయ్యాలో.. అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో..
14 October 2023, 15:01 IST
Bathukamma songs: బతుకమ్మ పాటలో పండగ ప్రాముఖ్యత, విశిష్టత తెలిపే పాటలుంటాయి. అలాంటి వాటిలో బతుకమ్మ పూల గురించి కథలా చెప్పే పాట ఒకటి HT Telugu సేకరించింది.
బతుకమ్మ పాటలు
బతుకమ్మ మీద బోలేడు పాటలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. బతుకమ్మ మొదలైన రోజు నుంచి.. బతుకమ్మ పేర్చడానికి వాడే పూల పేర్లు ఒక్కోటి చెప్తూ సాగిపోయే పాట ఇది.
శుద్ధ పాడ్యమి నాడు ఉయ్యాలో..
అమవాస్య మొదలుకొని ఉయ్యాలో..
ఆ తొమ్మిది దినములు ఉయ్యాలో..
అమ్మను కొలవగా ఉయ్యాలో..
తొమ్మిది రోజులు ఉయ్యాలో..
నమ్మిక తోడుతో ఉయ్యాలో..
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో..
అరుగులు వేయించి ఉయ్యాలో..
గోరింట పూలతో ఉయ్యాలో..
గోడాలు పెట్టించి ఉయ్యాలో..
తామర పులతో ఉయ్యాలో..
ద్వారాలు పెట్టించి ఉయ్యాలో..
మొగలి పూల తోను ఉయ్యాలో..
మొగరాలు ఎక్కించి ఉయ్యాలో..
వాయిలి పూలతో ఉయ్యాలో..
వాసాలు చేయించి ఉయ్యాలో..
పొన్నపూలతోడ ఉయ్యాలో..
ఇల్లును కప్పించి ఉయ్యాలో..
తంగెడు పూలతో ఉయ్యాలో..
తలుపులు వేయించి ఉయ్యాలో..
బీర పూల తోను ఉయ్యాలో..
తోరణాలు కట్టి ఉయ్యాలో..
పసుపు ముద్ద చేసి ఉయ్యాలో..
గౌరమ్మను నిలిపి ఉయ్యాలో..
చేమంతి పూలతో ఉయ్యాలో..
చెలియను పూజించి ఉయ్యాలో..
మందార పూలతో ఉయ్యాలో..
మగువ నిన్ను కొలిచి ఉయ్యాలో..
పారిజాతా పూలు ఉయ్యాలో..
పావని నను మొక్కి ఉయ్యాలో..
గన్నెరు పూలను ఉయ్యాలో..
గౌరి నీకర్పించి ఉయ్యాలో..
పసుపు కుంకుమలతో ఉయ్యాలో..
బుక్క గులాలతో ఉయ్యాలో..
సుందరాంగులెల్ల ఉయ్యాలో..
చుట్టూతా తిరిగిరి ఉయ్యాలో..
ఆటలు ఆడిరి ఉయ్యాలో..
పాటలు పాడిరి ఉయ్యాలో..
ఆటపటలు చూసి ఉయ్యాలో..
ఆనందమెరిగిరి ఉయ్యాలో..
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో..
ఆ కాంతలందరికీ ఉయ్యాలో..
పాడిన వారికి ఉయ్యాలో..
పాడిపంటల నిచ్చు ఉయ్యాలో..
ఆడిన వారికి ఉయ్యాలో..
అష్ట ఐశ్వర్యాలు ఉయ్యాలో..