Balcony decor tips: బుజ్జి బాల్కనీని ఇలా అలంకరించుకోండి..
10 September 2023, 19:17 IST
Balcony decor tips: అపార్ట్‌మెంట్లలో ఉండే చిన్న బాల్కనీని ఎలా అలంకరించుకోవాలా అని చూస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఇరుకు లేకుండా, విశాలంగా.. అందంగా కనిపిస్తుంది మీ బాల్కనీ. అవేంటో చూడండి.
బాల్కనీ డెకొరేషన్ టిప్స్
మనకు ఇంట్లో ఎంత చోటైనా ఉండనీ... కాసేపు అలా రిలాక్స్ అవ్వాలంటే వెంటనే బాల్కనీలోకి వెళ్లి కూర్చుంటాం. ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగాలన్నా, సాయంత్రం ఏదైనా చిరు తిండ్లు తింటూ సమయం గడపాలన్నా మన అడుగులు బాల్కనీ వైపే పడతాయి. మరి మనకు ఉన్నది చిన్న బాల్కనీ అయినా అందంగా అలంకరించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి.
ఫర్నిచర్ :
చిన్న బాల్కనీల్లో చోటు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ స్థలం మొత్తాన్ని పెద్ద ఫర్నిచర్‌లు పెట్టి నింపేయవద్దు. బదులుగా చిన్న కాఫీ టేబుల్, రెండు కుర్చీలు వేసుకోండి. ఉయ్యాల ఇష్టం అయితే చిన్న దాన్ని వేసుకునేందుకు ప్రయత్నించండి. పడుకోవడానికి వీలుగా ఉండే పెద్ద ఉయ్యాలల్ని చిన్న బాల్కనీల్లో వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఫర్నిచర్ ఎంత కొద్ది మొత్తంలో ఉంటే అంతలా బాల్కనీని అలంకరించుకునేందుకు వీలవుతుంది.
ఫ్లోర్:
బాల్కనీ ఫ్లోర్‌లను ఇప్పుడు చాలా మంది గ్రీన్ మ్యాట్‌లతో అలంకరించుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతాన్ని తుడుచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం దీనితో ఇబ్బందిగా ఉంటుంది. దుమ్మంతా ఆ గ్రాస్‌లో పట్టేసి ఇబ్బందిగా తయారవుతుంది. బదులుగా చెక్క టైల్స్ లాంటి వాటిని ప్రయత్నించండి. రిచ్ లుక్‌తోపాటు శుభ్రం చేయడానికీ తేలికగా ఉంటుంది. లేకపోతే మొక్కలు పెట్టుకునే భాగం వరకు గ్రాస్ మ్యాట్, తక్కిన భాగాన్ని వుడ్ టైల్స్‌తో అలంకరించి చూడండి. బాగుంటుంది.
మొక్కలు:
మీ బాల్కనీలోకి ఎంత ఎండ వస్తుంది? ఎంత సేపు వస్తుంది? అనే విషయాన్ని బట్టి మొక్కల్ని ఎంచుకోండి. అందమైన మొక్కల స్టాండ్ వల్ల మీ బాల్కనీ ఎంతో ఎలివేట్ అవుతుంది. కృత్రిమ మొక్కల్ని అలంకరించడం కంటే సహజమైన మొక్కలతోనే అలంకరించుకోండి. మనం కూర్చుంటే బయట వారికి ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే గనుక కర్టెన్లకు బదులుగా తీగ జాతి మొక్కలను ఎంచుకోండి. అవి లతలు అల్లుకుని పూలు పూస్తుంటే అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి మనకూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కింద ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మరింత ఇరుకుగా అయిపోతుంది అనుకున్నప్పుడు వాల్ హ్యాంగర్ పాట్లను, ట్రైలింగ్ బాస్కెట్లను ఎంచుకోండి. వెర్టికల్ గార్డెనింగ్ కోసం చాలా రకాల కుండీలు మార్కెట్లో, ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ చోటుకు తగ్గట్టుగా కుండీలను ఎంచుకుని మొక్కలను అలంకరించుకోండి. అలాగే మరీ ఎక్కువగా మొక్కలు పెట్టేసినా చిన్న బాల్కనీలు ఇరుకుగా మారతాయి. కాబట్టి చోటుకు తగ్గట్టు తగినన్ని మాత్రమే పెట్టుకోండి. పార్టీ లుక్ కావాలంటే ఈ మొక్కలకే సీరియల్ లైట్లను వేలాడదీయండి. అంతే.. అదిరిపోయే బాల్కనీ మేకోవర్ మీరే చేసేసుకోవచ్చు.