తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Feeding At 6-12 Months: బేబీకి 6 నెలలు నిండాయా? ఈ ఫుడ్ తినిపించండి

Baby feeding at 6-12 months: బేబీకి 6 నెలలు నిండాయా? ఈ ఫుడ్ తినిపించండి

HT Telugu Desk HT Telugu

22 November 2022, 20:20 IST

google News
    • Baby feeding at 6-12 months: మీ శిశువు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడానికి ప్రతిరోజూ తగినంత పోషకాహారం అవసరం అవుతుంది. 6 నెలల వయస్సులో పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ శక్తి, పోషకాలు అవసరం అవుతాయి. ఇప్పటికే తల్లిపాలు తాగుతున్న చిన్నారులకు 6 నెలల వయస్సు వచ్చాక ఘన పదార్థాలు కూడా అవసరమవుతాయి.
బేబీకి ఇచ్చే ఘనాహారం విషయంలో తల్లితండ్రులకు అవగాహన అవసరం
బేబీకి ఇచ్చే ఘనాహారం విషయంలో తల్లితండ్రులకు అవగాహన అవసరం

బేబీకి ఇచ్చే ఘనాహారం విషయంలో తల్లితండ్రులకు అవగాహన అవసరం

ఆరు నెలల మీ చిన్నారికి ఇక తల్లి పాలతోపాటు ఘన పదార్థాలు కూడా తినిపించడం ప్రారంభించమని వైద్యులు సూచిస్తారు. 

తల్లిపాలతో పాటు ఈ వయస్సులో దుంపలు, ధాన్యాలు అవసరమవుతాయి. క్రమంగా అలవాటు చేస్తూ ఏడాది వయస్సు వచ్చేసరికి పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు అన్నీ తినిపించవచ్చు.

తొలిసారి ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలంటే తల్లిపాలు ఇచ్చి మరోసారి తల్లిపాలు ఇవ్వడానికి మధ్య సమయంలో నెమ్మదిగా అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల బేబీ అటు తల్లి పాలు తాగడం కొనసాగిస్తూ, నెమ్మదిగా ఘనాహారానికి అలవాటు పడుతుంది. ఘనాహారం తీసుకునే సమయం వచ్చేసరికి ఆమె నేలపై పాకడం కూడా ప్రారంభిస్తుంది. ఈ సమయంలో అనారోగ్యానికి గురవ్వొచ్చు. పాప నేలపై పాకుతున్నప్పుడు బ్యాక్టీరియా, క్రిములు చేతుల ద్వారా, నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి గురికావొచ్చు.

baby feeding: మొదటి ఆహారం ఎలా ఉండాలి?

బిడ్డకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు, ఆమె నమలడం నేర్చుకుంటుంది. మొదట్లో పెట్టే ఫుడ్ మృదువుగా ఉండాలి. గంజిలా, గుజ్జులా ఉండాలి. సాధారణంగా పల్లె వాతావరణంలో పెరిగిన వారికి ఉగ్గు తెలిసే ఉంటుంది. వివిధ పప్పులను వినియోగించి పొడి చేసి ప్రతి రోజూ ఉగ్గు కలిపి తాగిస్తారు. ఇవి చేయడం రాని వాళ్లు పండ్లు గుజ్జులా చేసి తినిపించవచ్చు. కూరగాయలు ఉడికించి గుజ్జులా చేస్తే అవి మింగడం చాలా సులభం. గంజి చేస్తే కూడా మందంగా ఉండాలి. మొదట్లో రోజులో రెండుసార్లు మాత్రమే అలవాటు చేయండి. అది కూడా రెండు మూడు చెంచాల ఆహారం సరిపోతుంది. కొత్త ఆహారం రుచికి ఆమె అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.

Baby feeding: బలవంతంగా తినిపించొద్దు..

చాలా మంది తల్లిదండ్రులు విభిన్నంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు బేబీ వయస్సు చూడకుండా లోపలికి బలవంతంగా తోస్తుంటారు. మరికొందరు బేబీకి ఏడాది వయస్సు వచ్చినా ఆహారం తినిపించేందుకు భయపడుతుంటారు. ఇవి రెండూ కూడా సరికాదు. బిడ్డకు ఓపికగా తినిపించాలి. బలవంతం చేయొద్దు. లేదంటే బేబీ పెరిగేకొద్దీ ఆహారం అంటేనే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. బిడ్డ పెరిగే కొద్దీ ఆమె పొట్ట కూడా పెరుగుతుంది. అప్పుడు క్రమంగా పెంచవచ్చు.

6 నుంచి 8 నెలల వయస్సులో బేబీ ఫీడింగ్

6 నుంచి 8 నెలల వయస్సులో బేబీ రోజుకు రెండు నుండి మూడు సార్లు అరకప్పు మెత్తటి ఆహారాన్ని తినేలా చూడండి. ఏడాది వయస్సు వచ్చే వరకు తేనె తినిపించకూడదు. బిడ్డ ఘనాహారాల పరిమాణం పెరిగిన కొద్దీ ఆమె అదే మొత్తంలో తల్లిపాలని పొందడం మంచిది.

9 నుంచి 11 నెలల వయస్సులో బేబీ ఫీడింగ్

9-11 నెలల వయస్సులో బేబీ రోజుకు మూడు నుండి నాలుగు సార్లు అరకప్పు ఆహారాన్ని తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన చిరుతిండిని తీసుకోవచ్చు. ఆహారాన్ని అంతగా గుజ్జు చేయాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో బేబీ తన వేళ్లతో స్వయంగా ఆహారాన్ని తినడం కూడా మనం చూడొచ్చు. బేబీకి ఆకలిగా ఉన్నప్పుడు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించడం మంచిది. బేబీ ఆహారం తినడానికి సులభంగా, పోషకాహారంతో కూడినదై ఉండాలి. మీ బిడ్డకు ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినిపించవచ్చు. గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, శక్తినిచ్చే నూనెలతో పాటు తినిపించవచ్చు. ముఖ్యంగా పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు బేబీ ఫుడ్‌లో చేర్చవచ్చు. అన్ని పోషకాలను పొందడానికి ఇది ఉత్తమమైన మార్గమని గమనించాలి. మొదట్లో ఈ ఫుడ్ మీ బేబీ ఇష్టపడకపోతే బయటకు ఉమ్మివేస్తుంది. బలవంతం చేయకుండా కొద్ది రోజులు ఆగి మళ్లీ ప్రయత్నించండి. లేదా బేబీ ఇష్టపడే ఇంకో ఫుడ్‌తో పాటు కలిపి దీనిని తినిపించండి.

తల్లిపాలు అందని బిడ్డలకు ఆహారం

కొన్నిసార్లు పాలు పడని తల్లులు తమ పిల్లలకు ఆహారంగా ఏం ఇవ్వాలని సతమతమవుతుంటారు. బేబీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పొందడానికి పాల ఉత్పత్తులతో సహా ఇతర ఆహారాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. తల్లి పాలు తాగే వారికంటే వీరిలో అధిక పౌష్టికాహారం అవసరం. అందుకే 6 నెలల వయస్సులో మీ బిడ్డకు ఘనమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి. రోజుకు నాలుగుసార్లు రెండు మూడు చెంచాల మెత్తటి ఆహారం ఇవ్వండి. 6--8 నెలల వయస్సులో రోజుకు నాలుగుసార్లు అరకప్పు మృదువైన ఆహారం ఇవ్వాలి. 9-11 నెలల వయస్సులో రోజుకు నాలుగైదు సార్లు అరకప్పు ఆహారం, రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ అవసరమవుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం