Ayurvedam Tea: ప్రతిరోజూ ఆయుర్వేదం చెబుతున్న ఈ టీని తాగండి, మెదడు సమస్యలు రాకుండా ఉంటాయి
13 August 2024, 7:00 IST
- Ayurvedam Tea: విషయాలను మర్చిపోవడం, చదివింది గుర్తుకురాకపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వాటితో పోరాడాలంటే ఆయుర్వేదం చెబుతున్న బ్రాహ్మీ, అశ్వగంధతో చేస్తున్న టీని తాగడం ఉత్తమం.
ఆయుర్వేదం టీ
Ayurvedam Tea: ఆయుర్వేదం ఫలితాలు నెమ్మదిగా కనిపించినా ఉత్తమ ఆరోగ్యాన్ని అందించే వైద్య విధానం ఇది. ఇప్పటి ఆధునిక జీవితంలో, బిజీ షెడ్యూల్లో ఒత్తిడి స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది కూడా మతిమరుపుకు, మెదడు సమస్యలకు కారణం అవుతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయడం లేదు అనిపిస్తే లేదా జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్టు అనిపించినా వెంటనే ఆయుర్వేదం చెబుతున్న ఒక అద్భుతమైన టీని తాగడం అలవాటు చేసుకోండి. ఇది జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం బ్రాహ్మీ, అశ్వగంధతో చేసిన టీని తాగేందుకు ప్రయత్నించండి. ఇది మీకు మానసికంగా ఎంతో బలాన్ని అందిస్తుంది.
మెదడుకు వచ్చే సమస్యలు
తీవ్రమైన ఒత్తిడి, నిద్ర లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం ఇవన్నీ కూడా మెదడుకు కలిగే అనారోగ్యాలు. వీటిని ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా పరిష్కరించుకోవాలి. మెదడుకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో అంచనా వేయడం కష్టమే. మీలో మానసిక స్పష్టత తగ్గిపోతుంది. తిరిగి ఆ మానసిక స్వస్థతను మెదుడుకు ఇవ్వాలంటే ప్రతిరోజు ప్రకృతి ప్రసాదించిన టీని తాగడం అలవాటు చేసుకోవాలి.
బ్రాహ్మీ, అశ్వగంధ ఈ రెండూ కూడా పురాతన ఔషధ మూలికలు. ఇవి ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవి.
బ్రాహ్మీ అంటే ఏమిటి
బ్రాహ్మి అంటే బాకోపా మొన్నీరి అంటారు. ఇది జ్ఞానాన్ని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. సాంప్రదాయ భారతీయ వైద్యంలో దీన్ని విస్తృతంగా వాడతారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను ఇది అందిస్తుంది. బ్రాహ్మిలో క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులో సినాప్టిక్ కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి. మొత్తం మీద మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
అశ్వగంధ అంటే
అశ్వగంధ ఆయుర్వేదంలో ప్రధాన ఔషధం. దీన్ని భారతీయ జిన్సెంగ్ అంటారు. దీనిలో అడాప్టోజనిక్ లక్షణాలు ఎక్కువ. దీనివల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తిని అదుపు చేస్తుంది. మెదడుకు ప్రశాంతతను అందిస్తుంది. అభ్యాస సామర్ధ్యాలను పెంచుతుంది.
ఆయుర్వేదంలో ప్రధాన మూలికలైన బ్రాహ్మీ, అశ్వగంధ... ఈ రెండింటినీ కలిపి చేసే టీని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. మొత్తం మెదడు ఆరోగ్యాన్ని ఈ రెండు ఔషధమూలికలు కాపాడతాయి. మెదడులోని కణాలు ఆక్సీకరణ నష్టానికి బలికాకుండా అడ్డుకుంటాయి.
బ్రాహ్మీ, అశ్వగంధ టీని ఎలా చేయాలి?
మార్కెట్లో బ్రాహ్మీ, అశ్వగంధ పొడులు లభిస్తున్నాయి. వాటిని కొని ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని వేయాలి. వాటిలో బ్రాహ్మి పొడిని ఒక స్పూన్ వేయాలి. అలాగే అశ్వగంధ పొడిని ఒక స్పూన్ వేయాలి. నీటిని స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ నీటిని ఒక కప్పులో వడకట్టుకోవాలి. దీనికి రుచి కోసం తేనే లేదా నిమ్మరసం జోడించుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఈ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. మీకు కేవలం రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.