Suffering From Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా? అయితే ఇవి తినకండి..
18 May 2022, 10:09 IST
- సమ్మర్లో వచ్చే ప్రధాన సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించడం ఎంత సులువో... కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తీవ్రమవుతుంది. మీరు ఇప్పటికే మలబద్ధకంతో ఉన్నట్లయితే.. మీరు ఈ ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి.
మలబద్ధకమా?
Suffering From Constipation | వేసవిలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఎందుకంటే తీవ్రమైన వేడి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దీనివల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. అయితే ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు. లేకుంటే పరిస్థితి మరింత తీవ్రతరం కావొచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. జీలకర్ర
జీలకర్ర జీర్ణక్రియకు మంచిదని అందరికి తెలుసు. కానీ అదే సమయంలో ఇది పొడిగా, గట్టి స్వభావంతో మలబద్ధకాన్ని తీవ్రతరం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆయుర్వేదంలో జీలకర్రను జీరకా అని పిలుస్తారు. దీని అర్థం జీర్ణం. ఇది జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆకలి, విరేచనాలు, ఐబిఎస్‌లకు అద్భుతమైనది కానీ మలబద్ధకం కోసం మాత్రం కాదు అంటున్నారు నిపుణులు.
2. పెరుగు
ఆయుర్వేదం ప్రకారం పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు పెరుగును తప్పనిసరిగా నివారించాలి.
3. కెఫిన్
కెఫీన్ నిర్జలీకరణానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇది మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి మీరు కెఫిన్ వాడకపోవడమే మంచిది. కెఫీన్ మన జీర్ణవ్యవస్థలోని కండరాలను ఉత్తేజపరుస్తుందని అందరూ అనుకుంటాము. కానీ కెఫీన్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే.. కెఫిన్ నివారించాలి.
అయితే మలబద్ధకం ఉన్నా.. లేకపోయినా టీ లేదా కాఫీతో రోజు ప్రారంభించవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని నీరు లేదా ఒక టీస్పూన్ ఆవు నెయ్యి తీసుకోవాలని సూచిస్తున్నారు.