Aratikaya Karam Podi: వెల్లుల్లి కారం లాగే అరటికాయ కారం పొడి చేయండి ఎంతో రుచి
19 March 2024, 18:19 IST
- Aratikaya Karam Podi: కారంపొడి అనగానే వెల్లుల్లి కారం, ఇడ్లీ కారం, కంది కారం... ఇవే గుర్తొస్తాయి. ఓసారి అరటికాయ కారం చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.
అరటికాయ కారం పొడి
Aratikaya Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి కారం పొడులను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. వీరు అధికంగా ఇడ్లీ కారం పొడి, కంది పొడి, వెల్లుల్లి కారం, పల్లీకారం, కరివేపాకు కారం వంటివి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అరటికాయ కారంపొడి కూడా చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ అరటికాయ కారంపొడి వేసుకొని అర స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. దీన్ని ఇడ్లీ, దోశల్లోకి కూడా తినవచ్చు. ఈ అరటికాయ కారం పొడి చేయడం చాలా సులువు. ఒకసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
అరటికాయ కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
అరటికాయలు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాలు - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - ఐదు
మిరియాలు - ఒక స్పూను
మినప్పప్పు - రెండు స్పూన్లు
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
పసుపు - చిటికెడు
కరివేపాకు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
నూనె - సరిపడినంత
ఆవాలు - అర స్పూను
ఎండు కొబ్బరి తురుము - మూడు స్పూన్లు
అరటికాయ కారం పొడి రెసిపీ
1. అరటికాయ కారం పొడి చేయడం చాలా సులువు.
2. దీన్ని ఒకసారి చేసుకొని ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
3. స్టవ్ వెలిగించి చపాతీ కాల్చే గ్రిడ్డును పెట్టి దానిపై అరటికాయలను ఉంచి కాల్చాలి.
4. అన్ని వైపులా కాలాక స్టవ్ కట్టేయాలి.
5. అరటికాయలను చల్లార్చి మెల్లగా తొక్కను తీసేయాలి.
6. మిగతా అరటికాయ కాస్త మెత్తగా అవుతుంది.
7. దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి శెనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఇంగువ, మినప్పప్పు వేసి వేయించాలి.
9. అవి బాగా వేగాక తీసి మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
10. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకులు వేసి వేయించాలి.
11. తర్వాత అరటికాయ తురుమును వేసి బాగా కలుపుకోవాలి.
12. చిన్న మంట మీదే మూత పెట్టకుండా ఫ్రై చేయాలి.
13. పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
14. ఇది బాగా ఫ్రై అయ్యాక పొడిపొడిగా అవుతుంది.
15. ఆ పొడిగా అయినా అరటికాయ మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
16. చిన్న మంట మీద అది పొడిపొడిగా అయ్యేవరకు వేయించాలి.
17. అంతే అరటికాయ కారంపొడి రెడీ అయినట్టే.
1. ఇది ఇడ్లీతో తింటే అదిరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలోనూ టేస్టీగా ఉంటుంది.
అరటికాయలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు తినాల్సిన ఆహారాలలో అరటికాయ ఒకటి. దీనిలో విటమిన్ b6 అధికంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి అరటికాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా అరటికాయని పొడి చేసి పెట్టుకుంటే ప్రతిరోజూ రెండు ముద్దలు ఆ పొడితో తినవచ్చు. అలాగే దోసెల్లోకి, ఇడ్లీల్లోకి ఇది బాగుంటుంది. దోశెలు వేసినప్పుడు కారంపొడికి బదులుగా ఈ అరటికాయ కారంపొడి దోశెపై చల్లుకొని తినండి. చట్నీ అవసరమే లేకుండా సరిపోతుంది. అరటికాయకు పొట్టను శుభ్రం చేసే లక్షణం ఉంది. పెద్ద పేగుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే అరటి కాయలు తినడం చాలా అవసరం.