Apricots | ఆప్రికాట్స్ : మధురమైన రుచి.. విటమిన్ల గని
07 March 2022, 9:02 IST
- Apricots | ఆప్రికాట్స్ .. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ ఎప్పుడైనా వెళ్లి ఉంటే మీకు అతి మధురమైన ఆప్రికాట్స్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడి హోటల్స్‌లో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో ఫ్రూట్ సలాడ్‌లో భాగంగా మనకు తాజా ఆప్రికాట్లు మనకు దర్శనమిస్తాయి. ఒకసారి వాటిని ఆరగిస్తే ఆ మధురమైన రుచిని ఎప్పటికీ మరువలేరు.
ఆప్రికాట్స్
ఆరేంజ్ కలర్‌లో కనిపించే ఈ మధురమైన పండ్లు లద్ధాఖ్, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకం. ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఆప్రికాట్ డ్రైఫ్రూట్స్ మనం సూపర్ మార్కెట్లలో తరచుగా చూస్తాం. అయితే తాజా ఆప్రికాట్స్ మాత్రం రెండు రోజులకు మించి ఉండవు. పాడవుతాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వాటిని ఆరగిస్తే మీరు ఆ రుచిని జన్మలో మరిచిపోలేరు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కిలో తాజా ఆప్రికాట్స్ రూ. 200 - 300 మధ్య లభిస్తాయి. పండును పొట్టు తీయకుండా నేరుగా తినాలి. అయితే ఇందులో బాదాం గింజ కంటే పెద్దదైన ఒక విత్తనం కూడా ఉంటుంది. దానిని తీసిపడేయాలి.
ఆప్రికాట్స్‌లో ఏ పోషకాలు ఉంటాయి?
ఆప్రికాట్స్‌లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. బీటా కెరోటిన్, లుటైన్, జీక్సాంథిన్ వంటి పోషకాలు కలిగిన ఈ ఆప్రికాట్ పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.
డయాబెటిస్, గుండె జబ్బులపై పోరాడేందుకు వీలుగా ఇందులో ఫ్లవనాయిడ్స్ కూడా ఉంటాయి. అవి క్లోరోజెనిక్ యాసిడ్స్, కేట్‌చిన్స్, క్వెర్‌సెటిన్ రూపంలో ఉంటాయి. శరీరంలోని కణజాలాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేస్తూ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురికాకుండా చూస్తాయి.
చర్మ సంరక్షణకు ఆప్రికాట్స్
ఆప్రికాట్స్‌లో ఉండే విటమిన్-ఇ, విటమిన్-సి చర్మానికి రక్షణగా నిలుస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాలు మెలనోమా అనే చర్మ కాన్సర్‌కు కారణమవుతాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పదార్థాలు అవసరమవుతాయి. ఆప్రికాట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సీ కూడా అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చి చర్మం ముడతలు రాకుండా కాపాడుతుంది. బీటాకెరోటిన్ కూడా చర్మం పాడవకుండా కాపాడుతుంది.
కంటి చూపును కాపాడే ఆప్రికాట్స్
కంటి ఆరోగ్యానికి దోహదపడే అంశాలు ఆప్రికాట్‌లో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ పుష్కలంగా ఆప్రికాట్‌లో ఉన్నాయి. విటమిన్ - ఏ అంధత్వానికి గురికాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్-ఇ ఫ్రీరాడికల్స్ చేసే నష్టాన్ని పూరిస్తుంది. అలాగే ఈ పండులో లభించే కెరొటెనాయిడ్స్ మీ కళ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురికాకుండా కాపాడుతాయి.
గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేసే ఆప్రికాట్
ఫైబర్ ఉండే ఆప్రికాట్స్ జీర్ణాశయానికి మేలు చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉండేలా కాపాడుతుంది. అలాగే శరీరం అధిక బరువు బారిన పడకుండా చూస్తుంది.
మేలు చేసే పొటాషియం..
ఆప్రికాట్స్‌లో పుష్కలంగా లభించే పొటాషియం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ఫ్లూయడ్ బాలెన్స్ కాపాడుతూ రక్తపోటు రాకుండా చూస్తుంది. ఆప్రికాట్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండడం కూడా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది.