తెలుగు న్యూస్  /  Lifestyle  /  Anti Tobacco Day 2023 Date Significance Theme Celebrations

Anti Tobacco day 2023: నేడే పొగాకు వ్యతిరేక దినం.. ప్రాముఖ్యత, చరిత్ర, ఈ ఏడాది థీమ్ ఏంటంటే!

31 May 2023, 3:00 IST

    • Anti Tobacco day 2023: నేడు (మే 31) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని డబ్ల్యూహెచ్‍వో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పొగాకు వాడకంతో కలిగే నష్టాన్ని ఈ రోజున విస్తృతంగా ప్రచారం చేస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Anti Tobacco Day 2023: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) ప్రతీ ఏటా మే 31వ తేదీన యాంటీ టొబాకో డే (పొగాకు వ్యతిరేక దినం)ను నిర్వహిస్తుంది. దీన్ని ప్రపంచ నో టొబాకో డేగానూ పిలుస్తారు. ఈ ఏడాది నేడు (మే 31) ఈ పొగాకు వ్యతిరేక దినం జరగనుంది. పొగాకు వాడకం ద్వారా కలిగే ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు, హానికర ప్రభావాలపై డబ్ల్యూహెచ్‍వో ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న పాలసీలను పర్యవేక్షిస్తుంది. పొగాకు వ్యతిరేక దినం గురించి మరిన్ని వివరాలివే..

సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం, పొగాకు ప్రొడక్టులను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ -టొబాకో డేను డబ్ల్యూహెచ్‍వో నిర్వహిస్తోంది. పొగాకుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది. పొగ తాగడాన్ని మానడం ఎంత ప్రాముఖ్యమో వెల్లడిస్తుంది.

ఎప్పుడు మొదలైంది?

వరల్డ్ నో టొబాకో డే నిర్వహించాలని 1987 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించి, తీర్మానాన్ని ఆమోదించింది. 1988 ఏప్రిల్‍లో ఈ డే పేరుకు ఆమోదం తెలిపింది. 1988 మే 31వ తేదీ నుంచి ప్రతీ సంవత్సరం ఈ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది థీమ్ ఇదే..

పొగాకు వ్యతిరేక దినాన్ని ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‍తో డబ్ల్యూహెచ్‍వో నిర్వహిస్తుంటుంది. ఈ సంవత్సరం వీ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో (మాకు ఆహారం కావాలి, పొగాకు కాదు) అనే థీమ్‍తో జరపనుంది.

పొగాకు నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా నేడు డబ్ల్యూహెచ్‍వో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రపంచంలోని పలు విద్యాసంస్థలు సహా అనేక చోట్ల కార్యక్రమాలను నిర్వహించి పొగాకుకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తుంది. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదం, పొగాకుకు అలవాటు పడిన వారు ఎలా మానేయాలనే విషయాలను చెబుతుంది.

పొగాకు వల్ల ఎన్నో నష్టాలు

సిగరెట్లు, బీడీలు, చుట్టలు సహా పొగాకు ఉత్పత్తులు వాడే వారి ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు అధికంగా ఉంటాయి. పొగాకు ఎక్కువగా తాగే వారికి గుండెపోటు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. పొగాకులోని నికోటిన్ సహా వివిధ పదార్థాల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. పొగాకు ఎక్కువగా తాగే వారికి గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు నోటి సంబంధింత వ్యాధులు, వివిధ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే పొగాకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎవరైనా పొగాకు సేవిస్తున్నా.. వీలైనంత త్వరగా మానేందుకు తప్పక ప్రయత్నించాలి.

టాపిక్