Amla Side Effects : ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్.. ఎవరు తినకూడదు? ఎందుకు?
26 September 2023, 18:21 IST
- Amla Side Effects : ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. దీనితో అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. మీ రోజువారీ ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు ఉసిరిని తీసుకుంటే సమస్యలు కూడా వస్తాయి.
ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఒక చిన్న ఉసిరిలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఉసిరిని పురాతన కాలం నుండి వంటలో మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం సురక్షితం కాదు.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎసిటిక్ లక్షణాలూ ఉన్నాయి. ఇది తినడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకుంటే, అది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరి తీసుకుంటే, అది పొట్ట గోడకు చికాకు కలిగించి, ఎసిడిటీని తీవ్రతరం చేస్తుంది.
ఇప్పటికే రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉసిరిని తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు రక్తాన్ని పలుచగా చేసి సాధారణ రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధించగలవు. చిన్న గాయమైనా రక్తం గడ్డ కట్టకుండా బయటకు వస్తుంది. శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన వారు కొన్ని రోజులు ఉసిరికాయ తినకుండా ఉండాలి. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా రక్తస్రావం అవుతుంది.
ఇటువంటి అధిక రక్తస్రావం కణజాల హైపోక్సేమియా, తీవ్రమైన అసిడోసిస్ లేదా అవయవ వైఫల్యానికి దారితీస్తుంది. సర్జరీ చేయించుకోవాలని అనుకున్న వారు కనీసం 2 వారాల పాటు ఉసిరిని తినకూడదు. గూస్బెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరి మంచిదని భావించినప్పటికీ, రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి మంచిది కాదు. మధుమేహం ఉన్నవారు ఉసిరి తినాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి.
ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే, అది కడుపు సమస్యలు, విరేచనాలు, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి సమస్యలను మహిళలు భరించలేరు. గర్భిణీలు ఎక్కువగా ఉసిరిని తినకూడదని అంటున్నారు. మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోండి.
పొట్ట ఆరోగ్యానికి ఉసిరి చాలా మంచిది. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. అయితే ఉసిరికాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో అదనపు పీచుపదార్థం ఏర్పడి, మలబద్ధకం ఏర్పడుతుంది. ఉసిరి తింటే పుష్కలంగా నీరు తాగటం మర్చిపోవద్దు. అలా చేస్తే మలబద్ధకాన్ని నివారిస్తుంది.