Thursday Motivation: మీ జీవితకాలం పెరగాలంటే మీరు చేయాల్సిందల్లా చక్కటి స్నేహితులను పెంచుకోవడమే
25 July 2024, 5:00 IST
- Thursday Motivation: ఒక వ్యక్తి జీవితం ఆనందంగా, సంతోషంగా సాగాలంటే అతని చుట్టూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉండాలంటే అతనికి చక్కటి స్నేహితులు ఉండాలి.
మోటివేషనల్ స్టోరీ
Thursday Motivation: ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటే మాత్రం ఎలాంటి ఆనందం, సంతోషం ఉండదు. మన చుట్టూ నవ్వించే స్నేహితులు, బాధలో ఓదార్చే బంధువులు ఉండాలి. అప్పుడు జీవితం సంతోషంగా సాగుతుంది. మనం ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు మన చుట్టూ నిజమైన స్నేహితుడు ఒక్కడైనా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎంచుకున్న స్నేహితులంతా ఒకేలా ఉండరు. కొంతమంది మన మంచి కోరితే, కొందరు పరిస్థితిని బట్టి మారిపోతారు. స్నేహితుల్లో నిజమైన వారెవరో తెలుసుకుని ముందుకు సాగాలి. స్నేహితులు జీవితమనే సముద్రంలో పడవలాంటి వారు. మన జీవితం సాఫీగా స్థిరంగా, సౌకర్యంగా సాగేందుకు ఎంతో కొంత సాయం చేస్తారు.
బంధువులతో పోలిస్తే స్నేహితుల దగ్గరే ఎక్కువ మంది సౌకర్యంగా ఫీలవుతారు. వారు కుటుంబ బంధాలకు మించిన కంఫర్ట్ ను అందిస్తారు. మనల్ని జడ్జ్ చేయకుండా... మనం ఎలా ఉన్నామో అలాగే స్వీకరిస్తారు. కష్ట సమయాల్లో మద్దుతుగా నిలుస్తారు. కష్టం రాగానే... ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక స్నేహతుడు ఉంటే చాలు మనసు త్వరగా తేలికపడుతుంది. ఒక మంచి స్నేహితుడు మనల్ని త్వరగా అర్థం చేసుకుంటాడు, ప్రత్యేకమైన బంధాన్ని అందిస్తాడు.
బీబీసీ జర్నలిస్టు డేవిడ్ రాబ్సన్ తను రాసిన తాజా పుస్తకం ‘ది లాస్ ఆఫ్ కనెక్షన్’ లో స్నేహితులను కలిగి ఉన్న వ్యక్తులు ఒంటరిగా ఉన్న వారితో పోలిస్తే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు. మంచి స్నేహితులు ఉన్నవారికి గుండె జబ్బులు తక్కువగా వస్తాయని, రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
ఒక మనిషి ఆయుష్షు పెరగాలంటే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వదిలేయడంతో పాటూ చక్కటి స్నేహితులను కూడా కలిగి ఉండాలి. రాత్రి ఎనిమిదిలోపే భోజనాన్ని ముగించాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. చక్కెర పదార్థాలను తగ్గించుకోవాలి. మానసిక ఆరోగ్యం కోసం చక్కటి స్నేహాలను, అనుబంధాలను కూడా కలిగి ఉండాలి.