తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ajwain Water: వాము నీళ్లతో పొట్టకు సంపూర్ణ ఆరోగ్యం.. నీళ్లు తయారు చేసే పద్దతిదే..

Ajwain Water: వాము నీళ్లతో పొట్టకు సంపూర్ణ ఆరోగ్యం.. నీళ్లు తయారు చేసే పద్దతిదే..

HT Telugu Desk HT Telugu

17 September 2023, 14:30 IST

google News
  • Ajwain Water: అమ్మమ్మల కాలం నాటి చిట్కా వాము నీళ్లు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలున్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో, వాటి లాభాలేంటో చూసేయండి. 

వాము నీళ్ల ప్రయోజనాలు
వాము నీళ్ల ప్రయోజనాలు (freepik)

వాము నీళ్ల ప్రయోజనాలు

మన ఇళ్లలో వామును ఆహారంలో భాగంగా వాడుతుంటాం. పిల్లలకు అరుగుదల సరిగ్గా లేకపోయినా, పెద్దలు గ్యాస్‌ లాంటి వాటితో బాధ పడుతున్నా వంటింట్లో ఉన్న మందు వాము. జీర్ణ సంబంధిత సమస్యలకు ఔషధంగా దీన్ని వాడటం అనేది అమ్మమ్మల కాలం నుంచీ మన దగ్గర ఉంది. మరి ఈ వాము, వాము నీరు ఏఏ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ వాము నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పెద్ద గ్లాసు నీళ్లను గిన్నెలో వేసుకుని దానిలో ఓ స్పూను వామును వేయాలి. స్టౌ పైన పెట్టి అవి సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత గ్యాస్‌ కట్టేసి ఆ నీటిని వడకట్టుకోవాలి. వాటిని గోరు వెచ్చగా లేదా చల్లారిన తర్వాత తాగవచ్చు. లేకపోతే రాత్రంతా మంచి నీటిలో వామును వేసి నాననివ్వాలి. ఉదయం వాటిని వడగట్టుకుని తాగవచ్చు.

వాము నీళ్ల ప్రయోజనాలు :

  • కడుపులో ఫాం అయిన గ్యాస్‌ని తగ్గించేందుకు వాము నీళ్లు మంచి ఔషధంలా పని చేస్తాయి. ఎప్పుడూ గ్యాస్‌ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజూ వాము నీటిని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
  • జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో ఈ నీరు సహకరిస్తుంది. పేగుల కదలికను మెరుగుపరిచి సజావుగా మల విసర్జన జరిగేలా చేస్తుంది. దీని వల్ల పేగులు పూర్తిగా శుభ్రపడతాయి.
  • కొందరు పొట్ట, పొత్తు కడుపుల్లో నొప్పితో తరచుగా బాధపడుతూ ఉంటారు. అలాగే మహిళలకు నెలసరి సమయంలో పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఈ నీరు పరిష్కారాన్ని చూపుతుంది.
  • కొందరు స్త్రీలు నెలసరి సమయానికి రాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ నీటిని తాగడం వల్ల పీరియడ్స్‌ సైకిల్‌ సరవుతుంది. సమయానికి పీరియడ్స్‌ వస్తాయి.
  • దీనిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శ్వాస కోస వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒక వేళ జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి.
  • మీరు గనుక బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ నీరు తాగిన తర్వాత పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల ఆహారం తినడం తగ్గిస్తారు. దీంతో బరువు తగ్గుతారు.
  • వీటిని తాగడం వల్ల జీవ క్రియ మెరుగవుతుంది.

తదుపరి వ్యాసం