Bahubali Haleem | ఘుమఘుమలాడే బాహుబలి హలీమ్.. జై హైదరాబాద్!
07 April 2022, 15:11 IST
- రంజాన్ మాసం వచ్చేసింది, హైదరాబాద్ నగరంలో హలీమ్ ఘుమఘుమలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. ఓ రెస్టారెంట్ 'బాహుబలి హలీమ్' పేరుతో భారీగా వడ్డిస్తోంది.. ఆ వివరాలు తెలుసుకోండి..
A restaurant in Hyderabad serves Bahubali Haleem
రంజాన్ మాసం వచ్చిందంటే మార్కెట్లు కళకళలాడుతూ ఉంటాయి. రంజాన్ స్పెషల్ వంటకాల ఘుమఘుమలు గుబాలింపు మన ఆహార కోరికలను రెట్టింపు చేస్తాయి. ఇదే సమయంలో లోకల్ గా మనందరికీ తెలిసిన ఒక ప్రత్యేకమైన వంటకం మన నోర్లు ఊరించేలా చేస్తుంది. అదే హలీమ్.
చికెన్ లేదా మటన్ మాంసంతో గోధుమలు, ఇతర కాయధాన్యాలను గలిపి ఎంతో ఎంతో శ్రద్ధతో, శ్రమతో అంతకుమించిన ప్రేమతో ప్రత్యేకంగా తయారు చేసే వంటకమే హలీమ్. ఇది ముట్టుకోవడానికి రాగి సంకటిలాగా ఉంటుంది. నోట్లో వేసుకొని తింటే నోట్లోనే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. హలీమ్ పై కొద్దిగా నిమ్మరసం, కొంచెం వేయించిన ఉల్లిపాయలు, ప్రత్యేకంగా తయారు చేసిన ఒక గ్రేవీ వేసుకొని తింటే ఆ రుచికే మైమరిచిపోతాం.
మరి ఎక్కడ హలీమ్ దొరుకుతుంది అంటే తెలంగాణలో ముస్లింలు ఉన్న ప్రతీ చోట ఈ హలీమ్ లభిస్తుంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా నాణ్యమైన హలీమ్ అందించే ఎన్నో ప్రముఖ రెస్టారెంట్లు ఉన్నాయి.
సికింద్రాబాద్, కార్ఖానాలోని గ్రిల్-9 రెస్టారెంట్‌లో భారీ సైజులో 'బాహుబలి హలీమ్' అందిస్తున్నారు. మనం సాధారణం ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ అంటూ వింటుంటాం. ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు రెస్టారెంట్లు బకాసురా థాలీ, కుంభకర్ణ థాలీ, బాహుబలి థాలీ అంటూ వివిధ పేర్లతో స్పెషల్ గా వంటకాలను వడ్డిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రిల్-9 రెస్టారెంట్ 'బాహుబలి హలీమ్' పరిచయం చేస్తుంది. ఈ బాహుబలి హలీమ్‌ను నలుగురు వ్యక్తులు కడుపునిండా తినొచ్చు. ఈ హలీమ్ ప్లేటర్లో చికెన్ టిక్కా, ఉడికించిన గుడ్లు, పత్తర్-కా-గోష్ట్, బోన్ మ్యారో అదనంగా లభిస్తాయి. దీని ధర రూ.999/- నిర్ణయించారు.
ఇక, ఈ రెస్టారెంట్ కాకుండా, నగరంలోని కేఫ్ బాహర్, కేఫ్ 555, పిస్తా హౌజ్, షా గౌస్, షాదాబ్, బావార్చి, ప్యారడైజ్, మెహ్ఫిల్, బెహ్రోజ్, సర్వి రెస్టారెంట్లు అందిస్తున్న హలీమ్‌కు వినియోగదారుల నుంచి మంచి రేటింగ్స్ లభిస్తున్నాయి.