BMW M4 Competition Coupe। ఈ బీఎండబ్ల్యూ కార్ చాలా స్పెషల్.. ఇండియాలోనూ విడుదల!
11 August 2022, 15:51 IST
- లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూ తమ M డివిజన్ స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా భారత మార్కెట్లో BMW M4 Competition Coupé స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేసింది.
BMW M4 Competition
జర్మన్ లగ్జరీ కార్ మేకర్ BMW తమ M డివిజన్ కార్లలో M4 కాంపిటీషన్ కూపే (BMW M4 Competition 50 Jahre M Edition) కారును తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. BMW M GmbH 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్ M4 కారును విడుదల చేశారు. ఈ కారు ప్రపంచవ్యాప్తంగా పరిమిత ఎడిషన్‌లో లభిస్తుంది. భారత మార్కెట్లోకి ఈ మోడల్‌లో కేవలం 10 యూనిట్లను మాత్రమే తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1,52,90,000 (1.53 కోట్లు).
BMW M4 కాంపిటీషన్ కూపే 50 జహ్రే M ఎడిషన్ కంప్లీట్ బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా భారతదేశానికి వస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కారులో ప్రామాణిక కారుతో పోలిస్తే డిజైన్ పరంగా కొన్ని మార్పులు చూడవచ్చు. ఇందులో భాగంగా ముందుభాగంలో BMW సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌తో పాటు ఐకానిక్ M చిహ్నంతో వస్తుంది. ఇది సాంప్రదాయ BMW చిహ్నంకు కాస్త భిన్నంగా అనిపిస్తుంది.
BMW లేజర్‌లైట్ టెక్నాలజీతో అడాప్టివ్ LED హెడ్‌లైట్‌లను, ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేసిన కాంటౌరింగ్‌తో M-నిర్దిష్ట బాహ్య అద్దాలను పొందుతుంది. కారు ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేసినటువంటి ఫిన్స్, వెనుక స్పాయిలర్ అలాగే బ్లాక్ క్రోమ్‌లో రెండు జతల ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌లను కూడా పొందుతుంది.
క్యాబిన్ లోపల హై-గ్రేడ్ మెరినో లెదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది పూర్తిగా నలుపు రంగులో లభిస్తుంది. 10.25-అంగుళాల సెంట్రల్ ఇన్ఫర్మేషన్ హబ్, 16-స్పీకర్, 464-వాట్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల M డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇంజన్ కెపాసిటీ
M4 కాంపిటీషన్ కూపే 50 జహ్రే M ఎడిషన్‌లో 2993cc సామర్థ్యం కలిగిన 6-సిలిండర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ M స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది. ఈ మోటార్ 503bhp శక్తిని 650Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ కేవలం 3.5 సెకన్లలో సున్నా నుండి 100kmph వేగాన్ని అందుకోగలదు.
M4 కాంపిటీషన్ స్పెషల్ ఎడిషన్ కార్ BMW ఇండివిజువల్ కలర్ రేంజ్ నుంచి మకావు బ్లూ అలాగే ఇమోలా రెడ్ అనే రెండు ప్రత్యేకమైన పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. అదనంగా మ్యాట్ గోల్డ్ బ్రాంజ్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.