తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saamanyudu Review | 'సామాన్యుడు'గా విశాల్‌ మెప్పించాడా.. మూవీ రివ్యూ

Saamanyudu Review | 'సామాన్యుడు'గా విశాల్‌ మెప్పించాడా.. మూవీ రివ్యూ

HT Telugu Desk HT Telugu

04 February 2022, 13:55 IST

google News
    • పందెం కోడి, అభిమన్యుడు లాంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు హీరో విశాల్. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాలో ఎదో ఒక సామాజికాంశాన్ని టచ్ చేస్తుంటాడు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం సామాన్యుడు.
సామాన్యుడు మూవీలో విశాల్
సామాన్యుడు మూవీలో విశాల్ (Twitter )

సామాన్యుడు మూవీలో విశాల్

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి

దర్శకత్వం: శరవణన్

నిర్మాత: విశాల్

సంగీతం : యువన్ శంకర్ రాజా

డీఓపీ: కెవిన్ రాజా

ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్

శరవణన్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం (ఫిబ్రవరి 4) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విశాల్‌కు విజయాన్ని అందించిందా? పోలీస్ ఫార్ములా మరోసారి అతడికి కలిసి వచ్చిందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథానేపథ్యం

పోరస్(విశాల్) ఓ కానిస్టేబుల్ కొడుకు. తండ్రి లాగే పోలీస్ ఉద్యోగంలో చేరాలన్నది అతడి కల. చాలా ఆవేశపరుడు. పోలీసులకు ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని పోరస్ కు తండ్రి ఎప్పుడూ సలహా ఇస్తుంటాడు. పోరస్ చెల్లెలు ద్వారకను లోకల్ రౌడీ గుణ వేధిస్తుంటాడు. గుణపై పోలీసులు కేసు పెడతారు. అనూహ్యంగా ద్వారక హత్యకు గురవుతుంది. కేసు పరిశోధనలో పోలీసులు వాస్తవాలను దాచి పెడుతున్నారని గ్రహిస్తాడు పోరస్. 

తానే హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. శత్రువు మాత్రం అతడి కంటే ఓ అడుగు ముందుగానే ఉంటూ ఒక్కో ఆధారాన్ని చెరిపేస్తాడు. తన చెల్లెలి చావుకు కారణమైన వాడిని పోరస్ పట్టుకున్నాడా? ద్వారక హత్యకు కాబోయే ఎంపీ నీలకంఠానికి ఉన్న సంబంధమేమిటి? తాను ప్రేమించిన మైథిలిని(డింపుల్ హయతి) పోరస్ పెళ్లి చేసుకున్నాడా? పోలీస్ ఉద్యోగంలో చేరాలనే అతడి కల నెరవేరిందా? లేదా ? అన్నది చిత్ర ఇతివృత్తం.

విశ్లేషణ..

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. అధికారం, పలుకుబడితో పోలీసులను మభ్యపెడుతూ కొందరు క్రిమినల్స్ ఎలా చట్టం నుంచి తప్పించుకుంటున్నారనే అంశాన్ని చూపిస్తూ దర్శకుడు శరవణన్ ఈ కథను రాసుకున్నాడు. పోరస్ జీవితానికి సమాంతరంగా మరో రెండు ఉపకథల్ని జోడిస్తూ దర్శకుడు సినిమాను మొదలుపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. మూడు కథల్ని కలుపుతూ ప్రథమార్థాన్ని ముగించారు. 

ద్వితీయార్థాన్ని తన చెల్లెలి చావుకు కారణమైన హంతకుడిని పట్టుకోవడానికి పోరస్ సాగించిన పోరాటంతో నడిపించారు. ఆనవాలు తెలియని హంతకుడికి సంబంధించిన ఆధారాల్ని తన తెలివితేటలతో పోరస్ ఎలా సేకరించాడు? తనకంటే ఎంతో బలవంతుడైన శత్రువును ఎలా పట్టుకున్నాడనేది స్క్రీన్‌ప్లే ప్రధానంగా దర్శకుడు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ కథ, కథనాలు బలీయంగా లేకపోవడం సామాన్యుడు ఆసాంతం నీరసంగా సాగింది.

హీరో, విలన్ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులను పకడ్బందీగా రాసుకున్నప్పుడే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వర్కవుట్ అవుతాయి. ప్రేక్షకుల ఊహలకు అందకుండా సన్నివేశాలను అల్లుకుంటూ స్క్రీన్‌ప్లేతో వారిని ఉత్కంఠకు లోను చేయాలి. కానీ దర్శకుడు శరవణన్ ఆ విషయంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. ప్రథమార్థాన్ని బాగానే నడిపిస్తూ వెళ్లిన ఆయన సెకండ్ హాఫ్‌లో మాత్రం చేతులెత్తేశారు. 

మాస్క్ ధరించిన హంతకుడి ఆనవాళ్లను ఓ సాధారణ పెయింటర్ ఒరిజినల్‌గా చిత్రించడం, తెలివితేటలు ఉండి కూడా హీరో మాటలను పోలీసులు గుడ్డిగా నమ్మడంలాంటి సన్నివేశాలు సినిమాటిక్ గా ఉంటాయి. ఎంతో మందిని పట్టుకొని హీరో చితక్కొట్టి , చాలా ఊర్లు తిరిగి హ్యాకర్ ద్వారా హంతకుడి ఆనవాలును తెలుసుకోవడం కామెడీగా అనిపిస్తుంది. దాంతో అప్పటివరకు నడిచిన కథలో అర్థం లేకుండా పోయింది. కథలో కీలకమైన ఆ ఎపిసోడ్‌ను బాగా రాసుకొని ఉండాల్సింది. హీరో, విలన్ పోరాటంలో తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఎక్కడ కనిపించదు.

వ్యవస్థలోని అన్యాయాల్ని సహించలేని ఆవేశపరుడైన యువకుడిగా విశాల్ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబ క్షేమం, తన లక్ష్యం మధ్య సంఘర్షణకు లోనవుతూ నిరంతరం మదనపడే వ్యక్తిగా అతడి పాత్రను దర్శకుడు చక్కగా డిజైన్ చేశారు. సినిమాలో ఓ కథానాయిక ఉండాలనే ఆలోచనతోనే డింపుల్ హయతిని తీసుకున్నట్లుగా ఉంది. 

కథలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. కమర్షియల్ అంశాల కోసం పెట్టిన హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ మెప్పించలేకపోయింది. యోగిబాబు అరవ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే. విలన్ పాత్రధారిని కేవలం డైలాగ్స్ కే పరిమితం చేశారు.

యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని విశాల్ చేపట్టారు. అతడి గత సినిమాలతో పోలిస్తే చాలా నాసిరకంగా నిర్మాణ విలువలున్నాయి. తనను కాపాడటానికి ఒకడు ఉన్నాడనే భరోసా వల్లే నేరస్తులు పుట్టుకొస్తున్నారంటూ అక్కడక్కడ వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. కానీ కథను నిలబెట్టడానికి అవి సరిపోలేదు.

రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటికే ఈ తరహా కథాంశాలతో తెలుగు,తమిళ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. పాత కథనే తీసుకొని కొత్త హంగులు అద్దుతూ దర్శకుడు శరవణన్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.

రేటింగ్-2.5/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం