Vijayakanth: విజయ్ కాంత్‌కు పద్మభూషణ్ - మరణానంతరం అవార్డులను అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే!
26 January 2024, 12:07 IST
Vijayakanth Padma Bhushan Award: గత ఏడాది డిసెంబర్‌లో కన్నుమూసిన కోలీవుడ్ అగ్ర నటుడు విజయ్ కాంత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. విజయ్ కాంత్‌తో పాటు మరణానంతరం పద్మ అవార్డుకు ఎంపికైన సినీ ప్రముఖులు ఎవరంటే...
విజయ్ కాంత్
Vijayakanth Padma Bhushan Award: గురువారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి సినిమా రంగం నుంచి పలువురు అవార్డులు అందుకున్నారు. మెగా స్టార్ చిరంజీవితో పాటు సీనియర్ నటి వైజయంతీ మాల పద్మ విభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి, సింగర్ ఉషా ఉతప్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్యారేలాల్ శర్మ పద్మభూషణ్ అవార్డులు వరించాయి. వీరితో పాటు విజయ్ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. మరణానంతరం విజయ్ కాంత్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
గత డిసెంబర్‌లో...
విజయ్ కాంత్ గత ఏడాది డిసెంబర్ 28న కన్నుమూశాడు. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలతో పాటు రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటోన్న విజయ్ కాంత్ చెన్నైలో తుది శ్వాస విడిచాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను మరణానంతరం కేంద్ర విజయ్ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. విజయ్ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఖాంత్‌కు ఘన నివాళిగా ఇదంటూ పేర్కొంటున్నారు.
మరణానంతరం పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు ఎవరంటే...
విజయ్ కాంత్ లాగే గతంలో కొందరు సినీ ప్రముఖులను మరణానంతరం పద్మ అవార్డులు వరించాయి. దిగ్గజ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం 2021లో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. బాలు చనిపోయిన ఏడాది తర్వాత అతడిని పద్మవిభూషణ్‌తో కేంద్ర గౌరవించింది.
వాణి జయరాం...
ప్రముఖ సింగర్ వాణి జయరాం 2023లో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైంది. ఆమెకు అవార్డు ప్రకటించి పది రోజులు కూడా గడవకముందే అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. రాజకీయాల్లో ములయాం సింగ్ యాదవ్‌తో పాటు మరికొందరు చనిపోయిన తర్వాత పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
చిరంజీవి, వెంకటేష్...
నలభై ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 200లకుపైగా సినిమాలు చేశాడు విజయ్ కాంత్. ఆయనకు పోలీస్ పాత్రలు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టాయి. విజయ్ కాంత్ తమిళంలో చేసిన పలు సినిమాల్ని తెలుగులోకి చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలు రీమేక్ చేశారు. అంతే కాకుంండా విజయ్ కాంత్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకుల్ని మెప్పించాయి.విజయ్ కాంత్ డబ్బింగ్ మూవీస్‌లో సింధూరపువ్వు, కెప్టెన్ ప్రభాకర్‌తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టాయి.