తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Hari Prasad S HT Telugu

09 May 2024, 20:39 IST

    • Upcoming Telugu Movies: ఆరు తెలుగు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉన్న కరువంతా తీరిపోయేలా ఈ నెల చివర్లో ఈ సినిమాలు రానుండటం విశేషం.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్

Upcoming Telugu Movies: ఎన్నికల వేడిలో కొత్త సినిమాల ఊసే మరచిపోయారు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు. కొంతకాలంగా పెద్దగా పేరున్న సినిమాలేవీ థియేటర్లలోకి రాలేదు. ఇప్పుడు వచ్చే సోమవారం (మే 13) ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీంతో మరోసారి తెలుగు సినిమాల హడావిడి ప్రారంభం కానుంది. మే 31వ తేదీన ఒక్క రోజే ఆరు మూవీస్ రిలీజ్ కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

ఒకే రోజు ఆరు సినిమాలు రిలీజ్

ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికల కారణంగా కల్కి 2898 ఏడీలాంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాయే వాయిదా పడింది. అడపాదడపా ఏవో చిన్న చిన్న సినిమాలు వస్తున్నా బయట ఎండ వేడి, ఎన్నికల వేడి, ఐపీఎల్ కారణంగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే మే 31 నాటికి ఇవన్నీ సైడైపోనున్నాయి. దీంతో ఆ రోజు సినిమాల జాతర ప్రారంభం కానుంది.

మే 31న ఒక్క రోజే తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హరోమ్ హర, సత్యభామ, గం గం గణేషా, మ్యూజిక్ షాప్ మూర్తి, భజే వాయు వేగంలాంటి సినిమాలు రిలీజ్ కానుండటం విశేషం. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే అయినా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై కాస్త బజ్ ఎక్కువగానే ఉంది. విశ్వక్ సేన్ నటించిన సినిమా. అందులోనూ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.

గామి హిట్ తో ఊపు మీదున్న విశ్వక్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఏం మ్యాజిక్ చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. నిజానికి మే 17నే రావాల్సి ఉన్నా.. మే 31కు వాయిదా వేశారు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి ఈ మధ్యే ఓ లిప్ లాక్ పోస్టర్ కూడా రిలీజైన విషయం తెలిసిందే.

కాజల్ సత్యభామ

ఇక ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ నటిస్తున్న మూవీ సత్యభామ. ఈ సినిమా కూడా మే 31నే రిలీజ్ కానుంది. అఖిల్ డేగల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కాజల్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. నవీన్ చంద్ర కూడా ఇందులో నటించాడు. ఇదే కాకుండా సుధీర్ బాబు నటించిన పాన్ ఇండియా మూవీ హరోమ్ హర కూడా ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. మాళవిక శర్మ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. హరోమ్ హర ది రివోల్ట్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా మిగిలిన మూవీస్ పోటీని ఎంత మేరకు తట్టుకుంటుందో చూడాలి.

ఇక మరో ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ గం గం గణేష. బేబీతో మంచి హిట్ కొట్టిన ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు కూడా బజ్ క్రియేటైంది. ఉదయ్ బొమ్మిశెట్టి మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రగతి శ్రీవాస్తవ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ మూవీ కూడా మే 31న రిలీజ్ కానుంది.

కార్తికేయ నటించిన మూవీ భజే వాయు వేగం సినిమా కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఇవే కాకుండా చాందినీ చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి కూడా రానుంది. ఇలా ఒకే రోజు ఆరు సినిమాలు రిలీజ్ కావడం అనేది అరుదైనదే. మరి వీటిలో ఏ మూవీ అయినా ముందుకో, వెనక్కో వెళ్తుందా లేక అదే రోజు బాక్సాఫీస్ పోటీకి సై అంటాయా అన్నది చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం