నేను కన్నడలో ట్వీట్ చేసి ఉంటే.. బాలీవుడ్ హీరోకు కిచ్చా సుదీప్ పంచ్
27 April 2022, 19:37 IST
- సౌత్ సినిమాలు బాలీవుడ్‌కు సవాలు విసరడం అక్కడి హీరోలను డిఫెన్స్‌లో పడేశాయి. కొందరు ఈ సవాలును హుందాగా స్వీకరిస్తుంటే.. మరికొందరు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నడ హీరో కిచ్చా సుదీప్
హిందీ భాష ఇప్పుడు బాలీవుడ్, కన్నడ స్టార్ హీరోల మధ్య ట్విటర్ వార్‌కు కారణమైంది. హిందీ ఇక ఏమాత్రం జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఈ మధ్య ఓ కామెంట్ చేశాడు. ఈ మధ్య సౌత్ సినిమాలు బాలీవుడ్‌ను డామినేట్ చేస్తున్న నేపథ్యంలో అతడు ఈ కామెంట్ చేయడం విశేషం. అయితే ఇది బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌కు నచ్చలేదు. అతడు ట్విటర్ వేదికగా సుదీప్‌కు కౌంటర్ వేశాడు.
కిచ్చా సుదీప్, మై బ్రదర్, నువ్వు చెబుతున్నట్లు హిందీ మన జాతీయ భాష కాకపోతే నీ మాతృభాషకు సంబంధించిన సినిమాలను హిందీలోకి డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? హిందీ జాతీయ భాషగా ఉండేది. ఉంది. ఇక మీదట కూడా ఉంటుంది, జన గణ మన అని అజయ్ దేవ్‌గన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు వరుస ట్వీట్లలో సుదీప్ స్పందించాడు. తొలి రెండు ట్వీట్లను అజయ్‌ను గౌరవిస్తూ మర్యాదగా ట్వీట్ చేసిన అతడు.. మూడో ట్వీట్‌లో మాత్రం అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. "అజయ్ దేవ్‌గన్ సర్.. నేను ఆ మాట అన్న ఉద్దేశం వేరు. కానీ మీకు మరోలా అర్థమైంది. ఈ స్టేట్‌మెంట్‌పై నేను మీకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు వివరంగా చెబుతాను. ఇది ఎవరినీ హర్ట్ చేయడానికి కాదు, చర్చ లేవనెత్తడానికి కూడా కాదు. నేనెందుకు అలా చేస్తాను సర్" అని తొలి ట్వీట్‌లో సుదీప్ అన్నాడు.
ఇక ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. "మన దేశంలోని ప్రతి భాషను ప్రేమిస్తాను, గౌరవిస్తాను సర్. ఈ టాపిక్‌ను ఇక్కడితో ముగిద్దామని అనుకుంటున్నాను. నేను అన్న మాటల వెనుక ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను" అని అన్నాడు. అయితే ఆ తర్వాత చేసిన ట్వీటే అజయ్‌కు మింగుడు పడనిదిగా ఉంది.
"మీరు హిందీలో ట్వీట్ చేసినా నేను అర్థం చేసుకోగలిగాను. దీనికి కారణం మేమంతా హిందీని గౌరవించి, ప్రేమించి నేర్చుకున్నాం కాబట్టి. ఓ మాట చెబుతాను నొచ్చుకోకండి సర్.. ఒకవేళ నేను నా స్పందనను కన్నడలో టైప్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. మేము కూడా ఇండియాకు చెందిన వాళ్లం కాదా సర్" అంటూ సుదీప్ దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు.
టాపిక్