Tollywood | అధిక టికెట్ ధరలపై త్వరలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్…
16 May 2022, 12:40 IST
అధిక సినిమా టికెట్ల ధరల కారణంగా రోజురోజుకు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం నిర్మాతలతో పాటు థియేటర్ వర్గాలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలపై టాలీవుడ్ నిర్మాతలు త్వరలో భేటీ కాబోతున్నట్లు సమాచారం.
థియేటర్
టాలీవుడ్‌లో టికెట్ల ధరల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. అధిక టికెట్ల ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతుండటం ప్రొడ్యూసర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం మొదటి రోజు థియేటర్లు ఖాళీగా దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారుతోంది.
చిరంజీవి, రామ్‌చరణ్ కలయికలో రూపొందిన ఆచార్యతో పాటు ఇటీవల విడుదలైన మహేష్ బాబు సర్కారువారి పాట విషయంలో ఈ సీన్ కనిపించింది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు నాలుగైదు రోజుల వరకు టికెట్లు దొరకడమే కష్టంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలకు తొలి రోజు నుంచి బుకింగ్స్ ఫుల్ కాలేదు. చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ సినిమాలు విడుదలైన పది రోజుల వరకు మల్టీప్లెక్స్ లలో 450, సింగిల్ స్ర్కీన్స్‌లో 250 వరకు టికెట్ రేట్స్ వసూలు చేస్తున్నారు.
లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు ఒకే...
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు టికెట్ల రేట్లతో సంబంధం లేకుండా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం థియేటర్లకు ప్రేక్షకులు వచ్చారు. ఆ సినిమాల్ని ఆదరించారు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో టికెట్ల రేట్లు ఉండటం తో థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సంశయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ టికెట్ల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ త్వరలో సమావేశం కాబోతున్నట్లు తెలిసింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. టికెట్ల ధరలతో పాటు ఓటీటీ కారణంగా థియేటర్లకు ఎదురవుతున్న ముప్పును గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మీటింగ్ కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరుకానున్నట్లు తెలిసింది.
టాపిక్