Bollywood Remake Movies: టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్స్ - బాలీవుడ్‌లో డిజాస్టర్స్ - హిందీ హీరోలకు కలిసిరాని రీమేక్‌లు
02 March 2023, 6:37 IST
Bollywood Remake Movies: తెలుగులో ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి రికార్డులను తిరగరాసిన పలు సినిమాలో హిందీలో రీమేక్ అయ్యాయి. ఆ ఫలితాన్ని మాత్రం రిపీట్ చేయలేకపోయాయి. డిజాస్టర్స్‌గా నిలిచాయి.
షాహిద్ కపూర్
Bollywood Remake Movies: గత కొన్నేళ్లుగా ఇండియన్ సినీ పరిశ్రమలో టాలీవుడ్ డామినేషన్ కొనసాగుతోంది. వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ పరిశ్రమ జోరుమీదున్నది. కలెక్షన్స్, హిట్స్‌లో బాలీవుడ్‌ను బీట్ చేస్తోంది. తెలుగులో విజయవంతమైన పలు సినిమాల్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. తెలుగు లో ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన పలు సినిమాలు హిందీలో రీమేకై డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే…
అల వైకుంఠపురములో - షెహజాదా
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీగా లాభాల్ని మిగిల్చింది.
మ్యూజికల్‌గా హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. షెహజాదా పేరుతో బాలీవుడ్‌లో రీమేకైన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తిక్ ఆర్యన్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 20 కోట్ల షేర్ కూడా కలెక్షన్స్ రాబట్టలేకచతికిలాపడింది.
జెర్సీ
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమా టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తన కొడుకు కోసం 30 దాటిన తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వ్యక్తిగా తన ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ తో అభిమానుల్ని ఫిదా చేశాడు నాని. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన జెర్సీ నిర్మాతలకు రెట్టింపు లాభాలను మిగల్చడమే కాకుండా రెండు జాతీయ అవార్డులను అందుకున్నది.
ఈ సినిమాను అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ను తెరకెక్కించారు. అయినా రిజల్ట్ మాత్రం సేమ్ రాలేదు. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాలీవుడ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నది.
హిట్ ది ఫస్ట్ కేస్
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీని సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌రావ్ పోలీస్ పాత్రలో నటించాడు. టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అడివిశేష్ హీరోగా నటించిన క్షణం చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో భాగీ -2 పేరుతో టైగర్ ష్రాప్ రీమేక్ చేయగా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఇవే కాకుండా నాని ఎమ్‌సీఏ సినిమా కూడా హిందీలో నిఖమ్మా పేరుతో గత ఏడాది హిందీలో రీమేక్ అయ్యింది. సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దసానీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ అతడికి ఈ సినిమా నిరాశనే మిగిల్చింది.