Aha ott | పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ‘సెహరి’... ఆహాలో స్ట్రీమింగ్
19 February 2022, 13:36 IST
హర్ష్ కానుమల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న ఆహాలో విడుదలకాబోతుంది. థియేటర్స్ లో విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
హర్ష్ కానుమల్లి, సిమ్రాన్ చౌదరి
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ థియేటర్స్ కు గట్టిపోటీనిస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీ ల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరిగిపోతుండటంతో థియేటర్స్ లో విడుదలైన వారం, రెండు వారాల గడువులోనే సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. తాజాగా ‘సెహరి’ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిన పదిహేను రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నెల 11న ఈ సినిమా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సరైన ప్రమోషన్స్ లేని కారణంగా పరాజయం పాలైంది. దాంతో రెండు వారాల గడువు కూడా పూర్తవ్వకుండానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. హర్ష్ కానుమల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. బాలకృష్ణ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగం కావడం, పాటలు, ప్రచార చిత్రాలతో ఈ చిన్న సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిల్పాచౌదరి పలువురు సినీ, వ్యాపార ప్రముఖుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగవేయడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోలీస్ కేసు కారణంగా సినిమా ప్రమోషన్స్ సరిగా చేయలేదని వార్తలొచ్చాయి.
హిట్ టాక్ వచ్చినా
భారీ మొత్తాలకు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థలు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాల్ని పక్కనపెట్టి కొద్ది రోజుల్లోనే సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా థియేటర్స్ లో ఆడుతుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకున్న మలయాళ చిత్రం ‘హృదయం’ నెల రోజులు కాకముందే డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది.