తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Review: సైంధ‌వ్ రివ్యూ - వెంక‌టేష్ సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచాడా? లేదా?

Saindhav Review: సైంధ‌వ్ రివ్యూ - వెంక‌టేష్ సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచాడా? లేదా?

13 January 2024, 13:18 IST

google News
  • Saindhav Review: వెంక‌టేష్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సైంధ‌వ్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న (శ‌నివారం) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?

 వెంక‌టేష్   సైంధ‌వ్ మూవీ
వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ

వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ

Saindhav Review: వెంక‌టేష్ అంటే ఫ్యామిలీ సినిమాలే ఎక్కువ‌గా గుర్తొస్తాయి. కుటుంబ ప్రేక్ష‌కుల ప‌ల్స్‌కు త‌గ్గ క‌థ‌ల‌నే ఎంచుకుంటూ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్నాడు వెంక‌టేష్‌. సైంధ‌వ్‌తో త‌న రూట్ మార్చిన వెంక‌టేష్ యాక్ష‌న్ బాట ప‌ట్టాడు. సంక్రాంతి కానుక‌గా శ‌నివారం (జ‌న‌వ‌రి 13న )రిలీజైన సైంధవ్ మూవీకి హిట్‌, హిట్ 2 సినిమాల ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌, ఆండ్రియా హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ విల‌న్ పాత్ర పోషించాడు. సైంధ‌వ్ తో వెంక‌టేష్ ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? సంక్రాంతికి విన్న‌ర్‌గా నిలిచాడా? శైలేష్ కొల‌ను అత‌డికి స‌క్సెస్‌ను అందించాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

సైకో క‌థ‌...

సైకో అలియాస్ సైంధ‌వ్ (వెంక‌టేష్‌) చంద్ర‌ప్ర‌స్థ పోర్టులో ఉద్యోగిగా ప‌నిచేస్తుంటాడు. కూతురు గాయ‌త్రి అంటే ప్రాణం. త‌ల్లి లేని త‌న‌ను అల్లారుముద్దుగా చూసుకుంటాడు. స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోపి అనే అరుదైన వ్యాధి బారిన ప‌డుతుంది గాయ‌త్రి. ఆమెను కాపాడ‌టానికి 17 కోట్ల ఖ‌రీదైన ఓ ఇంజెక్ష‌న్ అవసరమవుతుంది. ఆ ఇంజెక్ష‌న్ కోసం కార్ట‌ల్ అనే మాఫియా గ్యాంగ్‌తో పోరాటానికి సైంధవ్ సిద్ధ‌మ‌వుతాడు.

ఆ గ్యాంగ్‌లోని మిత్ర (ముకేష్ రిషి) వికాస్ మాలిక్‌(న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ)ల‌ను చంప‌డానికి డీల్ కుద్చుకుంటాడు. సైంధ‌వ్‌కు ఆ డీల్ అప్ప‌గించిన మైఖేల్ (జిషుసేన్ గుప్తా) ఎవ‌రు? సైకో పేరు విన‌గానే వాళ్లంతా ఎందుకు భ‌య‌ప‌డ్డారు? చంద్ర‌ప్ర‌స్థ‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి వికాస్ మాలిక్‌, మిత్రా ఏం ప్లాన్ చేశారు? కార్ట‌ల్ గ్యాంగ్‌లో వికాస్ మాలిక్‌, మిత్రా ల‌తో క‌లిసి ప‌నిచేసిన సైంధ‌వ్ వారినే చంపాల‌ని ఎందుకు అన్నాడు?

ఆ నేర సామ్రాజ్యం నుంచి సైంధ‌వ్‌ బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఏమిటి? భ‌ర్త నుంచి దూర‌మైన మ‌నోజ్ఞ (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) సైంధ‌వ్ ద‌గ్గ‌ర‌కు ఎందుకొచ్చింది? సైంధ‌వ్ పోరాటంలో మాన‌స్‌(ఆర్య‌) జాస్మిన్ (ఆండ్రియా) డాక్ట‌ర్ రేణు(రుహాణి శ‌ర్మ‌) గాయ‌త్రిని సైంధ‌వ్ కాపాడుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఫిక్ష‌న‌ల్ వర‌ల్డ్‌...

తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు శేల‌ష్ కొల‌ను సైంధ‌వ్ క‌థ రాసుకున్నారు. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌, స్టైలిష్ మేకింగ్‌తో ఆడియెన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా సినిమా ఉండాల‌ని భావించారు. చంద్ర‌ప్ర‌స్థ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌... త‌మ అక్ర‌మాల‌కు పిల్ల‌ల‌ను పావులుగా వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నించే డేంజ‌ర‌స్‌ గ్యాంగ్‌...వారిని ఎదురించే ఓ స‌గ‌టు తండ్రి ...అత‌డికో ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్ స్టోరీలైన్‌ను తీసుకొని వెంక‌టేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎలివేష‌న్స్ పాస్ మార్కులు కొట్టేయాల‌ని చూశారు.

ఈ యాక్ష‌న్ స్టోరీకి న‌డిపించే డ్రైవ్ ఫోర్స్‌ గా తండ్రీకూతుళ్ల ఎమోష‌న్ ఉప‌యోగ‌ప‌డింది. స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ ఆట్రోపి అనే వ్యాధి...ప‌దిహేడు కోట్ల ఇంజెక్ష‌న్ అనే పాయింట్‌ను డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న సీన్స్ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌ను కూడా డిఫ‌రెంట్‌గా రాసుకోవ‌డానికి ఆ సిండ్రోమ్‌ను చక్కగా వాడుకున్నాడు. వాటిలో ఎమోష‌న్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జైల‌ర్ నుంచి యానిమ‌ల్ వ‌ర‌కు...

ఫ్యామిలీ క‌థ‌లు అంటే ఇదివ‌ర‌కు సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ సెన్సిటివ్ స్టోరీస్‌ను ఎంత ఇంటెన్స్‌గా చెబితే అంత పెద్ద హిట్ అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, విక్ర‌మ్...నుంచి ఇటీవ‌ల విడుద‌లైన బాలీవుడ్ హిట్ మూవీ యానిమ‌ల్ వ‌ర‌కు అన్నింటిలో ఫ్యామిలీ ఎమోష‌న్స్ మెయిన్ స్టోరీలైన్‌.

హై వోల్టేజ్ యాక్ష‌న్ అంశాల‌తో ఈ కథలను ఆయా ద‌ర్శ‌కులు స్క్రీన్‌పై డిఫ‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేశారు. సైంధ‌వ్‌తో శైలేష్ కొల‌ను అదే రూట్‌ను ఫాలో అయ్యాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో హింస డోసు కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. సైకో అనే పేరుతోనే హీరో పాత్ర‌కు ఎలాంటి లిమిటేష‌న్స్ ఉండవని చూపించారు. యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ రెండింటిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాను న‌డిపించాడు.

ఫ‌స్ట్ హాఫ్ సైంధ‌వ్ గాయ‌త్రి క‌థ‌తో పాటు... కార్ట‌ల్ బృందం డ్ర‌గ్స్, గ‌న్స్ బిజినెస్‌తో సాగుతుంది. సైంధ‌వ్ ద‌గ్గ‌ర ఉన్న కంటైన‌ర్స్ కోసం వికాస్ మాలిక్ వేసే ఎత్తులు...అత‌డిని ఎదురించ‌డానికి సైంధ‌వ్ చేసే పోరాటం చుట్టూ సెకండాఫ్ సాగుతుంది.

అన్ని జోన‌ర్స్‌లో...

సాదాసీదా లైఫ్‌ను లీడ్ చేసే హీరోకు ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉండ‌టం అనే పాయింట్‌ను. ఫ్యాక్ష‌న్‌, మాఫియా, గ్యాంగ్‌స్ట‌ర్స్ అన్ని జోన‌ర్స్‌లో వాడేశారు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌. ఆ పాయింట్‌ను తీసుకొని కొత్త క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో శైలేష్ కొల‌ను ఈ క‌థ రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్‌ ష్లాఫ్‌బ్యాక్‌..అత‌డికి స‌పోర్ట్‌గా నిలిచే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌... ధీటైన‌ విల‌న్స్...అన్ని ఉన్నా సినిమాలో ఏదో మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ మ‌ధ్య కొన్ని సార్లు క‌నెక్టివిటీ కనిపించదు.సైకో నుంచి వెంక‌టేష్ సైంధ‌వ్‌గా సాదాసీదా ఫ్యామిలీ మ్యాన్‌గా ఎందుకు మారాడ‌న్న‌ది స‌రిగా చూపించ‌లేదు. ఆర్య‌, రుహాణిశ‌ర్మ‌, ఆండ్రియాతో పాటు చాలా మంది ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు ఉన్నా వారి టాలెంట్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేద‌నిపిస్తుంది. పాన్ ఇండియా మార్కెటింగ్ కోస‌మే క్యారెక్ట‌ర్స్ క్రియేట్ చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

సైకోగా వెంక‌టేష్‌...

సైంధ‌వ్ అలియాస్ సైకో పాత్ర‌లో వెంక‌టేష్ చెల‌రేగిపోయాడు. త‌న‌లోని మాస్ కోణాన్ని పీక్స్‌లో చూపించాడు. డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో వెంకీ న‌ట‌న గురించి ప్రత్యేకంగా చెప్పిది ఏం లేదు. న‌వాజుద్దీన్ విల‌నిజం కొత్త‌గా అనిపిస్తుంది. తెలుగు, హిందీ మిక్స్ చేస్తూ డిఫ‌రెంట్‌గా అతడి క్యారెక్ట‌ర్‌ను స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్టర్. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ త‌మ ప‌రిధుల మేర మెప్పించారు. జాస్మిన్‌గా ఆండ్రియా క్యారెక్ట‌ర్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆర్య‌ది అతిథి పాత్రే. కేవ‌లం త‌మిళంలో మార్కేట్ కోస‌మే అత‌డిని తీసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది.

డిఫ‌రెంట్ వెంకీ...

సైంధ‌వ్ వెంక‌టేష్ నుంచి వ‌చ్చిన మ‌రో డిఫ‌రెంట్ యాక్ష‌న్ మూవీ. వెంకీ యాక్టింగ్‌, యాక్ష‌న్ కోసం ఈ సినిమా చూడొచ్చు. గుంటూరు కారం ఫ‌స్ట్‌డేనే బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డ‌టం సైంధ‌వ్‌కు ప్ల‌స‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

రేటింగ్ :3/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం