Saindhav OTT Release: ఓటీటీలోకి సైంధవ్.. ముందుగానే వచ్చేస్తున్నాడు!
29 January 2024, 10:15 IST
- Saindhav OTT Release: విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీ ఊహించినదాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది.
సైంధవ్ మూవీలో వెంకటేశ్
Saindhav OTT Release: భారీ ఆశలు, అంచనాల మధ్య సంక్రాంతికి రిలీజైన వెంకటేశ్ మూవీ సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
దాదాపు థియేటర్లలో నుంచి తప్పుకున్న ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న వస్తుందని భావించినా.. ఇప్పుడు ఫిబ్రవరి 2నే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
సైంధవ్ ఓటీటీ
వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ భారీ అంచనాల మధ్య రిలీజైంది. హిట్, హిట్ 2లాంటి సినిమాలు అందించిన శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేక నష్టాలనే మిగిల్చింది.
సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాలు మంచి వసూళ్లే సాధించినా.. సైంధవ్ మాత్రం నిరాశ పరిచింది. పండగ మూడ్ ను అర్థం చేసుకోలేక యాక్షన్ జానర్ లో వచ్చి ఈ సినిమా బోల్తా పడింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే థియేటర్లలో ఇప్పటికీ సైంధవ్ పని అయిపోవడంతో థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 2నే ఓటీటీలోకి తీసుకురావాలని ప్రైమ్ వీడియో భావిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. ఈ సైంధవ్ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, ముకేశ్ రిషి, బేబీ సారా, రుహానీ శర్మలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
సైంధవ్ కథేంటంటే?
తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు శేలష్ కొలను సైంధవ్ కథ రాసుకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్, స్టైలిష్ మేకింగ్‌తో ఆడియెన్స్‌కు విజువల్ ట్రీట్‌లా సినిమా ఉండాలని భావించారు. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ వరల్డ్... తమ అక్రమాలకు పిల్లలను పావులుగా వాడుకోవాలని ప్రయత్నించే డేంజరస్ గ్యాంగ్...వారిని ఎదురించే ఓ సగటు తండ్రి ...అతడికో పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్ స్టోరీలైన్‌ను తీసుకొని వెంకటేష్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ పాస్ మార్కులు కొట్టేయాలని చూశారు.
సైంధవ్ అలియాస్ సైకో పాత్రలో వెంకటేష్ చెలరేగిపోయాడు. తనలోని మాస్ కోణాన్ని పీక్స్‌లో చూపించాడు. డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో వెంకీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పిది ఏం లేదు. నవాజుద్దీన్ విలనిజం కొత్తగా అనిపిస్తుంది. తెలుగు, హిందీ మిక్స్ చేస్తూ డిఫరెంట్‌గా అతడి క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్.