RRR |ఆర్ఆర్ఆర్ బ్రిడ్జ్ సీన్ మేకింగ్ వీడియో చూశారా...
30 May 2022, 12:44 IST
- ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా పలు సినీ రికార్డులను బద్దలుకొట్టింది. పదకొండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సన్నివేశాల్లో బ్రిడ్జ్ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఈ సీన్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ సోమవారం అభిమానులతో పంచుకున్నది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుతాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం భాషాభేదాలతో సంబంధం లేకుండా సినీ అభిమానులందరిని ఆకట్టుకున్నది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 1100 కోట్లకుపైగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య స్నేహబంధానికి వారధిగా నిలిచిన బ్రిడ్జ్ యాక్షన్ సీక్వెన్స్ ను ఇంటెన్స్‌గా రాజమౌళి తెరకెక్కించారు. బ్రిడ్జ్ పై నుంచి మంటలతో ట్రైన్ నీళ్లలో పడటంతో బాలుడి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
అతడికి రక్షించడం కోసం ఎన్టీఆర్, తారక్ ప్రాణాలకు తెగించి సాహోసేపతంగా జంప్ చేసే సీన్ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించింది. సోమవారం ఈ సీన్ తాలూకు మేకింగ్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులతో పంచుకున్నది. ఈ సీన్ కోసం తొలుత అమెరికాలోని వర్జీనియాలో ఎనిమిది ఓల్డ్ ట్రైన్ మినియేచర్స్ రూపొందించారు. వాటిని ఇండియాకు షిప్పింగ్ చేసి హైదరాబాద్‌లో ట్రయల్ షూట్ చేశారు. రాజమండ్రి బ్రిడ్జిని మోడల్‌గా తీసుకొని కొపెన్‌హెగన్‌లో ఈ సీన్ ను గ్రాఫిక్స్ లో కొన్ని నెలలు కష్టపడి రీక్రియేట్ చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ సీన్ కోసం టీమ్ పడిన కష్టమేమిటో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.