Mammootty Rorschach Movie Review: రోర్‌షాచ్ మూవీ రివ్యూ - మమ్ముట్టి కొత్త ప్రయోగం
13 November 2022, 10:09 IST
Mammootty Rorschach Movie Review: మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన రోర్‌షాచ్ సినిమా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
రోర్‌షాచ్
Mammootty Rorschach Movie Review: మలయాళ చిత్రసీమలో ప్రయోగాలకు పెట్టింది పేరు మమ్ముట్టి. రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి తాపత్రయపడుతుంటారు. మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన మలయాళ చిత్రం రోర్‌షాచ్. నిసామ్ బషీర్ దర్శకత్వం వహించాడు. నవంబర్ మొదటివారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. ఇటీవల ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా కథేమిటంటే...
ఎన్ఆర్ఐ కథ
ల్యూక్ ఆంటోనీ (మమ్ముట్టి) దుబాయ్‌లో వ్యాపారవేత్త. ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య సోఫియాతో కలిసి కేరళకు విహారయాత్రకు వస్తాడు. అడవిలో ప్రయాణిస్తోన్న సమయంలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతోంది. ఆ ప్రమాదంలో సోఫియా కనిపించకుండా పోవడంతో ల్యూక్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు.
పోలీసులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకదు. ల్యూక్ మాత్రం తన భార్య దొరికే వరకు ఆ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊరిలోనే బాలన్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని కొంటాడు ల్యూక్. ఆ ఇళ్లు బాలన్ కొడుకు దిలీప్‌ది. అతడు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కానీ దిలీప్ ఆత్మ మాత్రం ఆ ఇంటిలోనే ఉందని ఆ ఊరివాళ్లు నమ్ముతుంటారు.
ల్యూక్ వచ్చిన తర్వాత ఊరిలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. బాలన్ చనిపోతాడు. మరోవైపు కష్టాల్లో ఉన్న దిలీప్ భార్య సుజాతకు అండగా నిలిచిన ల్యూక్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లైన తొలిరోజు నుంచే ఆమెను హింసించడం మొదలుపెడతాడు.
అసలు ల్యూక్ ఎవరు? అతడు ఆ ఊరికి ఎందుకు వచ్చాడు. నిజంగానే అతడి భార్య సోఫియా చనిపోయిందా? బాలన్ కుటుంబంతో ల్యూక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దిలీప్ భార్య సుజాతను అతడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? చనిపోయిన దిలీప్ ...ల్యూక్‌కు మాత్రమే ఎందుకు కనిపించాడన్నదే ఈ సినిమా మిగతా కథ.
హీరోలు ఉండరు...
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఇప్పటివరకు ఎవర్ టచ్ చేయని కొత్త పాయింట్‌తో రోర్‌షాచ్ సినిమా తెరకెక్కింది. కమర్షియల్ పడికట్టు సూత్రాలకు పూర్తి భిన్నంగా రోర్‌షాచ్ సాగుతుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోహీరోయిన్లు ఎవరూ ఉండరు.పరిస్థితులు మనషుల్ని ఎలా మార్చుతాయి, తమ ఉనికికి ప్రమాదం ఎర్పడినప్పుడు మనుషులు స్వార్థంతో ఎలా ఆలోచిస్తారో ప్రతి క్యారెక్టర్ ద్వారా ఆలోచనాత్మకంగా చూపించారు దర్శకుడు.
మనిషిల్లో ఉండే ప్రేమ, కోపం, ప్రతీకారం, నమ్మకద్రోహం లాంటి అంశాలను ఇందులోని క్యారెక్టర్స్ ద్వారా ఆవిష్కరించారు. మనిషి బాహ్య రూపాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేమని చూపించారు. అంతరంగాల్లో ఎవరికి తెలియని చీకటి కోణం ఉందని చెప్పారు.
రివేంజ్ స్టోరీ...
కథగా చెప్పుకుంటే రోర్‌షాచ్ ఒక రివేంజ్ స్టోరీ. కానీ దర్శకుడు దానిని తెరపై ఆవిష్కరించిన విధానం మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ప్రాణం తీయడం మాత్రమే కాదు అతడి పేరు ప్రతిష్టల్ని, జ్ఞాపకాల్ని, అనుబంధాల్ని పూర్తిగా నాశనం చేయడమని చూపించారు.
స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రజెంట్ తో పాటు ఫ్లాష్‌బ్యాక్‌ను ఒకేసారి చూపిస్తూ డైరెక్టర్ మ్యాజిక్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎవరు విలనో, ఎవరు హీరోనో అంచనా వేయలేము. రోర్‌షాచ్ కథలోని మలుపులు రివీల్ కాకుండా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్.
మమ్ముట్టి వన్ మెన్ షో..
ల్యూక్ ఆంటోనీ పాత్రకు మమ్ముట్టి వందశాతం న్యాయం చేశాడు. తాను తప్ప మరెవరూ ఈ క్యారెక్టర్ చేయలేరు అన్నంతగా ఒదిగిపోయాడు. నెగెటివ్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌కు తన నటనతో ప్రాణంపోశారు. అతడి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటాయి. సీత పాత్రలో బిందు ఫణిక్కర్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మమ్ముట్టిని డామినేట్ చేసింది. జగదీష్, గ్రేస్ ఆంటోనీ యాక్టింగ్ బాగుంది. టెక్నికల్‌గా నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, మిధున్ ముకుందన్ మ్యూజిక్ సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి. సినిమా మొత్తం డార్క్ లైటింగ్‌తో తెరకెక్కించారు.
డిఫరెంట్ మూవీ...
కొత్తదనంతో కోరుకునే వారికి రోర్‌షాచ్ తప్పకుండా నచ్చుతుంది. మమ్ముట్టి యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ 2.75/5