rocketry the nambi effect review: రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ రివ్యూ …నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే...
01 July 2022, 16:52 IST
ప్రేమకథా చిత్రాలతో దక్షిణాదిన లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు మాధవన్. హీరోగా కెరీర్ ముగిసిపోవడంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా ప్రతిభను చాటుకుంటున్నారు. మాధవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్స్. ఈ సినిమా ఎలా ఉందంటే...
రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్స్
భారత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్న సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. మాధవన్ హీరోగా నటిస్తూ తొలిసారి మెగాఫోన్ పట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళం, హిందీతో పాటు తెలుగుభాషల్లో నేడు ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఫ్యామిలీ డ్రామా
నంబి నారాయణన్ పై అభియోగాలు రావడం, నిర్ధోషిగా నిరూపితం కావడం లాంటి సంఘటనలు అందరికి తెలిసిందే. కానీ ఈ నిరాధారమైన ఆరోపణల కారణంగా వ్యక్తిగతంగా నంబి నారాయణన్ ఎదుర్కొన్న మానసిక క్షోభను, అతడి ఫ్యామిలీ ఎదుర్కొన్నఅవమానాలను ఆవిష్కరిస్తూ ఎమోషనల్ డ్రామాగా మాధవన్ ఈ సినిమాను రూపొందించారు.
నంబి అరెస్ట్ తో కథ మొదలు...
నంబి నారాయణన్ అరెస్ట్ అయ్యే సీన్ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన జీవితాన్ని గురించి నంబి వెల్లడించడానికి సిద్ధమవ్వడం... ఫ్లాష్ బ్యాక్ రూపంలో అతడి జీవితంలోని ఒక్కో సంఘటనను వివరిస్తూ కథ ముందుకు సాగుతుంది. భారత అంతరిక్ష పరిశోధనలను అభివృద్ధి చేయాలనే తపనతో నంబి నారాయణన్ విదేశాలకు వెళ్లడం, తనకు ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. నాసాలో ఉద్యోగం వచ్చినా దేశంపై ప్రేమతో భారత్ కు తిరిగి రావడం లాంటి సన్నివేశాలను రాసుకున్న విధానం బాగుంది.
దేశద్రోహిగా
నంబిని దేశద్రోహిగా పేర్కొంటూ కేరళ పోలీసులు అరెస్ట్ చేయడంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఆరోపణలు రుజువు కాకపోయినా పోలీసులు అతడిని ఎలాంటి చిత్ర హింసలకు గురిచేశారన్నది హృద్యంగా సినిమాలో చూపించారు. చేయని తప్పుకు తనతో పాటు నంబితో పాటు అతడి కుటుంబం ఎదుర్కొన్న మానసిక క్షోభను చూపించిన విధానం కదిలిస్తుంది. అసలైన దోషి ఎవరో తెలేవరకు తన పోరాటం ఆపేది లేదంటూ నంబి నారాయణన్ భావోద్వేగభరితంగా చెప్పే డైలాగ్ తో సినిమాను ముగించిన విధానం ఆకట్టుకుంటుంది.
సైంటిఫిక్ పదాలు ఎక్కువే..
ప్రథమార్థం పూర్తిగా అంతరిక్ష పరిశోధన తాలూకు సైంటిఫిక్ అంశాలతో ముడిపడి సాగుతుంది. ఆ సన్నివేశాల్లో ఉపయోగించే పదాలు సగటు ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. అంతరిక్ష పరిశోధన కోసం విదేశాలకు వెళ్లే సన్నివేశాలన్నీ నిదానంగా సాగుతాయి. పేరుప్రఖ్యాతులు, గౌరవం, హోదా కోల్పోయి ఓ ఖైదీగా నంబి ఎదుర్కొనే సంఘర్షణ ను ద్వితీయార్థంలో ఎమోషనల్ గా చూపించారు మాధవన్.
నంబి పాత్రలో జీవించాడు..
నంబి నారయణన్ పాత్రలో మాధవన్ జీవించాడు. నంబి ఆహార్యం, బాడీలాంగ్వేజ్ అన్నింటిపై పరిశోధన చేసి మాధవన్ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు. యువకుడిగా, వృద్ధుడిగా రెండు క్యారెక్టర్స్ తగినట్లుగా తన లుక్ మార్చుకొని కష్టపడి నటించాడు. నటుడిగా సక్సెస్ అయినా దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు మాధవన్. ఇదే తొలి సినిమా కావడంతో చాలా చోట్ల తడబడిపోయాడు. ఇటు కమర్షియల్ అటు డాక్యుమెంటరీ మాదరిగా కాకుండా మధ్యస్థంగా ఈ సినిమా ఆగిపోయిన అనుభూతి కలుగుతుంది. నంబిపై ఆరోపణలు చేసింది ఎవరు? అతడు అరెస్ట్ వెనకున్న కారణాల్ని పూర్తిగా చూపించలేకపోయారు. డబ్బింగ్ సినిమా అయినా డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నంబి నారాయణన్ భార్యగా సిమ్రాన్, అబ్దుల్ కలాం పాత్రలో గుల్షన్ గ్రోవర్ చక్కటి నటనను కనబరిచారు. నంబి నారాయణన్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా అతిథి పాత్రలో సూర్య కనిపిస్తారు.
నిజాయితీతో కూడిన ప్రయత్నం
రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్స్ నిజాయితీతో కూడిన మంచి సినిమా. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కావడం మాత్రం కష్టమే..
రేటింగ్: 3 /5
టాపిక్