Rekha Relationship : సెక్రటరీతో రేఖ రిలేషన్ షిప్.. భర్త ఆత్మహత్యకు కారణం ఇదేనా?
22 July 2023, 13:02 IST
- Rekha Live In Relationship : దక్షిణాదిలోనూ ఓ వెలుగు వెలిగింది రేఖ. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి.. అక్కడే సెటిల్ అయింది. ఆమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. తాజాగా ఓ విషయం వైరల్ అవుతోంది.
నటి రేఖ
బాలీవుడ్ నటి రేఖ(Actress Rekha) జీవితంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. అయితే ఆమె తన మహిళా సెక్రటరీతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందన్న నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. అంతే కాదు రేఖ భర్త ఆత్మహత్యకు కూడా ఇదే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రేఖ చుట్టూ ప్రేమ కథలు
రేఖ అంటే ఒకప్పుడు అబ్బాయిల గుండెల్లో దేవత. ఆమె పేరు వింటేనే అప్పట్లో కుర్రాళ్లకు గండె చప్పుడు పెరిగేది. ఆమెను అందాల దేవతలాగా ఆరాదించేవారు. ఇప్పుడు కూడా ఆమెను అందాల భామగా ఆరాధించే వారు ఉన్నారు. ఈ బాలీవుడ్(Bollywood) నటి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిగా వెలుగొందిన ఈ నటి.. చాలా మంది నటులతో రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు రేఖ సుమారు డెబ్బై ఏళ్లకు దగ్గరలో ఉంది.
మహిళా సెక్రటరీతో రిలేషన్
తాజాగా రేఖ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి. రేఖ తన మహిళా సెక్రటరీతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందనే విషయం ఇప్పుడు సర్వత్రా వ్యాపించింది. దానికి కారణం రేఖ జీవిత చరిత్ర. రచయిత యాజీర్ ఉస్మాన్ రేఖ జీవితంపై ఓ పుస్తకం తీసుకొచ్చాడు. ఇప్పుడు రేఖ జీవితంలోని పేజీలను అందరికీ తెలిసేలా చేశాడు. యాజీర్ ఉస్మాన్ 'రేఖా ది అన్‌టోల్డ్ స్టోరీ'(Rekha The Untold Story) ద్వారా ఇప్పటి వరకు రహస్యంగా ఉన్న ఓ విషయాన్ని బయటపెట్టాడు. రేఖ చెప్పని కథను చదవడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెక్రటరీ చెప్పినట్టుగానే వినేది
రేఖ సెక్రటరీ పేరు ఫర్జానా. రేఖ జీవిత కథను రాసిన యాజీర్ ప్రకారం.. రేఖ తన మహిళా సెక్రటరీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. రేఖ పడకగదిలోకి ప్రవేశం ఉన్న ఏకైక వ్యక్తి ఫర్జానా(Farzana). దాదాపు మూడు దశాబ్దాల పాటు వారిద్దరి మధ్య అనుబంధం ఉంది. బాలీవుడ్‌లో చాలా మందికి తెలిసిన మరో విషయం ఏమిటంటే రేఖకు ఫర్జానాపై చాలా నమ్మకం. అయితే రేఖ కూడా ఫర్జానా ఏదీ చేబితే అదే వినేది. అడుగు ముందుకు వేయాలంటే.. ఫర్జానా చెబితేనే వేసేదని చాలా మంది చెబుతారు.
ముఖేష్ అగార్వాల్ తో పెళ్లి
యాజీర్ రాసిన రేఖ అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకంలోని మరో ఆసక్తికరమైన అంశం రేఖ భర్త కథ గురించి. రేఖను ముఖేష్ అగర్వాల్ వివాహం చేసుకున్నాడు. నిజానికి పెళ్లైనా.. అమితాబ్ బచ్చన్(amitabh bachchan)తో ప్రేమాయాణం సాగించింది రేఖ. కానీ జయా బచ్చన్ కాస్త సీరియస్ అయ్యేసరికి సైడ్ అయిపోయింది. తర్వాత రేఖ హఠాత్తుగా ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌ను రేఖ 1990లో వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ పెళ్లి గురించి చాలా చర్చలు జరిగాయి.
ఎందుకంటే హఠాత్తుగా రేఖ జీవితంలోకి ముఖేష్ వచ్చి అడుగుపెట్టాడు. మహా అయితే.. నాలుగైదు సార్లు వీళ్లు కలుసుకున్నారంతే.. తర్వాత పెళ్లి చేసుకున్నారు. అగర్వాల్ తో తన పెళ్లి గురించి అడిగినప్పుడు రేఖ గతంలో విచిత్రమైన ఆన్సర్ ఇచ్చింది. 'నా కెరీర్‌లో నేను బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఎక్కడ కలిశాం, ఎప్పుడు కలిశాం, ఎలా కలిశాం అన్నది ముఖ్యం కాదు. మేము కలిశాం. మేం పెళ్లి చేసుకున్నాం అన్నది ముఖ్యం. ఈ వివాహం నుంచి నేను ఏమి నేర్చుకున్నాను, ఏం కోల్పోయానో తెలుసుకోవడం ముఖ్యం.' అని కామెంట్స్ చేసింది.
రేఖ భర్త ఆత్మహత్య
అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. పెళ్లైన ఏడాదిలోపే.. రేఖ భర్త ముఖేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం, వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యల కారణంగా అతను ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాడని అంటుంటారు.
కానీ ఈ పుస్తకంలో యాజీర్ పరోక్షంగా ఏం చెప్పాడంటే.. రేఖకు ఆమె సెక్రటరీతో ఉన్న సంబంధమే ముఖేష్ మరణానికి ప్రధాన కారణం. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అయితే రేఖ మాత్రం.. ఫర్జానాను సొంత సొదరిలా భావిస్తానని చెప్పేది.