Ravi Teja: ఆ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం.. మూడు డిఫరెంట్.. రవితేజ కామెంట్స్ వైరల్
12 February 2024, 9:36 IST
Ravi Teja About Mister Bachchan In Eagle Success Meet: ఫిబ్రవరి 9న మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. సినిమాకు మంచి టాక్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగానే కలెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఆ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం.. మూడు డిఫరెంట్.. రవితేజ కామెంట్స్ వైరల్
Ravi Teja Comments In Eagle Success Meet: మాస్ మహారాజా రవితేజ, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కెమెరామెన్‌గా పాపులర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు పలు పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈగల్ మూవీ మంచి సక్సెస్ అందుకున్న సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
పబ్లిక్ బ్లాక్ బస్టర్ ఈగల్ సక్సెస్ మీట్‌లో మాస్ మహారాజా రవితేజ తన తర్వాతి సినిమాతో పాటు ఈగల్ మూవీ గురించి కామెంట్స్ చేశాడు. "ఈగల్ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌కు చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర మేకోవర్‌కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్‌కి చాలా ఎగ్జయిట్ అయ్యాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్‌తో వచ్చే మిస్టర్ బచ్చన్‌తో హ్యాట్రిక్ కొడుతున్నాం" అని రవితేజ తెలిపాడు.
అంటే, ఇదివరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రవితేజ హీరోగా చేసిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈగల్ మూవీ కూడా ఇదే కాంబినేషన్‌లో వచ్చి సక్సెస్ అయింది. త్వరలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనే రవితేజ చేస్తున్న మరో మూవీ మిస్టర్ బచ్చన్. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్న రవితేజ హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు.
ఇక ఈగల్ సక్సెస్ మీట్‌లో స్పీచ్ కొనసాగించిన రవితేజ "డేవ్ జాండ్ సౌండ్ ఇరగదీశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. అలాగే మణి చాలా పవర్ ఫుల్ మాటలు రాశాడు. తన పద ప్రయోగం చాలా బావుంది. కావ్య థాపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను. ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి" అని చెప్పాడు.
"కార్తిక్ అద్భుతమైన విజన్ కలిగిన దర్శకుడు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశాడు. తను టాప్ డైరెక్టర్ అవుతాడు. అనుపమ, అజయ్ ఘోష్, వినయ్ రాయ్ అందరూ తమ పాత్రలని పర్‌ఫెక్ట్‌గా చేశారు. సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు" అని రవితేజ చెప్పుకొచ్చాడు. "రవితేజ గారితో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు ఈగల్‌తో బ్లాక్ బస్టర్‌ని కొనసాగించాం. చాలా ఆనందంగా ఉంది. కార్తీక్‌తో మరిన్ని చిత్రాలు చేయబోతున్నాం. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు" అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
"ఈగల్ అద్భుతమైన చిత్రం. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి పాయింట్‌ని ఇంత స్టయిల్‌గా తీయడం కార్తీక్‌కే సాధ్యపడింది. డేవ్ జాండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ధమాకా, ఈగల్, ప్రస్తుతం నేను చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' ఇలా మూడు డిఫరెంట్ సినిమాలు రవితేజ గారికి అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. కార్తీక్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా సినిమా తీశాడు'' అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు.