Rakshana Review: రక్షణ రివ్యూ - పాయల్ రాజ్‌పుత్, బ్రహ్మముడి మానస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
07 June 2024, 17:56 IST
Rakshana Review: పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన రక్షణ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రణదీప్ ఠాకూర్ దర్శకనిర్మాతగా వ్యవహరించాడు.
రక్షణ రివ్యూ
Rakshana Review: ఆర్ఎక్స్ 100తో పాటు తెలుగులో పలు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా తొలిసారి పోలీస్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటించిన మూవీ రక్షణ. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సినిమా ఎలా ఉందంటే?
కిరణ్ ఇన్వేస్టిగేషన్…
కిరణ్ (పాయల్ రాజ్‌పుత్) ఓ ఐపీఎస్ ఆఫీసర్. కిరణ్ ట్రైనింగ్‌లో ఉండగా ఆమె కళ్లముందే ప్రియా అనే స్నేహితురాలు బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోతుంది. తన స్నేహితురాలు మరణం వెనుక ఎవరో అజ్ఞాత వ్యక్తి ఉన్నాడని కిరణ్ అనుమానం వ్యక్తంచేస్తుంది. కానీ కిరణ్ మాటలను పోలీసులు పట్టించుకోరు. ఏసీపీగా ఉద్యోగంలో చేరిన తర్వాత తన స్నేహితురాలి ఆత్మహత్య వెనకున్న కారణాల్ని శోధిస్తుంది కిరణ్. కానీ ఆమెకు ఒక్క ఆధారం దొరకదు. ప్రియా సూసైడ్‌ను పోలిన విధంగానే సిటీలో చాలా మంది అమ్మాయిలు చనిపోతుంటారు.
ఉన్నత చదువులు, మంచి ఉద్యోగంతో లైఫ్‌లో సక్సెస్ అయిన అమ్మాయిలే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కిరణ్ ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. వీరిందరిని సూసైడ్ వెనుక ఓ సైకో ఉన్నాడని కిరణ్ అనుమానపడుతుంది. ఈవ్‌టీజింగ్ కేసులో పట్టుబడ్డ అరుణ్ (బ్రహ్మముడి మానస్)ను హంతకుడిగా కిరణ్ అనుమానిస్తుంది. కానీ అరుణ్ కూడా సూసైడ్ చేసుకుంటాడు. అతడి ఆత్మహత్యకు కిరణ్ కారణమని ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తారు?
అమ్మాయిల సూసైడ్ వెనుక కిరణ్ భావించినట్లుగానే సైకో ఉన్నాడా? ఆ సీక్రెట్ కిల్లర్‌ను ఆమె పట్టుకోలిగిందా? ఈ హత్యలకు రామ్ (రోషన్) అనే వ్యక్తితో ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో కిరణ్ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నది అన్నదే రక్షణ మూవీ(Rakshana Review) కథ.
పోలీస్ రోల్ ఫస్ట్ టైమ్...
సినిమా ఇండస్ట్రీలో పోలీస్ కథల సక్సెస్ రేటు ఎక్కువే, పోలీస్ క్యారెక్టర్స్ యాక్టింగ్ పరంగా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. అందుకే ఈ ఖాకీ కథల్లో నటించడానికి నాయకానాయికలు ఆసక్తిని చూసుతుంటారు. రక్షణ సినిమా కోసం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్ గా అవతారం ఎత్తింది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
నిజజీవిత ఘటనలతో
నిజజీవిత ఘటనల ఆధారంగా సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రక్షణ మూవీ స్టోరీలైన్‌ను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. ఆ పాయింట్ చుట్టూ పోలీస్ ఆఫీసర్, విలన్ డ్రామాను అల్లుకుంటూ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో చివరి వరకు గ్రిప్పింగ్‌గా ఈ సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు.
ఒకే ప్యాట్రన్...
సాధారణంగా సైకో కిల్లర్ సినిమాలు చాలా వరకు ఒకే ప్యాట్రన్‌లో సాగుతుంటాయి. వరుసగా సైకో హత్యలు చేయడంలో, ఈ సీక్రెట్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వేసే ప్లాన్స్...చివరకు ఓ సైకోకు ఓ ఫ్లాష్‌బ్యాక్ కామన్‌గా కనిపిస్తుంది. రక్షణ సినిమాలో కూడా అదే రెగ్యులర్ ఫార్ములాను డైరెక్టర్ ఫాలో అయ్యాడు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్...
కథలోని కొన్ని ట్విస్ట్‌లతో పాటు విలన్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాకుండా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీని నడిపించడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు. పాయల్ రాజ్‌పుత్ ఇన్వేస్టిగేషన్, సిటీలో అమ్మాయిలు మరణాలకు సంబంధించిన సీన్స్ తో ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. కిల్లర్‌కు సంబంధించి ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళుతూ సెకండాఫ్‌ను ఉత్కంఠగా నడిపించారు. విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ డిఫరెంట్‌గా రాసుకున్నాడు.
గ్లామర్ ఇమేజ్ ఛాయలు...
పోలీస్ పాత్రకు పాయల్ రాజ్‌పుత్ పూర్తిగా న్యాయం చేసింది. సినిమా ఆద్యంతం సీరియస్ లుక్‌లో మెప్పించింది. గ్లామర్ ఇమేజ్ ఛాయలు ఏ మాత్రం కనిపించకుండా పాత్ర కోసం చాలా కేర్ తీసుకొని నటించినట్లుగా కనిపించింది. బ్రహ్మముడి మానస్ (Brahmamudi Manas) నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఆనందచక్రపాణి, శివన్నారాయణ, రోషన్ నటన ఒకే అనిపిస్తుంది.
సైకో థ్రిల్లర్ మూవీ...
రక్షణ కొత్త పాయింట్‌తో తెలుగులో వచ్చిన సైకో థ్రిల్లర్ మూవీ. పాయల్ రాజ్‌పుత్‌ను పోలీస్ పాత్రలో చూడటం కొత్తగా ఉంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే రక్షణ మెప్పిస్తుంది.
రేటింగ్:2.75/5
టాపిక్