Rajinikanth Remuneration for Lal Salaam: అతిథి పాత్రే అయినా.. లాల్ సలామ్ కోసం రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్
06 February 2024, 14:46 IST
- Rajinikanth Remuneration for Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో రజనీది అతిథి పాత్రే అయినా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
లాల్ సలామ్ కోసం రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్
Rajinikanth Remuneration for Lal Salaam: జైలర్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు లాల్ సలామ్ మూవీతో రాబోతున్నాడు. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కానుంది. నిజానికి విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్న ఈ మూవీలో రజనీది అతిథి పాత్రే. అయినా రెమ్యునరేషన్ మాత్రం రూ.40 కోట్ల వరకూ తీసుకున్నట్లు సమాచారం.
రజనీకాంత్ లాల్ సలామ్
గతేడాది రజనీ నటించిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో రజనీ మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ మూవీకి లాభాల పంట రావడంతో రజనీ ఏకంగా రూ.200 కోట్లకుపైగా రెమ్యునరేషన్ రూపంలో అందుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఓ లగ్జరీ కారు కూడా దక్కింది.
దీంతో మరోసారి రజనీ పవర్ ఏంటో ఈ మూవీ ద్వారా తెలిసొచ్చింది. ఇక ఇప్పుడు లాల్ సలామ్ సినిమాలో అతడు అతిథి పాత్రలో నటించాడు. అంటే మూవీలో ఓ 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. దీనికి కూడా అతడు ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేయడం విశేషం. జైలర్ తర్వాత వస్తున్న రజనీ సినిమా కావడంతో లాల్ సలామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకు తగినట్లే ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో రజనీకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వాళ్లు వెనుకాడలేదు. ఈ మధ్యే లాల్ సలామ్ ఆడియో లాంచ్ జరగగా.. అందులో రజనీకాంత్ మాట్లాడాడు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా లాల్ సలామ్ మూవీ తెరకెక్కింది.
లాల్ సలామ్ వినూత్న ప్రయత్నం
లాల్ సలామ్ మూవీని ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసింది. ఆమె ఐదేళ్ల తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. అంతేకాదు ఈ మూవీ కోసం అతడు ఇద్దరు దివంగత సింగర్ల వాయిస్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీక్రియేట్ చేయడం విశేషం. బంబా బక్యా, హమీద్ ల వాయిస్ ను మరోసారి ఈ సినిమాలో ప్రేక్షకులు విననున్నారు.
దీనిపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తగా.. ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రెహమాన్ కే సాధ్యమని మరికొందరు అప్పట్లో అభిప్రాయపడ్డారు. లాల్ సలామ్ మూవీ తెలుగులోనూ ఫిబ్రవరి 9నే రిలీజ్ కానుంది. అదే రోజు టాలీవుడ్ లో రవితేజ నటించిన ఈగల్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. అంతకుముందు రోజు ఫిబ్రవరి 8న యాత్ర 2 మూవీ కూడా వస్తోంది. దీంతో ఈ వీకెండ్ టాలీవుడ్ లో ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీనే ఉండనుంది. యాత్ర 2, ఈగల్ సినిమాలతో లాల్ సలామ్ ఎలా పోటీ పడుతుందో చూడాలి.
టాపిక్